You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శబరిమలలో తృప్తి దేశాయ్: ‘నన్ను చంపేస్తామని 300 మెసేజ్‌లు వచ్చాయ్’
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు కేరళ వెళ్లిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్, ఆలయానికి వెళ్లడం కుదరకపోవడంతో వెనక్కి తగ్గారు. కొచ్చి విమానాశ్రయం నుంచి ఆమె ముంబయికి తిరుగు ప్రయాణమయ్యారు.
శుక్రవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తృప్తి దేశాయ్‌తో పాటు, మరో ఆరుగురు మహిళలు శబరిమలకు చేరుకోకుండా విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే దారులన్నింటినీ భక్తులు మూసివేశారు.
తృప్తి, ఆమెతో ఉన్న మహిళలు శుక్రవారం వేకువజామున 4.30 గంటలకే కోచి విమానాశ్రయం చేరుకున్నారు. కానీ అక్కడ నుంచి శబరిమలకు చేరుకోడానికి వారికి ఒక్క ట్యాక్సీ కూడా దొరకలేదు.
"ఎవరైనా తమపై దాడి చేస్తారేమోనని, తమ వాహనాన్ని ధ్వంసం చేస్తారని ట్యాక్సీ డ్రైవర్లు భయపడుతున్నారు" అని తృప్తి దేశాయ్ బీబీసీకి చెప్పారు.
పునర్విచారణకు సుప్రీంకోర్టు సిద్ధం
కేరళ శబరిమల ఆలయం తలుపులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరచుకుంటాయి. ఈరోజు నుంచి 64 రోజుల వరకూ అయ్యప్ప దీక్షలో చాలా కీలకమైన సమయంగా భావిస్తారు.
తృప్తి దేశాయ్ మొదట మహారాష్ట్ర్లలోని శని సింగనాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం కోసం ఉద్యమం చేశారు, అందులో సఫలం అయ్యారు. అక్కడ కూడా ఆమెను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి.
తృప్తి శబరిమల ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్న భక్తులు అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని, అందుకే నెలసరి అయ్యే వయసు మహిళలు ఎవరూ ఆలయంలోకి ప్రవేశించకూడదని భావిస్తారు. ఇటు సుప్రీంకోర్టు మాత్రం మహిళలు ఆలయంలో ప్రవేశించవచ్చని సెప్టంబర్ 28న అనుమతి ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తన తీర్పుపై పునర్విచారణకు సిద్ధమవుతోంది.
800 మంది మహిళల రిజిస్ట్రేషన్
కేరళ పోలీసులు తమ రక్షణ కోసం 150 మంది పోలీసులను విమానాశ్రయంలో మోహరించడంపై తృప్తి దేశాయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. "వాళ్లు నన్ను కాసేపు వేచిచూడమని చెప్పారు. తర్వాత వాళ్లు నన్ను పత్తినంతిట్ట వరకూ తీసుకెళ్తారు. అక్కడి నుంచి మేం శబరిమలకు వెళ్తాం" అని ఆమె చెప్పారు.
అయితే, ఒక రోజు ముందు "పోలీసులు తమకు ప్రత్యేక రక్షణ కల్పించడానికి నిరాకరించారని" తృప్తి ఆరోపించారు.
"నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్లలేవని సోషల్ మీడియాలో నాకు 300కు పైగా సందేశాలు వచ్చాయి. బహుశా ఇలాంటి మెసేజులు వేరే ఏ మహిళకూ వచ్చుండవేమో" అని ఆమె బీబీసీతో అన్నారు.
పోలీసుల వెబ్‌సైట్‌లో ఇప్పటివరకూ 800 మంది మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ మహిళలందరూ 50 ఏళ్ల లోపు వారే.
ముఖ్యమంత్రి చర్చలు విఫలం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రతిష్టంభనకు తెరవేయడానికి ప్రతిపక్షాలు, పందళం రాజ వంశం, తాంత్రి కుటుంబాలతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.
ఆలయంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలతో స్వయంగా ముఖ్యమంత్రే చర్చలు జరపాల్సి వచ్చింది. సెప్టంబర్ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు పునర్విచారణకు సిద్ధమైనా, తమ ఆదేశాలపై మాత్రం స్టే విధించేది ఉండదని కోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలని కోర్టు చెబుతోంది.
"సుప్రీంకోర్టు మహిళలను ఆలయంలో ప్రవేశించడానికి అనుమతించాలని స్పష్టంగా చెప్పింది. మేం ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలా వెళ్లగలం. మేం భక్తుల మనోభావాలు గౌరవిస్తున్నాం. కానీ కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. మేం కోర్టు తీర్పును బలహీనపరచాలని అనుకోవడం లేదు. కానీ మేం శబరిమలలో హింస జరగాలని కూడా కోరుకోవడం లేదు" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
ఒకే బాటలో బీజేపీ-కాంగ్రెస్
ఆలయ ప్రవేశం విషయంలో ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారంటూ కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై అంతకు ముందు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవడం లేదని చెన్నితాల అన్నారు. "ముఖ్యమంత్రి మొండి వైఖరితో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునర్విచారణ చేస్తోంది కాబట్టి, పరిస్థితులు ప్రశాంతంగా ఉండేలా జనవరి 22 వరకూ వేచిచూడాలని మేం ప్రభుత్వానికి చెప్పాం" అన్నారు.
ముఖ్యమంత్రి అహంకార వైఖరితో మాట్లాడుతున్నారని బీజేపీ నేత శ్రీధరన్ పిళ్లై ఆరోపించారు. "ఆయన కమ్యూనిస్టు భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. మేం సమ్మెకు నిర్ణయించాం" అన్నారు.
అక్టోబర్‌లో చాలా మంది మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ వారిని భక్తులు ముందుకు వెళ్లనివ్వలేదు. ఆ భక్తులందరూ సంఘ్ పరివార్ సభ్యులేనని పిళ్లై తర్వాత చెప్పారు. ఇద్దరు మహిళలైతే పోలీసుల రక్షణతో ఆలయంలోకి వెళ్లాలని కూడా ప్రయత్నించారు. కానీ వాళ్లు కూడా వెళ్లలేకపోయారు.
ఇవి కూడా చదవండి:
- సిసలైన తెలంగాణ ప్రజావాణి బీబీసీ న్యూస్ తెలుగులో
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- మోదీ కోటి ఉద్యోగాల హామీ నిజమా? అబద్ధమా? BBC REALITYCHECK
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)