క్రికెట్ వరల్డ్ కప్ 2019: ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి

వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ పరాజయం చవిచూసింది.

308 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ సర్ఫరాజ్ (40), లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హసన్ అలీ (32), వాహబ్ రియాజ్ (45) పోరాడినా, జట్టును గెలిపించుకోలేకపోయారు.

44 ఓవర్లకు 263-7 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న పాక్ ఆ వెనువెంటనే 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.

అంతకుముందు ఆరంభంలో ఓపెనర్ ఫఖార్ జమాన్ డకౌట్ అయినా, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ (53) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

బాబర్ అజమ్ (30)తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు, ఆ తర్వాత హఫీజ్ తోడుగా మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు.

ఈ సమయంలో కమిన్స్ ఇమామ్‌ను ఔట్ చేశాడు. ఆ వికెట్ మొదలు, పాక్ 24 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 30 ఓవర్లకు 160-6తో కష్టాల్లో పడింది.

ఈ దశలో హసన్ అలీ కొన్ని మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 15 బంతుల్లోనే 32 పరుగులు సాధించాడు. దీంతో పాక్ స్కోరు 200కు చేరుకుంది.

కమిన్స్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్, రిచర్డ్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

డేవిడ్ వార్నర్ సెంచరీ

అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 107 (111 బంతులు), ఆరన్ ఫించ్ 82 (84) విజృంభించడంతో ఆస్ట్రేలియా పాక్‌ ముందు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

నిజానికి స్కోరు ఇంకా భారీగా ఉండేదే.

వార్నర్, ఫించ్ తొలుత నిదానంగా ఆడినా, ఆ తర్వాత జోరు పెంచి ఓపెనింగ్ వికెట్‌కు 146 పరుగులను జత చేశారు. అయితే, ఈ మంచి ఆరంభాన్ని ఆస్ట్రేలియా మెరుగ్గా ఉపయోగించుకోలేకపోయింది.

మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజులో పెద్దగా నిలదొక్కుకోలేదు. 49 ఓవర్లలో 307 పరుగులే చేసి ఆ జట్టు ఆలౌటయ్యింది.

33 ఓవర్లు పూర్తయ్యేసరికి 218-2 స్కోరుతో ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితిలో ఉంది. 400 పై చిలుకు స్కోరు సాధించేలా కనిపించింది.

వార్నర్ సెంచరీకి చేరువలో ఉండగా, మ్యాక్స్‌వెల్ 8 బంతుల్లోనే 20 పరుగులు చేసి జోరు మీద కనిపించాడు.

అయితే, ఆ తర్వాతి ఓవర్ నుంచి ఆసీస్ తడబాటు మొదలైంది. అఫ్రిది వేసిన 34 ఓవర్లో మూడో బంతికి మ్యాక్స్‌వెల్ 20 (10) ఔటయ్యాడు. చివరి 8 వికెట్లను ఆ జట్టు 84 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

ఆఖరికి పూర్తి కోటా ఓవర్లు ఆడలేక మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 307 పరుగులకు ఆలౌటయ్యింది.

పాక్ బౌలర్లలో ఆమిర్ (5-30) అద్భుతంగా రాణించాడు. మొత్తం పది ఓవర్లు వేసి, కేవలం 30 పరుగులే ఇచ్చి, 5 వికెట్లు తీశాడు. వార్నర్-ఫించ్ భాగస్వామ్యానికి అతడే తెరదించాడు.

అఫ్రీది (2-70) పరుగులు సమర్పించుకున్నా కీలకమైన వార్నర్, మ్యాక్స్‌వెల్ వికెట్లు పడగొట్టాడు.

హసన్ అలీ, వాహబ్ రియాజ్, మహమ్మద్ హఫీజ్ తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)