You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ శాసనసభ, లోక్‌సభలో ప్రొటెం స్పీకర్ విధులేంటి? ఈసారి ప్రొటెం స్పీకర్ ఎవరు?
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది.
ప్రధానమంత్రి సహా కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారం పూర్తైంది. ఏపీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. మంత్రివర్గ సహచరులనూ ఎంపిక చేసుకుని, వారి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంత్రులతో కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ ప్రమాణస్వీకారం పూర్తి చేయిస్తారు.
మరి, ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం చేయించేదెవరు..
లోక్‌సభ, శాసన సభలను నిర్వహించాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు కూడా సభ ప్రారంభమైన తర్వాతే ఎన్నికవుతారు. వారు కూడా ముందుగా సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయాల్సిందే.
అందుకే, ఇలా కొత్త సభ్యులందరితో ప్రమాణస్వీకారం పూర్తి చేయించేందుకు ప్రొటెం స్పీకర్ అనే తాత్కాలిక పదవిని ఏర్పాటు చేశారు.
ప్రొటెం స్పీకర్ గా ఎవరుంటారు..
ప్రొటెం స్పీకర్ ఎంపికకు కొన్ని నియమాలున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత సభ్యుల జాబితాను లోక్‌సభ లేదా శాసనసభ వర్గాలు సిద్ధం చేస్తాయి.
ఆ జాబితాలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తుంది. ఈ ప్రక్రియ పార్టీలకు అతీతంగా జరుగుతుంది.
కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత ప్రొటెం స్పీకర్ ఎంపిక పూర్తవుతుంది. ప్రొటెం స్పీకర్‌తో లోక్‌సభలో రాష్ట్రపతి, అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రమాణ స్వీకారాల వరకే..
సభలో ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణస్వీకారం చేయించడమే ప్రొటెం స్పీకర్ ఏకైక బాధ్యత.
సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేయడంతోనే ప్రొటెం స్పీకర్ పదవీకాలం ముగుస్తుంది.
ఆ తర్వాత కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
సభా నిర్వహణను వారికి అప్పగించి ప్రొటెం స్పీకర్ తప్పుకొంటారు.
గత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన కమల్‌నాథ్ ప్రొటెం స్పీకర్‌గా ఉన్నారు.
ఈసారి బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలున్నాయి. ఎంపీగా గెలవడం ఆమెకు ఇది ఎనిమిదో సారి. ఈ జాబితాలో మరికొందరు కూడా ఉన్నారు.
ఏపీలో చంద్రబాబే సీనియర్..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచిన పతివాడ నారాయణ స్వామి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు ఎమ్మెల్యేగా ఎన్నికవడం అప్పుడు ఎనిమిదో సారి.
ఈసారి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తికర చర్చ సాగింది.
కొత్త శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందరికన్నా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
1978 నుంచి ఇప్పటివరకూ చంద్రబాబు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే, ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి, మూడోసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తరుణంలో ఆయన తర్వాత సీనియర్‌కు ఆ అవకాశం వస్తుందని భావించారు.
ఇంకా సీనియర్లున్నా..
సీనియార్టీ ప్రకారం చూస్తే చంద్రబాబు తర్వాత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉంటారు. ఇప్పటివరకూ వీరు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
అయితే, నాలుగో సారి శాసనసభకు ఎన్నికైన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుకి ఈసారి ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది.
ఎన్టీఆర్‌తో కలిసి1983లో టీడీపీ తరపున తొలిసారిగా శంబంగి అప్పలనాయుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1985,94లో కూడా గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో శంబంగి వైసీపీ తరఫున పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి సుజయ కృష్ణ రంగారావుపై గెలిచారు.
సీనియర్లు ఉన్నా, శంబంగికి అవకాశం రావడం చర్చనీయాంశమైంది.
ప్రొటెం స్పీకర్ వ్యవహారంలో పాలకపక్ష నిర్ణయమే కీలకమని రాజకీయ పరిశీలకులు అయినం ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
''ఈ ఎంపిక పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ప్రొటెం స్పీకర్ రాజకీయ రహితంగా వ్యవహరించే పదవి అయినా, అధికార పార్టీ తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. విపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా సీనియర్‌కే అవకాశం ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి దానికి కొంచెం భిన్నంగా సాగుతోంది,. అయినా, పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
- ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం
- మోదీ మంత్రివర్గంలోని మహిళల్లో ఎవరేంటి
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000 పంచారు.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం’’
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)