You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నరేంద్రమోదీ: ‘కేంద్ర పథకాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు’
తెలంగాణ భవిష్యత్తును ప్రజలు కాకుండా జ్యోతిష్కులు నిర్ణయిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘జ్యోతిష్కులు చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వం వింటోంది. లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే మోదీ ముందు నిలవలేక ఓడిపోతారని కేసీఆర్‌కు జ్యోతిష్కులు సలహా ఇవ్వడంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అధికారంలోకి వచ్చి మూడు నెలల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు’’ అని విమర్శించారు.
ఐదేళ్లుగా ఈ దేశానికి కాపాలాదారుడిగా ఉండి ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడితే తనపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
‘‘మా పాలనలో సామాన్యుడు నిర్భయంగా బతుకుతున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేశాం. ఇటీవల ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలిపాం’’ అని తెలిపారు.
‘‘ఏప్రిల్ 11న మీరు ఓటు వేసేది ఎంపీని ఎన్నుకునేందుకో, ప్రధానిని ఎన్నుకునేందుకో కాదు. నవభారత నిర్మాణానికి ఓటు వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గహ్రించాలి‘‘ అని చెప్పారు.
‘‘వారి నాయకుడు ఎవరో తెలియదు, వారి విధానాలు ఏమిటో తెలియదు. కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసమే పేదలు, దళితులు, అణచివేతకు గురైనవారిని వాడుకుంటూ మోసం చేస్తున్నారు. మేం మాత్రం దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ చాలా అదృష్టవంతుడు తెలంగాణ రాగానే ఆయన ముఖ్యమంత్రయ్యారు. వారి కుటుంబంలో అందరికీ పదవులొచ్చాయి. కానీ, తెలంగాణ యువకులకు మాత్రం ఒక్క ఉద్యోగం రాలేదు.
ప్రజలను గాలికొదిలేసే తన కుటుంబం కోసమే కేసీఆర్ పని చేస్తున్నారు’’ అని విమర్శించారు.
టీఆర్ఎస్, ఎంఐఎం చేతులు కలిపింది ప్రజల కోసం కాదని, ఓట్ల కోసమని ప్రజలు గుర్తించాలి అని కోరారు.
తెలంగాణలో మేం ప్రవేశపెట్టిన అనేక పథకాలను కేసీఆర్ ప్రభుత్వం వారి పేరుతో ప్రచారం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణకు అందకుండా చేయడం సరికాదని చెప్పారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఇంటి నిర్మాణ పథకాలను తెలంగాణలో ప్రజలకు చేరువకాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రధానివన్నీ పచ్చి అబద్ధాలు: కేసీఆర్
కాగా మోదీ విమర్శలపై తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాట్లాడిన ఆయన దేశ ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బీజేపీ తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ ఉనికిలో లేదన్నట్లుగా మాట్లాడిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 118 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క చోట బీజేపీ గెలిచిందని.. ఇప్పుడు అదే బీజేపీ పెద్దపెద్ద మాటలు చెబుతోందంటూ ఎద్దేవా చేశారు.
ఆయుష్మాన్‌భవ మన ఆరోగ్యశ్రీకి కాపీ
''మోదీ మనకు నకలు కొట్టి ఆయుష్మాన్ భవ తెచ్చాడు.. అది ఆకుకు అందదు, పోకకు పొందదు.. మన ఆరోగ్య శ్రీ బదులు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్న 25 శాతం మందికి నష్టం కలుగుతుంది'' అన్నారు.
అయిదేళ్లయింది మోదీ వచ్చి ఏం పని జరిగింది దేశానికి అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ''రైతులకు ఏమైనా చేశారా.. గిరిజనులు, బీసీలకు ఏమైనా చేశారా.. ముస్లిం మైనారిటీలకు ఎలాగూ చేయరు మీరు'' అంటూ మండిపడ్డారు.
తనకున్న తాజా సమాచారం ప్రకారం ఎన్డీయేకు 150 సీట్లు దాటి రావని.. కాంగ్రెస్‌కి 100 సీట్లు దాటి రావని.. మే 23 తరువాత ప్రాంతీయ పార్టీల పాలన వస్తుందని కేసీఆర్ జోష్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)