You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: ఏం చెప్పబోతున్నాయి.. మరికొన్ని నిమిషాల్లో
పోలింగ్ ముగిశాక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంటుంది.
తెలంగాణలో మరికొద్ది నిమిషాల్లో పోలింగ్ ముగుస్తుండటంతో అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల సమయంలో వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
జాతీయ వార్తా చానెళ్లు ఎన్డీటీవీ, టౌమ్స్ నౌ, ఏబీపీ, హెడ్‌లైన్ టుడే, సీఎన్ఎన్ ఐబీఎన్, న్యూస్ 24లు వివిధ సర్వే సంస్థలతో కలిసి ఫలితాలను ప్రసారం చేశాయి.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన టీంతో సర్వే చేయించి పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నారు.
ఈసారి కూడా తెలంగాణ ఎన్నికలపై అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెలువర్చనున్నాయి.
అయితే, పోలింగ్‌కు ముందు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయోద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
దీంతో ఓటంగ్ ముగిసిన తర్వాతే తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించడానికి అన్ని సంస్థలు సిద్ధమయ్యాయి.
సర్వే ఫలితాలు వెల్లడించనున్న లగడపాటి
గతంలో లగడపాటి తన బృందంతో చేయించిన సర్వేల ఆధారంగా వేసిన అంచనాలు ఎక్కువ సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపై ఉంది.
తెలంగాణలో పోలింగ్ ముగిసిన తరువాత తన అంచనాలు మొత్తం వెల్లడిస్తానని లగడపాటి చెప్పడంతో డిసెంబర్ 11కి ముందే ఆయన చెప్పే ఫలితాల కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో వచ్చిన ఉపఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఫలితాలు అంచనా వేయడంతో ప్రాచుర్యంలోకి వచ్చారు.
2009 సార్వత్రిక ఎన్నికలు, ఆ తరువాత 2011, 2012, 2013లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఆయన బృందంతో సర్వేలు చేశారు.
పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు అంచనాలు వెల్లడించారు. ఆంధ్ర, రాయలసీమలు(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) ఒక యూనిట్‌గా, తెలంగాణ ఒక యూనిట్‌గా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కలిసి.. తెలంగాణలో టీఆర్ఎస్, దేశంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)