You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా, రాహుల్ మాటల్లో నిజమెంత? : Fact Check
వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి ఖాతాలోకి నేరుగా డబ్బు జమచేసే సార్వత్రిక కనీస ఆదాయ (యూబీఐ) పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.
"ఆకలి, పేదరికం అనేవి దేశంలో ఉండకూడదు. భారత్‌లో నివసించే ప్రతి పేద పౌరుడికీ కనీస ఆదాయం ఉండాలి" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చివర్లో రాహుల్ మరో మాట అన్నారు... ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పథకం లేదని, 2019లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే మనదే మొదటి దేశం అవుతుంది అని.
నిజంగానే మరే దేశంలోనూ ఇలాంటి పథకం లేదా?
ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారనే దానిపై రాహుల్ ఇంకా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. అయితే ఆయన ప్రకటన స్వరూపాన్ని బట్టి ఇలాంటి పథకాలు విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయనేది అర్థమవుతోంది.
బోల్సా ఫ్యామిలియా (బీఎఫ్ - తెలుగు అర్థం - కుటుంబ ఆదాయం) పేరుతో లాటిన్ అమెరికన్ దేశం బ్రెజిల్‌లో 2003 నుంచే ఓ పథకం అమల్లో ఉంది. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో ఈ పథకం బాగా తోడ్పడిందనే అభిప్రాయం అక్కడ బలంగా ఉంది.
"పేదరికం ప్రభావాన్ని తగ్గించడమే కాదు, యువతకు మెరుగైన అవకాశాల కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం, విద్య, వైద్య సౌకర్యాల అభివృద్ధికి కూడా ఈ పథకం ఎంతగానో తోడ్పడింది" అని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్లో బోల్సా ఫ్యామిలియాపై రాసిన కథనంలో పేర్కొన్నారు.
2003 నుంచి 2010 వరకూ అధ్యక్షుడిగా ఉన్న లులా డ సిల్వాకు ఈ పథకం ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
"అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు ఈ బీఎఫ్ సామాజిక పథకం తోడ్పాటునందించింది. కుటుంబ నెలవారీ ఆదాయం 3365 రూపాయల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులవుతారు" అని బీబీసీ బ్రెజిల్ ప్రతినిధి రికార్డో అకాంపొరా అభిప్రాయపడ్డారు.
దీని కొనసాగింపుపై మొదట్లో కొన్ని సందేహాలు వ్యక్తమైనా, ఇప్పటికీ ఆ పథకం అమలులో ఉంది.
విదేశాల్లో ఉన్న పథకాలను పరిశీలించాకే...
"రాహుల్ గాంధీ బోల్సా ఫ్యామిలియా లాంటి పథకాలను ఆదర్శంగా తీసుకున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఈ నగదు బదిలీ పథకాల పనితీరును ఆయన పరిశీలించారు. బ్రెజిల్‌లోని బోల్సా ఫ్యామిలియా, మెక్సికోలోని ఆపర్చూనిడాడేస్, కొలంబియాలోని ఫ్యామిలియాస్ ఎన్ యాక్సియోన్ వంటి పథకాల ఫలితాలను చూసిన తర్వాత ఇలాంటి ఒక పథకాన్ని భారత్‌లో కూడా ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు" అని రచయిత శంకర్ అయ్యర్ తన పుస్తకం 'ఆధార్ - ఎ బయోమెట్రిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ 12 డిజిట్ రివొల్యూషన్'లో ప్రస్తావించారు.
ఫిన్‌లాండ్ కూడా 2017లో ప్రయోగాత్మకంగా 2000 మంది నిరుద్యోగులకు కనీస వేతనంగా నెలకు రూ.45500 అందిస్తూ ఓ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2019 వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత దీని ఫలితాలను వెల్లడిస్తారు.
ఇరాన్‌లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకునేందుకు నెలనెలా నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వం పౌరులకు చెల్లిస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండడంతో ఈ సాయం ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆ దేశంలోని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనలో తప్పు దొర్లింది. ఒకవేళ రాహుల్ అధికారం చేపట్టి, ఈ పథకాన్ని అమలు చేసినా.. ప్రపంచంలో యూబీఐను అమలు చేసిన మొట్టమొదటి దేశం మాత్రం భారత్ కాబోదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)