You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్యామ్ శరణ్ నేగి: స్వతంత్ర భారత తొలి ఓటరు మృతి
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఓటరు శ్యామ్ శరణ్ నేగి 106 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలం కాల్పాలో శనివారం ఉదయం ఆయన మృతిచెందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కిన్నౌర్ జిల్లా కలెక్టర్ చెప్పారు.
శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కును 34 సార్లు వినియోగించుకున్నారు. చివరిగా నవంబర్ 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ 14వ శాసనసభ ఎన్నికల్లో తన నివాసం నుంచి పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేశారు.
ఒక్కసారి కూడా ఓటు హక్కు మిస్ చేసుకోలేదు
దేశంలో ప్రస్తుతం 91 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యంత పెద్ద వయస్కుల్లో శ్యామ్ శరణ్ నేగి ఒకరు. ఈయన వయసు 106 ఏళ్లు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయా పర్వతాల నడుమ ఉన్న కల్పా గ్రామానికి చెందిన ఆయన 1917 సెప్టెంబర్ 4న జన్మించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 1951- 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని ఇప్పటి వరకు తాను ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదని శ్యామ్ శరణ్ అంటున్నారు. ఈసారి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
2010లో ఎన్నికల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కల్పా గ్రామాన్ని సందర్శించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా నేగిని సత్కరించారు.
"స్వాతంత్ర్యం అనంతరం దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ రోజు నేను మరో ఊరిలో ఎన్నికల విధుల్లో ఉన్నాను. ఓటు వేయాలంటే మా ఊరుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో, నాకు ఓటు వేయాలని ఉందని ప్రిసైడింగ్ అధికారికి చెప్పాను. ఆయన అనుమతి ఇవ్వడంతో మా ఊరెళ్లి ఓటు వేశాను" అని శ్యామ్ శరణ్ నేగి తొలి ఎన్నికల నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
ఓటు హక్కు అనేది మన చేతుల్లో ఉన్న సంపద అని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన అంటున్నారు.
"ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ఓటెయ్యకుండా ఉండలేదు. యువ ఓటర్లందరూ ఓటు వేయాలి. యువ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ ఓటు ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే, దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే మార్గం ఇదే. ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది" అని నేగి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)