You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
నరేంద్ర మోదీ కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న కొత్త ముఖం ప్రతాప్ చంద్ర సారంగి. తెల్లని బట్టలు, పెరిగిన గడ్డంతో చాలా సాధారణంగా కనిపించే ఈయన సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా పాపులర్. ప్రమాణ స్వీకార వేదికపైకి ఆయనకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు.
ఒడిశాకు చెందిన ఈయన గురించి ఆ రాష్ట్రం బయట ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి గత వారం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో సోషల్ మీడియాలో సారంగి ఫొటోలు వైరల్ అయ్యాయి.
అతి సాధారణ వస్త్రధారణ, వెదురు కర్రలతో నిర్మించిన ఓ గుడిసె నుంచి దిల్లీకి పయనమైన సారంగిని చూసి దేశం మొత్తం అబ్బురపడింది. కానీ ఆయన గత జీవితం కొద్దిగా వివాదాస్పమే.
1999లో ఆస్ట్రేలియన్ క్రైస్తవ మిషనరీకి చెందిన గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలను కొందరు హిందూ మూక సజీవ దహనం చేశారు. ఆ సమయంలో భజరంగ్ దళ్ ఒడిశా విభాగం అధ్యక్షుడిగా ప్రతాప్ సారంగి ఉన్నారు. అంతకు ముందు ఆయన విశ్వహిందూ పరిషత్‌లో కీలక సభ్యుడిగా పనిచేశారు.
గ్రాహం స్టెయిన్స్ హత్యకు భజరంగ్ దళ్‌దే బాధ్యత అంటూ స్థానిక క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. కానీ, ఈ హత్యలతో ఏ ఒక్క సంస్థకో సంబంధం లేదని ఆ తర్వాత జరిగిన అధికారిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది.
సుదీర్ఘ విచారణ తర్వాత, 2003లో భజరంగ్ దళ్‌కు చెందిన దారాసింగ్‌తో పాటు 12 మందిని దోషులుగా నిర్ధరిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. కానీ దారా సింగ్‌కు విధించిన మరణశిక్షను జైలు శిక్షగా తగ్గిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
జీవిత ఖైదు పడిన మరో 11 మంది కూడా విడుదలయ్యారు. వారికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలూ లేవంటూ హైకోర్టు వారిపై అభియోగాలను కొట్టేసింది.
సారంగి చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, అలానే నాతో కూడా ఓసారి మాట్లాడారు అని ఒడిశాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సందీప్ సాహు అన్నారు. భారత దేశంలో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలను చీడ పురుగులుగా ఆయన ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
గ్రాహం స్టెయిన్స్ హత్య జరిగిన తర్వాత ఆ గ్రామంలోనే సారంగిని కలిశారు సాహు. ఆ సమయంలో సారంగి ఆ హత్యలను ఖండించారు.
2002లో ఒడిశా అసెంబ్లీపై భజరంగ్ దళ్, ఇతర హిందూ అతివాద గ్రూపుల దాడికి పాల్పడిన ఘటనలో అల్లర్లు , ఆస్తుల దహనం, దౌర్జన్యం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి నేరాలపై ఆయన అరెస్టయ్యారు.
ఇవేమీ ఆయనను సోషల్ మీడియాలో పాపులర్ చెయ్యలేదు. కానీ, ఆయన ప్రస్తుత జీవనశైలే ఆయనకు ఇప్పుడు ఈ పాపులారిటీని తెచ్చిపెట్టింది.
"తన నియోజకవర్గం మొత్తం సైకిల్‌పైనే తిరుగుతారు సారంగి. ప్రతి గ్రామానికీ సైకిల్ పైనే వెళ్లి ఓటర్లను కలుసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలకు రావడానికి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ రోడ్లపై నడుస్తూ, సైకిల్ తొక్కుతూ చాలాసార్లు కనిపిస్తూనే ఉంటారు. రోడ్ల పక్కనే ఉన్న చిన్న చిన్న హోటళ్లలో ఆహారాన్ని తింటూ, రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం వేచి ఉండటం... ఇవన్నీ ఆయనకు సర్వసాధారణ విషయాలు" అంటారు సాహు.
ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో బలమైన, ధనవంతులైన ప్రత్యర్థులతో పోటీపడి సారంగి గెలిచారు.
కేంద్ర మంత్రిగా సారంగి ప్రమాణం చేయడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆయన మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు. కొంతమంది సారంగిని "ఒడిశా మోదీ" అని పిలుస్తున్నారు.
"ఒక్కోసారి ఒక్కో వ్యక్తికి సంబంధించిన ఓ చిన్న ఫొటో వైరల్‌గా మారుతుంది. దీంతో వారు హీరోలైపోతారు. ఆ సమయంలో వారి గత చరిత్ర ఏంటనేది ఎవరికీ పెద్దగా అవసరం ఉండదు. సోషల్ మీడియాతో ఉన్న సమస్య ఇదే" అని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి.
- గ్రాహం స్టెయిన్స్ హత్య: భారత్‌లో ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా జరిగిన మొదటి మూకదాడి, హత్య ఇదేనేమో - Ground Report
- తియనాన్మెన్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- భారత 15వ ప్రధానిగా మోదీ.. అమిత్ షా, కిషన్ రెడ్డి సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- ఆ గ్రహంపై వజ్రాల వర్షం
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘టీఎంసీ ఎంపీలు మిమి, నుస్రత్ వేసుకున్న దుస్తుల్లో తప్పేంటి’
- ఎవరీ నెసమణి.. ఆయన కోలుకోవాలని ట్విటర్‌లో జనాలు ఎందుకు ప్రార్థిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)