గాంధీనగర్ - అమిత్ షా: ''బీజేపీ ఓటర్లను అర్థం చేసుకోవాలంటే... ఈ నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి''

    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం సుదీర్ఘ కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది.

అమిత్ షా రాజకీయ ప్రస్థానం గాంధీనగర్ నుంచే మొదలైంది.

1989 నుంచి బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గాంధీనగర్‌తోపాటు అహ్మదాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ, శంకర్ సిన్హ్ వాఘేలా లాంటి హేమాహేమీలు బీజేపీ తరపున ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. 1998 నుంచి అడ్వాణీ మంచి ఆధిక్యంతో గెలుస్తూ వచ్చారు.

ఇప్పుడు కూడా ఈ స్థానంలో కాంగ్రెస్‌ కన్నా బీజేపీయే ముందంజలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

భావజాలానికి ప్రయోగశాల.. నమూనా

బీజేపీ హిందుత్వ భావజాలానికి గుజరాత్‌ను ఒక ప్రయోగశాలగా భావిస్తే, గాంధీనగర్‌ నియోజకవర్గాన్ని ఇందుకు నమూనాగా చెప్పొచ్చు.

హిందుత్వ భావజాలానికి గాంధీనగర్ కేంద్ర బిందువుగా ఉంది. మతం లాంటి అంశాల ప్రాతిపదికన ఓట్లను చీల్చడం దగ్గర నుంచి అభివృద్ధిని ఎన్నికల అంశంగా మార్చడం వరకు అన్నింటికీ ఇదే కేంద్రం.

ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానాన్ని అమిత్ షాకు కేటాయించిన పరిణామంపై చర్చ సాగుతోంది. పాత తరహా హిందుత్వ స్థానంలో కొత్త తరహా హిందుత్వ చర్చలోకి వస్తోంది.

గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి మార్పు బీజేపీ పాత తరహా హిందుత్వ నుంచి కొత్త తరహా హిందుత్వకు మారిందనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోందని గుజరాత్‌పై అధ్యయనం చేసే పరిశోధకుడు షరీక్ లాలివాలా వ్యాఖ్యానించారు.

''పాత తరహా హిందుత్వకు అడ్వాణీ ప్రతీక. ఆయన పాటించే విధానానికి కాలం చెల్లింది. ఆయన స్థానంలోకి అతివాదం, దూకుడు ఎక్కువగా ఉన్న హిందుత్వకు ప్రతినిధి అయిన అమిత్ షా వచ్చారు. అడ్వాణీ, వాజ్‌పేయి తరహా హిందుత్వకు, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల హిందుత్వకు మధ్య వ్యత్యాసం ఉంది. హిందుత్వతో కలగలసిన అభివృద్ధి నమూనాను అమిత్ షా-మోదీ అందిస్తున్నారు. నిజానికి పాత తరహా హిందుత్వలో కన్నా ఈ హిందుత్వలోనే తీవ్రత ఎక్కువ'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

గాంధీనగర్ నియోజకవర్గంలో సుమారు రెండున్నర లక్షల మంది పాటేదార్ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మెజారిటీ ఓటర్లు వీరే. వీరి తర్వాతి స్థానంలో దళితులు ఉన్నారు. దళిత ఓటర్లు లక్షా 88 వేల మంది ఉన్నారు.

లక్షా 40 వేల మంది ఓటర్లు వణిక్ వర్గానికి, లక్షా 30 వేల మంది ఠాకూర్ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గాంధీనగర్-ఉత్తరం, సనంద్, ఘట్లోడియా, వేజల్పుర్, నారన్‌పుర, సబర్మతి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గాంధీనగర్-ఉత్తరం తప్ప అన్ని స్థానాలూ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి.

అమిత్ షాతో తలపడే అవకాశమున్న కాంగ్రెస్ నేతల్లో గాంధీనగర్-ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ జే చావ్‌దా ఒకరు.

అమిత్ షా తన రాజకీయ ప్రయాణాన్ని గాంధీనగర్ నుంచే మొదలుపెట్టారు. 2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు ముందు అమిత్ షా సర్ఖేజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు.

అమిత్ షా ఇల్లు ప్రగతి గార్డెన్‌కు సమీపంలోని నారన్‌పురలో ఉంది. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సర్ఖేజ్ నియోజకవర్గం రద్దై, దాని పరధిలోని ప్రాంతాలు మూడు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చాయి. అవే నారన్‌పుర, ఘట్లోడియా, వేజల్పుర్.

అమిత్ షా నారన్‌పుర నుంచి పోటీచేసి గెలుపొందారు. గుజరాత్ నుంచి 2017లో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

గాంధీనగర్ స్థానంలో పైచేయి కచ్చితంగా బీజేపీదేనని రాజకీయ విశ్లేషకుడు హేమంత్ షా చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ సరైన ఫలితం సాధించలేకపోతే, రాష్ట్రవ్యాప్తంగా కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధించలేదని అర్థమని వ్యాఖ్యానించారు.

గాంధీనగర్ గుజరాత్‌లో అత్యంత ప్రాబల్యమున్న వ్యక్తుల కేంద్రమని, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల ఓటర్లపైనా ఈ నియోజకవర్గ రాజకీయం ప్రభావం చూపగలదని ఆయన తెలిపారు.

''బీజేపీ ఓటర్లను అర్థం చేసుకోవాలంటే, గాంధీనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి. బీజేపీకి అండగా నిలిచే ఓటర్లలో ప్రధానమైన వర్గాలన్నీ ఇక్కడ ఉంటాయి'' అని హేమంత్ వివరించారు.

గాంధీనగర్ సిటీ, అహ్మదాబాద్ పశ్చిమ ప్రాంతం సహా ఈ నియోజకవర్గం పరిధిలో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉంటాయి. వేజల్పుర్, ఘట్లోడియా, నారన్‌పురలు నగరం పశ్చిమ ప్రాంతం కిందకు వస్తాయి. ఇందులో మధ్యతరగతివారు ఎక్కువగా ఉంటారు.

సనంద్, గాంధీనగర్-ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పాక్షిక పట్టణ ప్రాంతాలుగా మారిపోయాయి. ఇక్కడ ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కువ మందే ఉంటారు.

గాంధీనగర్‌లో తమకు పోటీయే లేదని బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రధాన వ్యూహకర్త అమిత్ షానే అని, ఆయనే ఇక్కడ పోటీచేస్తున్నారు కాబట్టి పార్టీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ఆయన తెలిపారు.

అసెంబ్లీ స్థానాల వారీగా బలం ఇదీ

గాంధీనగర్ ఉత్తరం: గాంధీనగర్ నియోజకవర్గం పునర్ వ్యవస్థీకరణతో 2007లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2017 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నేత చావ్‌దా 5,500కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

కాలోల్: గాంధీనగర్ జిల్లాలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతం. బీజేపీ నాయకురాలు సుమన్ ప్రవీణ్‌సిన్హ్ చావ్‌దా 49 వేలకు పైగా ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించి గెలుపొందారు. బీజేపీ 1995 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ ఈ స్థానంలో ఓడిపోయిందే లేదు. ఒక్క 2007లో తప్ప ప్రతిసారీ ఏకపక్ష విజయమే లభించింది. అప్పుడు మాత్రం రెండు వేల ఓట్ల మెజారిటీయే వచ్చింది.

సబర్మతి: ఈ స్థానంలో 2001 నాటి ఉప ఎన్నికలో తప్ప 1995 నుంచి ఇప్పటివరకు బీజేపీ ఓడిపోలేదు. 2017 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నాయకుడు అర్వింద్ పటేల్ 1,113,503 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు.

ఘట్లోడియా: 2008 పునర్ వ్యవస్థీకరణతో ఈ స్థఆనం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ గెలుపొందారు. 2017లో బీజేపీ నాయకుడు భూపేంద్ర పటేల్ గెలిచారు. ఇది కమల దళానికి మరో సురక్షిత స్థానం.

నారన్‌పుర: 2008లో పునర్‌వ్యవస్థీకరణతో ఈ స్థానం ఏర్పడింది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ పటేల్‌పై అమిత్ షా 63,335 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సనంద్: మిగతా స్థానాల కన్నా ఇది కాస్త భిన్నమైనది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ గట్టిగా ఉంటుంది. 2012లో కాంగ్రెస్ గెలవగా, 2017 ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది.

వేజల్పుర్: ఇక్కడ బీజేపీకి మద్దతుదారులు బాగా ఎక్కువ. 2008లో పునర వ్యవస్థీకరణ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీనే గెలిచింది.

కాంగ్రెస్ సన్నద్ధత ఎలా ఉంది?

గాంధీనగర్ స్థానంలో గెలుపుపై కాంగ్రెస్ ఆశలు వదులుకోవాలని, సమయం, వనరులు వృథా చేసుకోకూడదని షరీక్ లాలివాలా లాంటి విశ్లేషకులు సూచిస్తున్నారు.

గాంధీనగర్‌లో బీజేపీ తరపున ఎంతో బలమైన అభ్యర్థి అమిత్ షా పోటీచేస్తున్నప్పటికీ, సరైన అభ్యర్థిని ఎంపిక చేసి, సరైన వ్యూహాన్ని అనుసరిస్తే కాంగ్రెస్ గెలవగలదని హేమంత్ షా చెబుతున్నారు.

కాంగ్రెస్ పోటీ ఇవ్వగలదని కొందరు విశ్లేషకులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల వద్ద వ్యూహం కొరవడింది.

ఇక్కడ ఠాకూర్ వర్గానికి చెందిన నాయకుడిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించే అవకాశముందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.

ఓటర్ల మాటేమిటి?

గ్రామంలోని ప్రతి ఓటరుకు చేరువై, పరిస్థితుల గురించి తెలియజెప్పగల నాయకులు, కార్యకర్తల కొరత కాంగ్రెస్‌కు ఉందని సనంద్‌కు చెందిన సురేష్ జాదవ్ అనే 52 ఏళ్ల ఓటరు చెప్పారు. ఆయనో ప్రైవేటు ఉద్యోగి. బీజేపీ విధానాలను ఎదిరించగల నాయకులెవరూ తమ ప్రాంతంలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.

జుహాన్‌పుర ప్రాంతంలో ఒక ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న ఆసిఫ్ పఠాన్(50) బీబీసీతో మాట్లాడుతూ- ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైనా జుహాన్‌ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.

ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న అడ్వాణీ ఒక్కసారి కూడా తమ ప్రాంతానికి రాలేదని ఆయన ఆక్షేపించారు. ఇప్పుడు అభ్యర్థిని మార్చినంత మాత్రాన తమ జీవితాల్లో వచ్చే మార్పేమీ ఉండదన్నారు.

ఘట్లోడియా పట్టణ ప్రాంతానికి చెందిన మరో ఓటరు రమేశ్ దేశాయ్ మాట్లాడుతూ- సమస్యలేవీ లేనప్పుడు ఎంపీ రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

''నేనెన్నడూ అడ్వాణీని చూడలేదు. ఆయన్ను చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ శ్రేణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నాయి. గాంధీనగర్‌లో ఈసారి కూడా బీజేపీ ఘన విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నా'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

గాంధీనగర్ ఎన్నికల చరిత్ర ఇదీ

ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 2014 ఎన్నికల్లో గాంధీనగర్‌లో 17,33,972 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 65.15 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)