జ్ఞాపకశక్తి: అవసరమైనది గుర్తుండాలంటే.. అక్కర్లేనిది మరచిపోవాలి. అదెలాగంటే..

మనిషి జ్ఞాపకశక్తి ఎంత? దీనికి పరిమితి ఉందా? ఎంత గుర్తుపెట్టుకోగలమనే విషయంలో భౌతికపరమైన పరిమితి ఉందని, కానీ జీవితకాలంలో మెమరీ మొత్తం నిండిపోయే ప్రసక్తే లేదని సైకాలజిస్టులు, న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు.

''మరి అంత మంచి మెమరీ ఉంటే, నేనెందుకు ఎప్పుడూ ఏదో ఒకటి మరచిపోతున్నాను'' అని మీరు అడగొచ్చు. మీరు అవసరమైనంత 'మరచిపోకపోవడమే' దీనికి కారణం కావొచ్చు. ఔను, మరచిపోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి మధ్య సంబంధం ఉంది. అదెలాగో చూద్దాం.

ఏదైనా గుర్తుపెట్టుకోవడంలో మూడు కీలక దశలు ఉంటాయి.

1. మెమరీలోకి ఎక్కించుకోవడం

2. నిల్వ చేయడం

3. గుర్తుకుతెచ్చుకోవడం

జ్ఞాపకశక్తి లోపించిందని బాధపడేవారు సమాచారాన్ని సరిగా పదిలపరచుకోకపోవడమే దీనికి కారణమని ఎప్పుడూ అనుకొంటుంటారని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన రాబర్ట్ ఎ.బిజోర్క్ చెప్పారు. దీనికి పూర్తిగా అదే కారణం కాకపోవచ్చని తెలిపారు.

మరచిపోవాల్సిన వాటిని తగినంతగా మరచిపోకపోవడం కూడా ఈ సమస్యకు కొంత కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భావనను పరిగణనలోకి తీసుకొనే పరిశోధకుల సంఖ్య పెరుగుతోంది.

మనం ఎన్ని ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకొంటే అవి అంతగా ఒకదానితో ఒకటి కలసిపోతాయి. అవసరంలేని, కాలం తీరిన సమాచారం కూడా అలాగే ఉండిపోతుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అవసరమైన జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తే సమాచారం అస్పష్టంగా గుర్తుకు వస్తుంది. అవసరానికి మించి సమాచారాన్ని పదిలపరచుకోవడమే ఈ సమస్యకు కారణం.

మరచిపోవడమనేది సమాచారాన్ని పదిలపరచుకోవడంలో జరిగే వైఫల్యం మాత్రమే కాదని, వాస్తవానికి అదో సహజ ప్రక్రియని కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బ్లేక్ రిచర్డ్స్, పరిశోధకుడు పాల్ ఫ్రాంక్లాండ్ చెప్పారు.

ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుపెట్టుకొని, మిగతాది వదిలేయడం ద్వారా అత్యంత తెలివైన నిర్ణయాలు తీసుకొనేందుకు మనిషికి తోడ్పడటమే జ్ఞాపకశక్తి లక్ష్యమని వారు వివరించారు.

అవసరంలేనిది ఎలా మరచిపోవాలో ఇప్పుడు చూద్దాం.

1. మీరు వద్దనుకున్న జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చుకోవద్దు. ఏదైనా గుర్తుకు తెచ్చుకోవడం అనేది అడవిలో నడవడం లాంటిది. పదే పదే నడుస్తుంటే దారి ఏర్పడుతుంది కదా. అలాగే ఏదైనా సమాచారం మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకొంటుంటే దానికి సంబంధించి మెదడులోని న్యూరాన్ కనెక్షన్లు బలపడతాయి. నువ్వు గుర్తుకుతెచ్చుకొంటున్న సమాచారం ముఖ్యమైనదని మెదడు భావించేలా చేస్తాయి. కాబట్టి అవసరంలేదనుకున్న సమాచారాన్ని వదిలేయండి.

2. జ్ఞాపకశక్తిని పెంచుకొనేందుకు ఎవరికి వారు శిక్షణ ఇచ్చుకోవచ్చు.

వద్దనుకొనే జ్ఞాపకాలను తొక్కిపెడితే అవి గుర్తుకు రాకుండా ఉంటాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ ఆండర్సన్ 2001లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

స్వల్పకాలంలో మన ఉద్వేగాలను, ఆలోచనలను నియంత్రించుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

3. హృదయ సంబంధ వ్యాయామం చేస్తే మెదడులో న్యూరాన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని ప్రొఫెసర్ బ్లేక్ రిచర్డ్స్ ఎలుకలపై జరిపిన పరిశోధనలో గుర్తించారు.

మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడే ప్రక్రియను న్యూరోజెనిసిస్ అంటారు.

మెదడులోని హిప్పోకాంపస్‌ భాగంలో మెరుగైన న్యూరోజెనిసిస్‌కు, సమాచారాన్ని మరచిపోవడానికి మధ్య సంబంధం ఉందని ఆయన పరిశోధనలో వెల్లడైంది.

మనిషి మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్లు నిరంతరం మారిపోతూ ఉంటాయి. అవి బలహీనపడటం లేదా పూర్తిగా దెబ్బతినడం జరుగుతుంటుంది. వాటి స్థానంలో కొత్త న్యూరాన్లు అభివృద్ధి చెందుతుంటాయి. కొత్త న్యూరాన్లు సర్క్యూట్‌లను రీవైరింగ్ చేసుకొని, పాత జ్ఞాపకాలను చెరిపేయగలవు.

గుర్తుపెట్టుకోవడం లాగే మరచిపోవడం కూడా చాలా అవసరం. అక్కర్లేని జ్ఞాపకాలను, వాటితో ముడిపడిన ఉద్వేగాలను వదిలేయడం సవాలుతో కూడుకున్నదే. కానీ సాధన చేస్తే ఇది సాధ్యమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)