You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్: చంద్రబాబుకు నేనంటే భయమెందుకు... ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తా
తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
మరో అయిదారు నెలల్లో వచ్చే వర్షాకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.
మూడు నెలలుగా చంద్రబాబు తనను మూడు వేల తిట్లు తిట్టారని కేసీఆర్ విమర్శించారు. తాను ఆంధ్రాకు వెళ్లి ఓడిస్తానని ఆయన భయపడుతున్నారన్నారు.
ఒకప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు పట్టేదని, కానీ తమ హయాంలో శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో... ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ప్రస్తుతం తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే...
రాష్ట్ర విభన జరిగితే తెలంగాణ వారికి పరిపాలన చేయడం రాదన్నారు. కానీ, అలా అన్నవారికంటే వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నాం.
రాష్ట్రంలో 2014, 2015లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే ప్రస్తుతం 54 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
గతంలో ఏ ప్రభుత్వమూ రైతు బీమా పథకం గురించి ఆలోచించలేదు.
తాము చేపట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.
భారత దేశాన్ని పెంచి పోషించే ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.50,000 కోట్లు వెళ్తున్నాయి. మనకు వెనక్కి వస్తున్నది కేవలం రూ.24,000 కోట్లు మాత్రమే.
జాతీయ పార్టీలు ఇప్పుడు దారుణస్థితిలో ఉన్నాయి.
రాహుల్ గాంధీ తాత, నాయనమ్మ, ముత్తాత అందరూ ప్రధాన మంత్రులే. ఇప్పుడు ఆయన ప్రధాని కావాలట.
ప్రపంచం ముందు రాహుల్, నరేంద్ర మోదీ దేశ పరువు తీస్తున్నారు. వారికి ప్రపంచమంతా మనవైపు చూస్తోందన్న సోయి లేదు.
ప్రధాని దొంగ (చోర్) అని రాహుల్ గాంధీ రోజూ అంటారు. తల్లీ, కొడుకులు (సోనియా, రాహుల్) జమానతు మీద తప్పించుకుని బయట తిరుగుతున్నారని వారిని ప్రధాని అంటారు. వీళ్ల మాటలు చూస్తే మన దేశం పట్ల ప్రపంచంలో చులకన భావన ఏర్పడుతోంది.
చేయాల్సిన పనులు పక్కనపెట్టి వాళ్లు రాష్ట్రాల మీద పడుతున్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదు. చిన్న గ్రామాల్లో రోడ్లు వేయడం కేంద్ర ప్రభుత్వం పనా?
పాకిస్తాన్‌ను నియంత్రించరు, రక్షణ వివరాలు పట్టించుకోరు, విదేశీ వ్యవహరాలను చక్కదిద్దరు, ఉన్న నీళ్లను వాడరు.
దేశంలో సమస్యలు పోవాలంటే సమాఖ్య ప్రభుత్వం రావాలి. ఈ దద్దమ్మల పాలన పోవాలి.
టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఏం సాధిస్తారని కొందరు వెటకారం చేస్తున్నారు. 2001లో నేను ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే అన్నారు. కానీ, మాకు 16 ఎంపీలే కాదు. మా వెంట మరో నూరు, నూటా ఇరవై మంది ఎంపీలు ఉన్నారు.
ఇప్పుడే అన్ని విషయాలు బయటపెట్టం. ఏం చేయబోతున్నామో ఎన్నికల తర్వాత తెలుస్తుంది.
దేశంలో 70,000 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా, నేటికీ తాగు నీటికోసం అవస్థలు పడాల్సి వస్తోంది. సగం దేశం అంధకారంలో ఉంది.
దేశంలో సమస్యలు దూరం కావాలంటే ప్రాంతీయ పార్టీలతో కూడిన సమాఖ్య ప్రభుత్వం రావాలి.
దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి.
ఈ ఎన్నికల తర్వాత పరిణామాలను చూసి, అవసరమైతే జాతీయ పార్టీని స్థాపించి, ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తా.
దేశ రాజకీయాలను ప్రుభావితం చేసేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుతా.
కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కావాలి.
అది జరిగే పనేనా?
కేసీఆర్ చెప్పినట్లు కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడాలంటే కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 200 వచ్చే సీట్ల సంఖ్య తక్కువకు పడిపోవాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు అన్నారు.
"గత నాలుగు ఎన్నికలు చూస్తే కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 300 నుంచి 350 సీట్లు వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడాలంటే ఆ రెండు పార్టీలకు భారీగా తగ్గాలి. మరి, అది జరిగే పరిస్థితి కనిపిస్తుందా? అన్నది ప్రశ్న.
ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడాలంటే వైరుధ్యాలు ఉన్న ప్రాంతీయ పార్టీలు కలవాల్సి ఉంటుంది. ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇలాంటివి ఏకమవుతాయా? అన్నది మరో ప్రశ్న.
దేశంలో ప్రాంతీయ పార్టీలు రెండు ఫ్రంటులుగా ఉన్నాయి. ఒకటి బీజేపీ అనుకూల ఫ్రంటు, రెండోది వ్యతిరేక ఫ్రంటు.
కేసీఆర్ ఇలాంటి మాటలు చాలా చెబుతారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటున్న ఆయన ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు నిర్వహించిన ఒక్క సమావేశానికి కూడా వెళ్లలేదు కదా. కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్ష చేస్తే వెళ్లలేదు, దిల్లీలో కేజ్రీవాల్ ధర్నా చేస్తే వెళ్లలేదు.
ఆయన ఇప్పుడు ఏం చెప్పినా, ఎన్నికల ఫలితాల తర్వాతే అన్నీ తెలుస్తాయి." అని కృష్ణా రావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు
- ఆ సమయంలో తలనొప్పి వస్తే.. అశ్రద్ధ చేయకూడదు
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని ఆశీర్వదించిన శతాధిక వృద్ధురాలు తిమ్మక్క ఎవరు?
- కుంభమేళా 360 VIDEO: పాప ప్రక్షాళన కోసం పోటెత్తిన 22 కోట్ల మంది.. మోక్షం కోసం ఎదురుచూపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)