You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మమతా బెనర్జీ మంతనాలు దేని కోసం?
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులు చాలా బిజీగా గడిపారు. పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో, విపక్ష, అసమ్మతి నాయకులతో భేటీ అయ్యారు.
బుధవారం సాయంత్రం 10 జన్‌పథ్ వెళ్లి కాంగ్రెస్ నాయకురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కలిశారు. అనంతరం "దేశమంతటా 2019 ఎన్నికల్లో పోటీ 1:1 నిష్పత్తిలోనే ఉండాలని" మీడియాతో అన్నారు.
"ఏ స్థానంలో అయినా సరే.. అక్కడ ఏ విపక్ష పార్టీ బలంగా ఉందో ఆ పార్టీనే పోటీ చేయాలి" అని ఆమె వ్యాఖ్యానించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ చేతులు కలపాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ భేటీలు ప్రత్యామ్నాయం కోసమేనా?
అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేసే దిశగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారన్న బలమైన ఊహాగానాలు వచ్చాయి.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే విషయం మీద కోల్‌కతా వెళ్లి మమతతో చర్చలు కూడా జరిపారు.
కానీ, తాజాగా సోనియాతో మమత భేటీ కావడంతో మమత కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది.
సోనియా గాంధీని కలవక ముందు ఎన్డీయేపై విమర్శలు చేసిన బీజేపీ అసంతృప్త నేతలు అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలతోనూ ఆమె సమావేశమయ్యారు.
మమతకు మద్దతిస్తామని యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలు ప్రకటించారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసిన శత్రుఘ్న సిన్హా, దేశ ప్రగతికి ఇదో ముందడుగు అని వ్యాఖ్యానించారు.
కూటమి సాధ్యమయ్యేనా?
ఇటీవల ఇంకా చాలామంది నేతలను మమతా బెనర్జీ కలిశారు. టీడీపీ, వైకాపా, బిజూ జనతా దళ్ ఎంపీలతో పాటు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళితోనూ ఆమె మాట్లాడారు.
మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీలన్నింటితో కలిసి ఆమె కూటమి ఏర్పాటు చేయగలరా? ఆయా పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఏకాభ్రిపాయం సాధ్యమవుతుందా?
ఈ ప్రశ్నలకు 'ది హిందూ' పత్రిక కోల్‌కతా బ్యూరో చీఫ్ శుభోజిత్ భాగ్చి ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
ప్రస్థుత పరిస్థితులను గమనిస్తే.. కూటమి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, దానికి నాయకత్వం వహించేది కాంగ్రెస్ పార్టీనా? లేక మరో పార్టీనా? అన్నది ప్రశ్న.
మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అలా మరికొన్ని పార్టీలను తీసుకురాగలిగితే అది ఆమెకు ప్రయోజనకరమే.
మమత లక్ష్యం ఏంటి?
పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో ఆమె మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. అలాగే, ఇతర పార్టీలతో కలిపి 60 - 70 స్థానాలు సాధించారంటే నాయకత్వం వహించేందుకు ఆమెకు మార్గం సుగమమం అయినట్టే.
ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌తో మమత చేతులు కలిపినా, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది పెద్ద ప్రశ్న.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే లాభం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్న విషయం మమతకు తెలుసు. దాంతో కాంగ్రెస్ 10 - 12 సీట్లు కోరితే ఆమె అంగీకరించకపోవచ్చు.
మమత 1:1 సూత్రం సాధ్యమేనా?
మమత చెప్పిన 1:1 సూత్రాన్ని అనుసరించడం పశ్చిమ బెంగాల్‌లో కష్టమైన పని.
ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను బట్టి ఆ ఫార్ములా పనిచేస్తుంది. అది చెప్పడానికి సులువైన సిద్ధాంతమే. కానీ, అమలు చేయడమే కష్టమైన పని.
50 - 60 సీట్లను తన నాయకత్వంలోకి తెచ్చుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. వరుసగా భేటీ అవుతుండటం ఆ వ్యూహంలో భాగమే. అది ఫలిస్తే ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం చాలా సులువు అవుతుంది.
బీజేపీ నేతలతోనూ భేటీ
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్‌ను కూడా మమత కలిశారు. దీన్ని బట్టి చూస్తే ఆమె అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది.
ఒకవేళ బీజేపీ తన మద్దతు కోరినా కూడా అందుకు ఆమె ఓకే చెప్పేయొచ్చు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మీద కోపంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి.
మోదీని పక్కన పెట్టి మరో నేతను తమ నాయకుడిగా ఆ పార్టీ ప్రకటిస్తే, అప్పుడు మమత శాంతించొచ్చు. కానీ, బీజేపీకి అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడంలేదు.
పశ్చిమ బెంగాల్‌లో 30 శాతం ఓట్లు ముస్లింలవే. అందువల్ల బీజేపీతో చేతులు కలిపేందుకు మమత సులువుగా నిర్ణయం తీసుకోకపోవచ్చు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)