You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2019: 'టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీలు ఈసారి కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చు' :అభిప్రాయం
- రచయిత, కల్యాణీ శంకర్
- హోదా, బీబీసీ కోసం
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకీ 272 మ్యాజిక్ ఫిగర్, అంటే మెజారిటీ దక్కకపోతే, ప్రభుత్వ ఏర్పాటులో మూడు ప్రాంతీయ పార్టీలు చాలా కీలక పాత్ర పోషించేలా కనిపిస్తోంది.
ఆ మూడు పార్టీలు-ఒడిశాలోని బిజూ జనతాదళ్(బీజేడీ), ఆంధ్ర ప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్(వైసీపీ), తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)
2014లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత నుంచి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఒక విధంగా ముగిసిపోయింది. కానీ, ఇప్పుడు 2019లో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి అవసరం ఏర్పడవచ్చనే చర్చలు జోరందుకున్నాయి. అలాంటప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుంది.
ఈ జాబితాలో బహుజన్ సమాజ్ పార్టీని కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత మాయావతి గురించి కచ్చితంగా అప్పుడే ఏదీ చెప్పలేం. ఎన్నికల తర్వాత ఆమె బీజేపీకి మద్దతు పలకవచ్చు.
బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మూడు పార్టీలూ ఆయా రాష్ట్రాల్లో మెరుగైన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది.
2014లో మోదీ పవనాలు జోరుగా వీచినప్పుడు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాయి. ఈసారి కూడా బీజేడీ తన జోరు కొనసాగిస్తుందని భావిస్తున్నారు. వైసీపీకి కూడా కనీసం 12 స్థానాలు రావచ్చని చెప్పుకుంటున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది(మొత్తం 119 స్థానాల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది). లోక్‌సభలో ఆ పార్టీకి 11 స్థానాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు గణాంకాల కలిపితే, లోక్‌సభలో ఆ పార్టీల వారే 63 మంది ఎంపీలు ఉంటారు.
ఇప్పుడు ఈ గణాంకాలకు బీఎస్పీని కూడా కలిపి చూస్తే, ఉత్తర ప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయి. అంటే వీటిలో చాలా స్థానాల్లో బీజేపీ వెనుకంజ వేయవచ్చు. కానీ ఆ స్థితిలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈ నాలుగు ప్రాంతీయ పార్టీలూ మహాకూటమిలో భాగం కావు. అవి కాంగ్రెస్‌కు కూడా మద్దతివ్వవు.
మరింత బలోపేతమైన ప్రాంతీయ పార్టీలు
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఓట్ల వాటా క్రమేణా తగ్గుతోంది. ఇటు ప్రాంతీయ పార్టీల ఓట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన 55 పార్టీల్లో 18 ప్రాంతీయ పార్టీలే. 2004లో 36 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2014లో 31 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి.
2019లో ప్రాంతీయ పార్టీలు దాదాపు 150 నుంచి 180 స్థానాలకు తమ అభ్యర్థులను నిలిపాయి. ఈ నియోజకవర్గాల్లో జాతీయ పార్టీలకు అంతగా ప్రాధాన్యం ఉండదనే భావిస్తున్నారు. ఈ స్థానాల్లో 'ప్రాంతీయ గౌరవం' అనేది అత్యంత ముఖ్యమైన అంశం కాబోతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ఎన్టీ రామారావు 'తెలుగు ప్రజల ఆత్మగౌరవం' అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేశారు. అదే అంశంతో భారీ విజయం అందుకున్నారు.
స్వయంగా ప్రధాన మంత్రి మోదీ కూడా తన సొంతరాష్ట్రంలో 'గుజరాతీ గుర్తింపు' గురించి మాట్లాడుతున్నారు.
2015లో బిహార్‌లో ఏర్పడిన మహాకూటమి కూడా 'బిహారీల గౌరవం' కోసమే పుట్టింది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ కోసం ఓటు వేయాలని అనుకోవడం వెనుక 'బిజూ జననాయక్' ఇమేజే కారణం.
మనం 2014 విషయానికి వస్తే కర్ణాటక మినహా వేరే ఏ దక్షిణ భారత రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభావం కనిపించలేదు. ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే జరిగింది.
కాంగ్రెస్, బీజేపీ ఓటు స్వింగ్ ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల షేర్ మొదట్లో ఎంత ఉండేదో దాదాపు అంతే కనిపించింది. అంటే 2009లో 212 స్థానాల్లో ప్రాంతీయ పార్టీల ఓట్ షేర్ 46.7 శాతం అయితే, 2014లో కూడా వాటికి 46.6 శాతం ఓట్ షేర్ వచ్చింది.
కాంగ్రెస్ బలహీనపడిన తర్వాత ఎన్నికల్లో దిగిన ప్రాంతీయ పార్టీలు చాలా మెరుగైన ప్రదర్శన చూపించాయి. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల బయట ఎంపీ స్థానాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.
ఎన్నికల కమిషన్ గణాంకాలనే చూస్తే ఏఐడీఎంకే, బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతీయ పార్టీలు తమ తమ ప్రాంతాల్లో బలోపేతం అయ్యాయి. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ కూడా తమ ఓటే షేర్ నిలబెట్టుకున్నాయి. ఒక్క సీటు గెలుచుకోకపోయిన బీఎస్పీ కూడా తన 19 శాతం ఓట్ షేర్ నిలబెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో
ఒక విధంగా చూస్తే బీజేపీకి కాంగ్రెస్‌తో పోటీపడడం ఎంత సులభమో ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం అంతే కష్టం కాబోతోంది.
ప్రాంతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రం సమస్యలు వేరువేరుగా ఉంటాయి. వాటిని వేరువేరుగా చూడడం చాలా అవసరం. 2014 తర్వాత నుంచి చూస్తే బీజేపీకి ప్రాంతీయ పార్టీల చేతుల్లో పరాభవమే ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2014లో వైసీపీ చిన్న వ్యత్యాసం కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఎందుకంటే అధికార టీడీపీ, వైసీపీ మధ్య వోట్ షేర్ వ్యత్యాసం 2 శాతం కంటే తక్కువగా నమోదైంది. అక్కడ ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి.
అటు టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. టీడీపీకి యాంటీ ఇంకుబెన్సీ భయం కూడా ఉంది. రాష్ట్రంలో వైసీపీ, కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు అంటే రెడ్డి సమాజం ప్రాతినిధ్యం ఉంది. రాయలసీమను పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కోటగా భావిస్తుంటే, కోస్తాను టీడీపీ కోటగా చెబుతున్నారు.
తెలంగాణ ఎన్నికల బరిలో
తెలంగాణ పార్టీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 'సాటిలేని తెలంగాణ' ఆలోచనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను తాను తెలంగాణ బిడ్డగా చెప్పుకునే ఆయన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 'తెలంగాణ ఆత్మగౌరవం' అంశంతో ఎన్నికల బరిలో దిగారు. ఆయనకు మెజారిటీ కూడా లభించింది.
గత ఐదేళ్లుగా తెలంగాణలో ప్రతిపక్షం ఉనికి దాదాపు లేనట్టే కనిపించింది. మరోసారి చంద్రశేఖర్ రావు మెజారిటీతో ముందుకు రావడం కూడా కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ విభజన కోసం చంద్రశేఖర్ రావు యూపీఏ చీఫ్ సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. కానీ కేంద్రంలో ఆయన కాంగ్రెస్‌కు బదులు బీజేపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి చేయందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆయనకు జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టాలనే కోరిక కూడా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్‌ను బీజేపీ టీమ్‌గా చెబుతోంది.
ఒడిశా ఎన్నికల బరిలో
ఉత్తర భారత్‌లోని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం అందుకున్న తర్వాత బీజేపీ ఒడిశాలో కూడా కాలు మోపాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ 19 ఏళ్లు వరసగా ముఖ్యమంత్రిగా ఉన్న బీజేడీ నేత నవీన్ పట్నాయక్ కూడా ఐదో సారి ముఖ్యమంత్రి అయ్యే రేసులో ఉన్నారు.
ఇక్కడ ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఇది చాలా ముఖ్యమైన మైదానంగా మారుతోంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 21లో 20 స్థానాల్లో విజయం సాధించింది. 44.8 శాతం ఓటు షేర్ నిలబెట్టుకుంది. ఆ సమయంలో దేశంలో మోదీ ప్రభావం ఉన్నా బీజేపీ ఇక్కడ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ పార్టీ ఓట్ షేర్ 21.9 శాతంగా నమోదైంది.
ఇక నవీన్ పట్నాయక్‌కు ఇక్కడ అనుకూలంగా ఉన్న అంశం ఏదంటే, రాష్ట్రంలో మొదటి నుంచీ ఒక బలమైన విపక్షం అంటూ లేదు.
ఒడిషాలో ఈసారీ త్రికోణీయ పోరు జరగబోతోంది. ఇందులో బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడబోతున్నాయి. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్‌కు యాంటీ-ఇంకుబెన్సీ భయం ఉందా అనడానికి ఎలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఆయనకు ఇప్పటికీ చాలా పాపులారిటీ ఉంది.
2009 వరకూ ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న బీజేడీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ రెండింటితో సమాన దూరం పాటిస్తోంది. కానీ పార్లమెంటులో వివిధ అంశాల్లో మాత్రం ఆ పార్టీ బీజేపీకి మద్దతు అందించింది. అందుకే ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీకి అవసరమైతే బీజేడీ వారి వెంట నిలుస్తుందనే విషయాన్ని కొట్టిపారేయలేం.
క్లుప్తంగా చెప్పాలంటే ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితిలో ఈ ప్రాంతీయ పార్టీల డిమండ్ అమాంతం పెరిగిపోవచ్చు. ఆ పార్టీలకు కూడా ఈ ఎన్నికల్లో తమ ప్రాధాన్యం ఎంతో తెలుసు. ఈ విషయం తెలిసిన బీజేపీ కూడా దానికి సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- టీఎన్ శేషన్: దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్‌ఫాస్ట్
- ఏపీ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది
- ‘దక్షిణ భారతదేశాన్ని మోదీ పట్టించుకోవట్లేదు.. అందుకే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నా’
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)