You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇస్రో ఏర్పాటులో నెహ్రూ పాత్ర ఏమీ లేదనే ప్రచారం నిజమేనా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటులో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. బుధవారం నాడు 'మిషన్ శక్తి' (ఏశాట్) ప్రయోగం ద్వారా ఉపగ్రహాన్ని కూల్చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత ఈ పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి.
భారత్ గ్లోబల్ స్పేస్ పవర్‌గా అవతరించిందని మోదీ బుధవారం నాడు అనూహ్యంగా జాతినుద్దేశించి ప్రకటన చేశారు. దీనిపై కొన్ని మితవాద సోషల్ పేజీల్లో ప్రశంసలు కురిశాయి. మరోవైపు, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని ఈ ప్రకటన చేశారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే కొన్ని పేజీల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
"1964 మే 27న నెహ్రూ మరణించారు. ఆ తర్వాత 1969 ఆగస్టు 15న ఇస్రో ఏర్పాటైంది" అని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో పేర్కొంటున్నారు.
వీటిని సోషల్ మీడియా వేదికలపై వేల మంది చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు.
అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని మా పరిశీలనలో తేలింది.
వాస్తవమేంటి?
ఇస్రో ఏర్పాటుకు నెహ్రూ పునాది రాయి వెయ్యలేదు అనే మాట నిజం కాదు.
ఇస్రో 1969లో ఏర్పాటైంది. అయితే అంతకు ముందే, అంటే నెహ్రూ మరణానికి రెండేళ్ల ముందు, 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) ఏర్పాటైంది. దీని ఏర్పాటులో అప్పటి ప్రధాని నెహ్రూ, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్‌లదే కీలక పాత్ర.
ఈ పరిశోధన సంస్థ ఏర్పాటలో నెహ్రూ ప్రభుత్వం, డాక్టర్ సారాభాయ్ చేసిన కృషి గురించి ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రస్తావన ఉంది.
"1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్)ని ప్రభుత్వం ఏర్పాటుచేయడం ద్వారా అంతరిక్ష రంగంలో కాలుమోపాలని భారత్ నిర్ణయించింది. భూమికి సుదూరంగా ఉన్న వాతావరణంపై పరిశోధనకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మార్గదర్శనంలో ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్ తిరువనంతపురంలో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) ను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1969లో ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్ స్థానంలో ఇస్రో ఏర్పాటైంది" అని ఇస్రో వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఆగస్టు 1969లో ఇస్రో ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి.
- అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేశాం..: నరేంద్ర మోదీ
- నరేంద్ర మోదీ ప్రభావం దక్షిణ భారతంలో ఎందుకు లేదు...
- ఇస్రో అవసరాలు తీర్చకుండా ఇందిర కుటుంబం చార్టర్డ్ విమానంలో పార్టీ చేసుకుందా...
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- ‘ఏపీలో ముందు స్కాములు ప్లాన్ చేసి తరువాత స్కీములు ప్రవేశపెడుతున్నారు’
- దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరో తెలుసా
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- ఐపీఎల్2019: అంపైర్ తప్పిదం వల్ల కోహ్లీ సేన ఓడిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)