You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శబరిమలపై మహిళల్ని విభజిస్తున్నది ఎవరు?
- రచయిత, దేవిక జె
- హోదా, చరిత్రకారిణి, సామాజిక కార్యకర్త
కేవలం కొద్ది మంది మహిళలు అభ్యంతరం చెబుతున్న కారణంగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మళ్లీ నిషేధించాలన్న వాదన చాలా క్రూరమైనది.
శబరిమల సంప్రదాయాన్ని సంరక్షించే పేరిట జరుగుతున్న హింసను సమర్థిస్తూ చెబుతున్న కారణాలు.. హిందుత్వవాదం పేరిట జరుగుతున్న కుట్రగా కనిపిస్తోంది.
కానీ ఇది నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. కేరళలో మాతృస్వామిక సమాజం ఉందని, అక్కడ మహిళలకూ సమాన హక్కులు ఉంటాయన్న ప్రచారం పదేపదే జరుగుతోంది.
ఈ అందమైన భ్రమను పటాపంచలు చేసే నిజాలు ఎన్ని కనిపిస్తున్నా, దాన్ని మళ్లీ మళ్లీ వల్లె వేస్తున్నారు.
నిజానికి కేరళలో విద్యాస్థాయి పెరిగేకొద్దీ గృహహింస, వరకట్నం కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
కేరళలోని మొత్తం శ్రామిక శక్తిలో మహిళా కార్మికుల శాతం కేవలం 24.8 శాతం మాత్రమే. అదే విద్య విషయానికి వస్తే, ఇక్కడ 92 శాతం మంది మహిళలు విద్యావంతులు. ఈ విషయంలో కేరళ మొదటిస్థానంలో ఉంది.
కేరళలో నివసిస్తున్న వ్యక్తిగా, ఇతర ప్రాంతాలలో మాదిరే ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్ష ఉందని కచ్చితంగా చెప్పగలను.
ఇంకా చెప్పాలంటే, ఇక్కడ మహిళల హక్కుల గురించి మాట్లాడేవాళ్లు చాలా తక్కువ. వాళ్లు అధికారానికి కనీసం దగ్గర్లో కూడా లేరు. హక్కుల గురించి మాట్లాడేవాళ్లపై కొన్నిసార్లు దాడులు కూడా జరుగుతుంటాయి. ఇది ఇక దాచిపెట్టాల్సిన విషయం ఎంత మాత్రమూ కాదు.
శిష్టవర్గం అని ముద్ర వేసే కుట్ర
విమర్శకులు ఎల్లప్పుడూ తమకు అనుకూలంగా ఉండే నిజాలనే ఎంపిక చేసుకుంటారు.
కోర్టు తీర్పును సమర్థించే కేరళ, ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలపై 'శిష్టవర్గం' అన్న ముద్ర వేస్తున్నారు. వారి కోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక వంక మాత్రమే.
అదే సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే, అధికారాన్ని అనుభవిస్తున్న మహిళలను మాత్రం కేరళకు చెందిన సామాన్యులుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.
ఇలా మహిళలను రెండు వర్గాలుగా చీల్చి వాళ్లలో వాళ్లకు వివాదం సృష్టిస్తున్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే వారిని సామాన్య మహిళలకు శత్రువులుగా, సంప్రదాయాలను సమర్థించే మహిళలను సాధారణ మహిళలకు దగ్గర వారిగా చూపిస్తున్నారు.
రేప్ విషయంలోనూ ఇదే వాదన
మహిళా హక్కులను సమర్థించే వారంతా అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించేందుకే ఆలయంలోకి 10-50 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం లేదన్న వాదనను వ్యతిరేకించాలి.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారు, మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే పురుష భక్తులలో 'లైంగిక శక్తి' ఉత్పన్నం అవుతుందని వాదిస్తున్నారు. ఇది బాధితుల దుస్తులు, హావభావాల కారణంగానే రేప్ లేదా లైంగిక హింస జరుగుతున్నాయని చేసే వాదనలాంటిది కాదూ?
ఒకవేళ ఇదే సంప్రదాయమని వాదిస్తే, అలాంటి సంప్రదాయాన్నిన ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.
20వ శతాబ్దంలో అనేక సామాజిక సంస్కరణలు వచ్చినా ఎందుకు శబరిమలలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
కేవలం మహిళలే ఆలయ ప్రవేశం కోరుకుంటున్నారన్నది కూడా తప్పుడు అభిప్రాయమే.
కొంతమంది మూకలు హింసాత్మక ఘటనలకు దిగుతున్నారన్న కారణంతో వివక్షాపూరిత సంప్రదాయాన్ని సమర్థించలేము.
ఆలయంలో వివక్ష ఎందుకు?
ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు.. వలస పాలన కాలం నాటి అనేక చట్టాలను కొట్టేసింది. వాటిలో 157 ఏళ్ల నాటి స్వలింగ సంపర్కం నేరమనే చట్టాలు కూడా ఉన్నాయి.
శబరిమల నేపథ్యంలో, ఇదే కోర్టు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది. దేవుడు స్త్రీపురుషుల మధ్య తేడాను చూడనపుడు, ఆలయ ప్రవేశంలో మాత్రం ఎందుకు చూపాలి?
శబరిమల ఆలయ ప్రవేశంపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు, ''తమకు నచ్చిన సంప్రదాయాలను అనుసరించే హక్కు స్త్రీపురుషులిద్దరికీ సమానంగా ఉంటుంది'' అని పేర్కొంది.
సుప్రీంకోర్టే దాన్ని విశ్వసిస్తే, మనమెందుకు విశ్వసించలేం?
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)