You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోదీ రోడ్‌షో అంటూ వాజ్‌పేయీ అంతిమయాత్ర వీడియోను షేర్ చేస్తున్నారా?- BBC Fact Check
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
నరేంద్ర మోదీ భారీ జనసందోహంతో వారణాసిలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్నట్టుగా చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"గౌరవనీయులు నరేంద్ర మోదీ తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్తున్నారు" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
పూల దండలతో అలంకరించిన వాహనం వెనుక మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండటాన్ని చూడొచ్చు. వారివెనుక భద్రతా సిబ్బంది, భారీ ఎత్తున జనం వెళ్తున్నారు.
గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 26న వారణాసిలో ఆయన నామినేషన్ వేశారు.
రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో వేలసార్లు షేర్ చేశారు.
రెండు వారాల క్రితం కూడా ఇదే తరహా క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అప్పటికి నరేంద్ర మోదీ ఇంకా నామినేషన్ వేయలేదు.
"నామినేషన్ వేయడమంటే ఇది. మీరు కళ్లు తెరవండి, సింహం ఎలా నడుస్తోందో చూడండి" అని క్యాప్షన్ పెట్టారు.
అయితే, అది తప్పుడు వాదన అని మా పరిశీలనలో తేలింది. ఈ వీడియో పాతది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు దానికి ఎలాంటి సంబంధం లేదు.
వీడియోలో ఉన్న వాస్తవమేంటి?
ఈ వీడియో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్రకు సంబంధించినది.
పూలదండలతో అలంకరించి ఉన్న ఆ వాహనంలో వాజ్‌పేయీ భౌతిక కాయం ఉంది.
రివర్స్ సెర్చ్ టూల్ ద్వారా వెతికినప్పుడు వాజ్‌పేయీ అంత్యక్రియలకు సంబంధించిన పలు మీడియా కథనాలు వచ్చాయి.
2018 ఆగస్టు 16న వాజ్‌పేయీ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 17న అధికారిక లాంఛనాలతో దిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకుముందు దాదాపు తొమ్మిది వారాలుగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు.
వాజ్‌పేయీ తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని నరేంద్ర మోదీ అప్పుడు అన్నారు.
వాజ్‌పేయీ 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి అయిదేళ్లు దేశ ప్రధానిగా సేవలు అందించారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- BBC FACT CHECK: అడ్వాణీని అమిత్ షా అవమానించారా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?
- తొమ్మిది మంది హత్యకు ఇద్దరు బాలికల కుట్ర
- అబూదాబిలో 13.5 ఎకరాల్లో హిందూ మందిర నిర్మాణం... విశేషాలివే
- శ్రీలంక పేలుళ్లు: బురఖా ధరించిన ఈ వ్యక్తి బౌద్ధ మతస్థుడా? ఈ వీడియోలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)