శబరిమల : ఆలయంలోకి వెళ్లిన కనకదుర్గను ఇంట్లోకి రానివ్వని భర్త

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ నెల 2న కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గను ఆమె భర్త ఇంట్లోకి రానివ్వలేదు.

ఈ నెల 15న కనకదుర్గ ఇంటికి రాగానే, సంప్రదాయానికి విరుద్ధంగా శబరిమల ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త ఆమెతో ఘర్షణ పడ్డారు. అత్త కర్రతో తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను మలప్పురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 21న సాయంత్రం కనకదుర్గ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి రాగా, భర్త అప్పటికే ఇల్లు ఖాళీ చేశారు.

''భర్త, ఇతర కుటుంబ సభ్యులు కనకదుర్గను వారుండే ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆమెను సోమవారం రాత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా వసతి గృహానికి తీసుకెళ్లారు'' అని సామాజిక కార్యకర్త థంకచన్ విథయాతిల్ బీబీసీతో చెప్పారు.

పోలీసు స్టేషన్‌లోనే ఉంటానన్న భర్త

కనకదుర్గ భర్త పోలీసు స్టేషన్‌కు వచ్చారని, ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు ఆయన నిరాకరించారని మలప్పురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(‌ఎస్‌పీ) ప్రతీశ్ కుమార్ తెలిపారు.

''తాను భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని కనకదుర్గ చెప్పారు. ఆమె భర్త తాను పోలీసు స్టేషన్‌లో ఉంటానన్నారు. దంపతులిద్దరికీ మేం కౌన్సెలింగ్ ఇచ్చాం. తర్వాత కనకదుర్గను నిస్సహాయ పరిస్థితుల్లోని మహిళల కోసం కేరళ ప్రభుత్వం ఏర్పటుచేసిన వసతి గృహానికి తరలించాం'' అని ఆయన వివరించారు.

కనకదుర్గ సమస్య గృహహింస కేసుగా మారిందని, ఆమె ఈ మేరకు ఫిర్యాదు దాఖలు చేశారని, ఈ కేసును కోర్టు చేపడుతుందని ప్రతీశ్ చెప్పారు.

ఈ నెల 15న ఇంటికి వచ్చినప్పుడు తన అత్త దాడి చేసిన తర్వాత కనకదుర్గ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.

తనను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంపై కనకదుర్గ చాలా బాధపడుతున్నారని, దీనిపై మాట్లాడేందుకు ఆమె సిద్ధంగా లేరని సామాజిక కార్యకర్త థంకచన్ తెలిపారు.

ఇంట్లోకి తనను రానిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ బుధవారం మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని కనకదుర్గ నిర్ణయించారు.

శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు నిరుడు సెప్టెంబరులో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది.

ఈ నెల 2న కనకదుర్గ(39)తోపాటు బిందు అమ్మిని(40) అనే మహిళ కేరళ పోలీసుల సాయంతో గర్భగుడిలోకి వెళ్లారు.

బీజేపీతో అనుబంధమున్న వివిధ సంస్థల సమాహారమైన శబరిమల కర్మ సమితి సుప్రీంకోర్టు తీర్పు అమలును వ్యతిరేకిస్తోంది. అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం విషయంలో కేరళ సమాజం రెండుగా చీలిపోయింది.

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షల మంది ఈ ఆలయానికి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)