You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఫెయిలైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం’ : యూపీఎస్సీ ప్రతిపాదన - ప్రెస్‌రివ్యూ
‘‘సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి చివరి మెట్టు వరకూ వెళ్లి ఉద్యోగం రాకపోయిన వారికి శుభవార్త. సివిల్స్‌లో మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలకు హాజరై- అందులో ఫెయిలైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ఇతర ఉద్యోగాలు దక్కేలా ఓ ప్రతిపాదనను యూపీఎస్సీ తాజాగా చేసింది’’ అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇంటర్వ్యూల్లో ఫెయిలైన అభ్యర్థులందరినీ ఏదో ఒక ఉద్యోగం లోకి తీసుకోవాలని యూపీఎస్సీ కేంద్రానికి సిఫారసు చేసింది. దీన్ని గనక కేంద్రం ఆమోదిస్తే వేలాది మంది సివిల్స్ ఆశావహులకు కొంత ఊరట లభించినట్లవుతుంది. భువనేశ్వర్‌లో ఈ మధ్య వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న యూపీఎస్సీ ఛైర్మన్ అరవింద్ సక్సేనా ఈ ప్రతిపాదన గురించి వివరించారు.
''సివిల్స్‌లో ఇంటర్య్వూల వరకూ వచ్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోండని మేం సిబ్బంది వ్యవహారాల శాఖకు, వివిధ మంత్రిత్వ శాఖలకూ లేఖలు రాశాం'' అని ఆయన పేర్కొన్నారు. ఏటా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు పరీక్షకు దేశ వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ప్రిలిమ్స్ దాటి మెయిన్స్‌కు వచ్చే సరికి ఆ సంఖ్య 40 శాతానికి తగ్గిపోతోంది. మెయిన్స్‌దాటి ఇంటర్వ్యూకి వచ్చే సరికి ఆ సంఖ్య కాస్త 10-20 శాతానికి పడిపోతోంది.
2018 సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 8లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో కేవలం 10,500 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరి నుంచి కేవలం 2వేల మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. కానీ నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీల సంఖ్య 782 మాత్రమే. దీంతో 1200 మంది ఇంటర్వ్యూల్లో ఫెయిలై వెనుదిరుగుతున్నారు. సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకూ వచ్చారంటే ఆ అభ్యర్థిని సమర్ధుడిగానే పరిగణిస్తారు.
''ప్రతిభ ఉన్న ఇలాంటి వారందరినీ ఎందుకు వదిలేయడం? దేశానికి ఇలాంటి వారూ కావాలి.. వీరి సేవల్ని వినియోగించుకోవాలి'' అని యూపీఎస్సీ నిర్ణయించి కేంద్రానికి సిఫారసు చేసినట్లు అరవింద్ సక్సేనా తెలిపారు.
యూపీఎస్సీ తీసుకున్న మరో కీలక నిర్ణయం... మెయిన్స్ రాసిన వారందరి స్కోర్లు ఆన్‌లైన్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల వారి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కానివారకి ప్రైవేటు ఉద్యోగమే శరణ్యమవుతోంది. ప్రైవేటు సంస్థలు ఈ డాటాను సానుకూలంగా వాడుకోడానికి వీలుంటుంది. ఎవరి ప్రతిభ ఎందులో ఉందన్నది ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లో కంటే ప్రైవేటు సంస్థలే మెరుగ్గా అంచనావేస్తాయని, ఆ దృష్ట్యా ఆన్‌లైన్‌లో స్కోర్లు చూసి వారిని ఇంటర్వ్యూలకు కంపెనీలే పిలిపించి ఉద్యోగాలు ఇస్తాయని ఓ అధికారి అన్నారు.
ఎన్‌ఐసీ ఇటీవల ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇంటెగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ పబ్లిక్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ అని దానికి పేరు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, కులం, వర్గం, చిరునామా, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్.. లాంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెడతారు. ఒకవేళ ఈ వివరాలు పెట్టడం తమకు ఇష్టం లేదని అభ్యర్థి నిరాకరిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలుండవు. తన సమ్మతి లేదా అసమ్మతిని అభ్యర్థి దరఖాస్తులోనే పేర్కొనవచ్చునని యూపీఎస్సీ తెలిపింది. అభ్యర్థి వివరాలు, స్కోర్లు అందుబాటులో ఉండడం వల్ల వివిధ ఉపాధి కల్పన సంస్థలు తమకు నచ్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకొనే వీలుంటుందని చెబుతున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
లోయర్ మానేరు డ్యాం లో కేసీఆర్ పేరుతో దీవి
కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) మరో పర్యాటక ప్రాంతానికి కేంద్రంగా మారబోతున్నదని నమస్తే తెలంగాణ వెల్లడించింది. ఇప్పటికే డ్యాం దిగువ భాగంలో రూ. 551 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం కేసీఆర్ అనుమతిస్తూ నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
తాజాగా డ్యాం మధ్యలో నాలుగు ఎకరాల్లో ఉన్న మైసమ్మగుట్టపై రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్ పేరు తో అత్యాధునిక హంగులతో టూరిస్టులను ఆకట్టుకునేలా పలు రకాల నిర్మాణాలు చేపట్టాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. మొదటి దశలో రూ.5 కోట్లు కేటాయించారు.
డ్యాంతోపాటు మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై సీఎం కేసీఆర్ ముందునుంచీ దృష్టిపెట్టారు. డ్యాంతోపాటు పరిసర ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి పట్టు ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇందు లో భాగంగానే డ్యాంకు దిగువన మానేరు రివర్ ఫ్రంట్‌ను రూ.551 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించి గత బడ్జెట్‌లోనే రూ. 350 కోట్లు కేటాయించారు. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. డ్యాం పరిసర ప్రాంతం లో సీఎం కేసీఆర్ ఐటీ టవర్ మంజూరు చేయ గా పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కరీంనగర్ రెనోవేషన్ సిటీలో భాగంగా నిర్మించనున్న కేసీఆర్ ఐలాండ్‌ను ఏడాదిలోపు పూర్తిచేయడానికి కాం ట్రాక్టు సంస్థలు తమకు హామీ ఇచ్చా యిని కరీంనగర్ ఎమ్మెల్యేగంగుల కమలాకర్ తెలిపారు. ఇది పూర్తయితే దేశ, విదేశాలనుంచి పర్యాటకులు తరలివస్తారని, యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి కరీంనగర్ కార్పొరేషన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్ల నుంచి రూ.3 కోట్లు కేటాయించామని ఆయన చెప్పినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.
కేంద్రమంత్రికి సోనియా గాంధీ ప్రశంసలు
‘లోక్‌సభలో గురువారం ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. అధికార పార్టీని, మంత్రులను నిత్యం విమర్శించే కాంగ్రెస్ నేతలు.. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు’ అని సాక్షి పేర్కొంది.
యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సైతం గడ్కరీ పనితీరును మెచ్చుకున్నారు.మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో ఆయన అద్భుతంగా కృషిచేశారన్న దానిపై ఆమె ఏకీభవించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ శాఖపై రెండు ప్రశ్నలను స్పీకర్ చర్చకు స్వీకరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, '‘పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడున్న అందరు ఎంపీలు వారి నియోజకవర్గాల్లో తన శాఖ ద్వారా జరిగిన పనులపై ప్రశంసిస్తున్నారు'’ అని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులంతా బల్లలను చరుస్తూ అభినందనలను తెలిపారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ లేచి నిలబడి... గడ్కరీ కృషికి సభ అభినందనలు తెలపాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ను కోరారు. ఈ సమయంలో లోక్ సభలో ఊహించని పరిణామం జరిగింది. అప్పటిదాకా గడ్కరీ చెబుతున్న విషయాలను ఎంతో ఓపికగా వింటున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ... గడ్కరీని అభినందిస్తూ బల్లను చరిచారు. ఆ తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలందరూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు.
ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గంలో ఉన్న రహదారుల సమస్యపై సానుకూలంగా స్పందించారంటూ ధన్యవాదాలు తెలుపుతూ గడ్కరీకి గతంలో సోనియా లేఖ రాశారని సాక్షి వెల్లడించింది.
‘ముగ్గురు మోదీలూ కలిశారు’
‘‘గత ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అన్నీ ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఆ తర్వాత నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు’’ అని ఈనాడు తెలిపింది.
అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు కేవలం మట్టి, నీళ్లు మాత్రమే తెచ్చి ప్రధాని మోదీ మోసం చేశారని బాబు అన్నారు. సహకరించకపోగా తిరిగి మననే విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సీఎం సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయనతోపాటు 13 జిల్లాలనుంచి వచ్చిన కృష్ణ, మహేష్‌బాబు అభిమాన సంఘాల జిల్లాల అధ్యక్షులు కూడా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హక్కుల సాధనకు ఎవరినైనా ఎదిరిస్తామని అన్నారు. తాను వైకాపా వలలో చిక్కుకున్నానని మోదీ విమర్శించడం తగదని, ఆయనే అవినీతి వలలో చిక్కుకున్నారని విమర్శించారు. తనకంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎక్కువ పరిణతి ఉందని ప్రధాని వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ కేసీఆర్ తన శిష్యుడే అని, తన వద్ద నేర్చుకున్నారని అన్నారు.
అవకాశం వచ్చినందున ఆయన సీఎం అయ్యారని, దీనికి తానేమీ బాధపడడం లేదని వివరించారు. ముగ్గురు మోదీలు (మోదీ, కేసీఆర్, జగన్) కలిశారని, 30మంది మోదీలు వచ్చినా తననేమీ చేయలేరన్నారు. కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు తెదేపా విజయానికి సహకరించాలని కోరారు. పేదరికమే తన కులమని, పేదలే తన తమ్ముళ్లని చంద్రబాబు అన్నట్లు ఈనాడు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)