You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అప్పుడు టీడీపీ.. ఇప్పడు కాంగ్రెస్.. టీఆర్ఎస్‌లో శాసనసభా పక్షాల విలీనం
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో రాష్ట్రంలోని కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనమైంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి కోరగా.. అనంతరం విలీనాన్ని ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నప్పటికీ శాసనసభలో మాత్రం ఆ పార్టీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసిపోయింది.
తెలంగాణ శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్షం ఈ విలీనంతో కనుమరుగై ఎంఐఎం రెండో పెద్ద పార్టీగా అవతరించింది.
గత శాసన సభలో అంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం కూడా ఇలాగే టీఆర్ఎస్‌లో విలీనమైంది.
పార్టీల విలీనం ఎలా?
సాధారణంగా ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి మారితే వారిపై అనర్హత వేటు పడుతుంది. అంటే వారి పదవి పోతుంది. వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేలు మాటిమాటికీ పార్టీలు మారకుండా ఈ రూల్ తెచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఈ నిబంధన ఉంది. ఇంతకు ముందు పార్టీ మారాలనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేసేవారు.
నేతల్లో నైతికత తగ్గిపోవడంతో పార్టీ ఫిరాయింపులు అదుపు చేయడం కోసం ఈ రూల్ తీసుకొచ్చారు. అయితే ఇందులో ఒక మినహాయింపు ఉంది.
ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది ఆ పార్టీ వదిలి కొత్త పార్టీ పెట్టాలని అనుకున్నా, లేదా వేరే పార్టీలోకి మారాలని అనుకున్నా, వారిపై అనర్హత వేటు పడదు.
వారు ఏ సమస్యా లేకుండా తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపి పదవుల్లో కొనసాగవచ్చు.
సరిగ్గా నిబంధనలోని ఈ లొసుగునే ఉపయోగించుకున్న అధికార పార్టీలు ఇతర పార్టీలు తమలో విలీనం అయ్యేందుకు పచ్చజెండా ఊపాయి.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఈ నిబంధనను చాలా బాగా ఉపయోగించుకుంది. అప్పట్లో తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలను తనలో విలీనం చేసుకుంది.
ఒక్కొక్క ఎమ్మెల్యే విడిగా పార్టీ మారితే, వారిపై వేటు పడుతుంది. అందుకే, ఎమ్మెల్యేలందరూ ముందే మాట్లాడుకుంటారు.
సుమారు మూడింట రెండొంతుల మంది విలీనం అయ్యేందుకు ఒప్పుకోగానే వారంతా ఒకేసారి బయటకు వచ్చి తమ పార్టీని అధికార పార్టీలో విలీనం చేయాలని స్పీకర్‌ని కోరుతారు. ఆయన నిబంధనల ప్రకారం వారిని విలీనం చేస్తారు.
ఎన్నికలను ఎదుర్కోవడమే కాకుండా, పార్టీ మారే వారి ద్వారా బలం పెంచుకోవాలనుకునే అధికార పార్టీలకు ఈ దారి బాగా ఉపయోగపడుతోంది.
ఎప్పుడెప్పుడు ఎవరెవరు?
తెలంగాణ మొట్టమొదటి శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి.
ఇదే నిబంధనలను ఉపయోగించిన టీఆర్ఎస్ ఆ రెండు పార్టీల శాసన సభా పక్షాలనూ తమలో విలీనం చేసుకుంది.
2018 డిసెంబరులో కూడా తెలంగాణ శాసన మండలిలోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలను అధికార పార్టీ ఇలాగే తమలో కలిపేసుకుంది.
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఉత్తమ కుమార్ రెడ్డి తాజాగా ఎంపీగా గెలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దీంతో కాంగ్రెస్ సంఖ్య 18కి చేరింది. వీరిలో మూడింట రెండొంతులు అంటే 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకరును కలిసి కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరారు.
నిజానికి వీరిలో 11 మంది ఇప్పటికే టిఆర్ఎస్‌తో టచ్‌లో ఉండగా, తాజాగా గురువారం కేటీఆర్‌తో సమావేశమైన రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు.
స్పీకర్ ని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు:
- పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి - మహేశ్వరం నియోజకవర్గం
- జాజుల సరేందర్ - ఎల్లారెడ్డి
- రేగ కాంతారావు - పినపాక
- కందాల ఉపేందర్ రెడ్డి - పాలేరు
- హరిప్రియ - ఇల్లందు
- వనమా వేంకటేశ్వర రావు - కొత్తగూడెం
- చిరుమర్తి లింగయ్య - నకిరేకల్
- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి - ఎల్బీనగర్
- ఆత్రం సక్కు - ఆసిఫాబాద్
- బీరం హర్షవర్థన్ రెడ్డి - కొల్లాపూర్
- గండ్ర వేంకట రమణా రెడ్డి - భూపాలపల్లి
- రోహిత్ రెడ్డి - తాండూరు
కాంగ్రెస్ కి మిగిలిన ఎమ్మెల్యేలు:
- మల్లు భట్టి విక్రమార్క, మధిర
- జగ్గా రెడ్డి, సంగారెడ్డి
- దుద్దిళ్ల శ్రీధర బాబు, మంథని
- పొడెం వీరయ్య, భద్రాచలం
- కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, మునుగోడు
- దనసారి అనసూయ (సీతక్క), ములుగు
(ఉత్తమ కుమార్ రెడ్డి, హుజూర్ నగర్ - రాజీనామా)
ఇక టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) ఇప్పటికే టిఆర్ఎస్‌లో చేరిపోగా, మెచ్చా నాగేశ్వర రావు (అశ్వారావుపేట) మాత్రం ఇంకా ఆ పార్టీలోనే తెలుగుదేశంలోనే ఉన్నారు.
ఇండిపెండెంట్ గా గెలిచిన లవుద్యా రాములు (వైరా), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచిన కోరుకంటి చంద్ర పటేల్ (రామగుండం) ఎన్నికల తర్వాత టిఆర్ఎస్‌లో చేరిపోయారు.
తాజా పరిణామంతో తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ బలం 91 నుంచి 103కి పెరుగుతుంది. అంతేకాదు కాంగ్రెస్ గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. ఇక ఆ హోదా ఎవరికీ ఉండదు.
కాకపోతే అధికార పక్షం తరువాత అత్యధిక సీట్లు ఉన్న పార్టీగా ఎంఐఎంకు ప్రతిపక్ష గుర్తింపు ఉంటుంది (అధికారిక కాదు).
ప్రస్తుతానికి ఎంఐఎం కూడా టిఆర్ఎస్ మిత్రపక్షమే కావడంతో మిగిలిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.
విలీనంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకులు ఉత్తమ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీలు శాసస సభ ఎదుట నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తమకు అందుబాటులోకి లేరని ఉత్తమ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన తమకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా రహస్యంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిశారని ఆరోపించారు.
''ఈమాత్రం దానికి అసెంబ్లీ ఎందుకు, స్పీకర్ ఎందుకు, ఏం చేయాలని, అసెంబ్లీ తీసేసి మీ ఫామ్ హౌస్ లో పెట్టుకోండి.'' అని ఉత్తమ్ కేసీఆర్‌ను ప్రశ్నించారు.
విలీనంలో స్పీకర్ల పాత్ర
ఈ పార్టీ విలీనాలలో స్పీకర్లు కీలక పాత్ర పోషించారు. ఒక్కో ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే, ప్రతిపక్షాల ఫిర్యాదులను పట్టించుకోకుండా, అధికార పక్షానికి కావల్సినంత మంది వచ్చాక, వారిచ్చే అభ్యర్థనను స్వీకరిస్తూ తన విశిష్ట అధికారాలను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగిస్తున్నారన్న విమర్శలున్నాయి.
స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేకపోవడమే వారికి బలం అవుతోంది.
తెలంగాణలోనే కాదు, గత సభలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై వైసీపీ ఇలాంటి విమర్శలే చేసింది.
అప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఆయన చర్య తీసుకోలేదు. వారి ఫిర్యాదులను అలానే ఉంచేశారు.
ఇవి కూడా చదవండి:
- మామిడిపండు కోస్తే మనిషిని చంపేస్తారా.. అసలేం జరిగింది
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)