You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియాలను రాహుల్ సీఎంలుగా ఎందుకు నియమించలేదు : అభిప్రాయం
- రచయిత, కల్యాణి శంకర్
- హోదా, సీనియర్ పాత్రికేయులు
మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకున్న తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపికచేసే అత్యంత కీలకమైన, సున్నితమైన పనిని పూర్తిచేశారు. ఈ క్రమంలో ఆయన అనుభవానికే పెద్ద పీట వేసి యువనేతలను నిరాశపరిచారు.
మధ్యప్రదేశ్‌కు 72 ఏళ్ల కమల్‌నాథ్‌ను, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 67 ఏళ్ల అశోక్ గెహ్లాత్‌ను ఎంపిక చేశారు.
మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్ రాజవంశీకుడు జ్యోతిరాదిత్య సింథియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నప్పటికీ వారి అభ్యర్థనలను రాహుల్ తిరస్కరించారు.
దీంతో నలభైల్లో ఉన్న ఈ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం మరింత కాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి.
పాత తరానికే ప్రాధాన్యం ఇచ్చారెందుకు?
ప్రస్తుతం దేశంలో మెల్లగా కాంగ్రెస్ గాలి వీయడం మొదలైంది.. బీజేపీకి సవాల్‌గా నిలిచేందుకు రాహుల్ ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అదే సమయంలో భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు, ప్రచారం, నిధుల సమీకరణ, ఇంకా ఎన్నికలకు సంబంధించిన సకల అంశాలకూ అనుభవజ్ఞులైన నేతల అండ రాహుల్‌కు అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అనుభవం, ప్రతిభ గల నేతలు ఫలితాలు రాబట్టగలుగుతారు.
సీనియర్లను నమ్ముకోవడమనేది రాహుల్ గత అయిదేళ్లలో నేర్చుకున్నారు. 2013లో ఆయన పార్టీ ఉపాధ్యక్షుడైన మొదట్లో యువతరానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. కానీ, ఇది గమనించిన సీనియర్లలో ఆందోళన పెరిగింది.. చాలామంది సీనియర్లు రాహుల్‌తో సౌకర్యంగా ఉండలేకపోయేవారు. ఆయన అసహనం, రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టకపోవడం, నాన్చుడు ధోరణి వంటివన్నీ సీనియర్లకు నచ్చేవి కావు.
కానీ, గత ఏడాది చివర్లో రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన ధోరణిలో చాలామార్పు వచ్చింది. తన కొత్త జట్టు కూర్పులో సమతూకాన్ని పాటించారు. పాత తరం నుంచి పలువురు నేతలను తన జట్టులోకి తీసుకుని సీనియర్ల విశ్వాసాన్నీ సంపాదించారు.
సీనియర్ నేతల నైపుణ్యాలు పార్టీకి అవసరమన్న సంగతిని రాహుల్ గుర్తించారు. ఆ కారణంగానే అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, పి.చిదంబరం, కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాత్, కమల్ నాథ్ వంటివారికి అవకాశాలు దక్కాయి. అదేసమయంలో దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది వంటి నేతలను పక్కన పెట్టారు.
పార్టీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ కార్యవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే ప్యానళ్లలో అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ల మార్గదర్శకత్వంలోని యువ నాయకత్వం పార్టీకి అవసరమన్న సంగతిని రాహుల్ గుర్తెరిగారు.
కమల్‌నాథ్‌కు కలిసొచ్చిందేంటి?
ప్రస్తుత సందర్భంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన అశోక్ గెహ్లాత్, కమల్ నాథ్‌ల విషయానికొస్తే.. కమలనాథ్‌ను ఎంపికలో రాహుల్ అన్ని కోణాల్లో ఆలోచించారనే చెప్పాలి.
కేంద్రంలోని వివిధ ప్రభుత్వాలలో అనేక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూసిన అనుభవం ఉన్న కమల్ నాథ్ పాలనలో ముద్ర వేయగలరన్నది మొదటి అంశమైతే... రెండోది పార్టీకి ఉపయోగపడడంలోనూ ఆయనకు జ్యోతిరాదిత్య సింథియా కంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వ్యాపార ప్రపంచంలో విస్తృత పరిచయాలున్న కమల్ నాథ్ రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంలో సాయపడగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.
పైగా 72 ఏళ్ల కమల్ నాథ్‌కు ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే మళ్లీ అవకాశం రావడం కష్టమే, అదే సమయంలో సింథియా వయసులో చిన్నవాడే కావడంతో ఆయనకు అవకాశాలు అందుకోవడానికి ఎంతో సమయం ఉంది.
అంతేకాదు.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన కమల్‌నాథ్‌కు చాన్సివ్వకుంటే ఆయన సమస్యలు సృష్టించే అవకాశాలూ ఎక్కువే. ముఠా రాజకీయాలకు పేరుపడిన మధ్యప్రదేశ్‌లో, అందులోనూ.. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మద్దతు పుష్కలంగా ఉన్న కమల్ నాథ్‌ను నిరాశపరిస్తే చిక్కులు తప్పవని రాహుల్ భావించి ఉంటారు.
గుజరాత్ ఎన్నికల నుంచే గెహ్లాత్‌పై గురి
ఇక రాజస్థాన్ సీఎంగా రాహుల్ ఎంపిక చేసిన అశోక్ గెహ్లాత్ గురించి చెప్పాలంటే గుజరాత్ ఎన్నికల సమయంలోనే ఆయనపై గురి కుదిరింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకొంది. ఆయన ఎన్నికల వ్యూహాలు, వ్యక్తిగతంగా తనకు చెప్పిన సూచనలు రాహుల్‌కు ఆయనపై నమ్మకం కుదిరేలా చేశాయి.
అంతేకాదు.. రాజస్థాన్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రతి నియోజకవర్గంలో నమ్మిన బంట్లు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలోని నేతలతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలున్నాయి.
అందరితో కలిసిపోయే, సర్దుకుపోయే స్వభావం ఉన్న గెహ్లాత్ రాజస్థాన్‌లోని వివిధ సామాజికవర్గాలను పార్టీకి అనుకూలంగా మలచడంలో, సమస్యలను పరిష్కరించడంలో పైలట్ కంటే సమర్థంగా పనిచేయగలరని రాహుల్ భావించారు.
బొటాబొటి మెజారిటీతో బయటపడడంతో ప్రభుత్వాన్ని నడిపించడానికి అనుభవజ్ఞుడి అవసరం ఉందని, అది గెహ్లాతేనని రాహుల్ నమ్మారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా మాదిరిగానే పైలట్ కూడా యువకుడు కావడంతో ఆయనకు ఇంకా ముందుముందు చాలా కాలం ఉందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోలేదు.
కమల్‌నాథ్ వలె గెహ్లాత్ కూడా ఎన్నికలకు నిధులు సమీకరించడంలో సిద్ధహస్తులు. పైగా, పార్టీలో కూడా అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతూ ఆయనకే ఉంది.
మరోవైపు 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా రాహుల్ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటుండడంతో ఈ ఇద్దరికీ అవకాశాలు దక్కాయి. దీంతో సింథియా, పైలట్ కూడా రాహుల్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- అభిప్రాయం: అసలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే దేశ కాల పరిస్థితులున్నాయా? కెసిఆర్ ఉద్దేశం ఏంటి?
- కేసీఆర్ ఖమ్మం సభ: 'ఒక కులం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కులంలో మొత్తం దరిద్రం పోతదా?'
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- కేసీఆర్ ప్రెస్‌మీట్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా''
- మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)