వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి: కుట్ర ఉందన్న వైసీపీ.. విచారణ జరిపిస్తున్నామన్న హోం మంత్రి

ఆంద్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన ఘటన సంచలనంగా మారింది.

ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహనరెడ్డి హైదరాబాద్ వెళ్లేందుకు గాను విశాఖ విమానాశ్రయానికి రాగా అక్కడ ఓ యువకుడి కోడిపందేల్లో వాడే కత్తితో జగన్‌ను గాయపరచడం కలకలం రేపింది. ఘటన అనంతరం జగన్ ప్రథమ చికిత్స చేయించుకుని హైదరాబాద్ విమానమెక్కారు.

నేను క్షేమం.. ఆందోళన వద్దు

హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ''నేను సురక్షితంగానే ఉన్నాను.

దేవుడి దయ, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదమే నాకు రక్ష. ఇలాంటి పిరికిపంద చర్యలు నన్నేమాత్రం భయపెట్టకపోగా నా రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేసేలా బలం అందిస్తాయి'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

విపక్ష నేతపై జరిగిన దాడికి ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన కీలక నేతలంతా ఖండించారు. అసలు విమానాశ్రయ లాంజ్‌ల వరకు కత్తితో ఎలా రాగలిగారని..? దీనిపై విచారణ చేస్తున్నామని ఏపీ హోమంత్రి చినరాజప్ప చెప్పారు. ఈ దాడి నేపథ్యంలో జగన్‌కు భద్రత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

భద్రత పెంచమని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటే ఇది కచ్చితంగా కుట్రే. దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి. జగన్మోహనరెడ్డి భద్రతను మరింత పటిష్ఠం చేయాలని గతంలో ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఆయన ప్రయాణించే వాహనాలు కూడా తరచూ మరమ్మతులకు గురై మొరాయిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటే వారి ఉద్దేశం ఇదేనా?

తక్షణమే దర్యాప్తు మొదలైంది: సురేశ్ ప్రభు

జగన్‌పై విమానాశ్రయంలో దాడిలో జరగడంపై పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది పిరికిపంద చర్య అని ఆయన అన్నారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శిని దీనిపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించాలని కోరినట్లుగా ఆయన చెప్పారు.

సీఐఎస్‌ఎఫ్ సహా వివిధ సంస్థలను దర్యాప్తు చేయమని ఆదేశించినట్లు సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే దర్యాప్తు మొదలైందని ఆయన చెప్పారు.

జగన్ యోగక్షేమాలడిగిన గవర్నర్ నరసింహన్

విపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్‌ నరసింహన్‌ వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేసి తక్షణ నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు.

ఇది పిరికిపంద చర్య: ఏపీ మంత్రి నారా లోకేశ్

విశాఖ విమానాశ్రయంలో జగన్మోహనరెడ్డిపై కత్తి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆధునిక సమాజంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు చోటుండరాదు.

జగన్ కోలుకోవాలి: జనసేన అధినేత పవన్ కల్యాణ్

విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం అమానుషం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావుండరాదన్నది జనసేన ప్రబల విశ్వాసం.

ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

గాయం నుంచి జగన్మోహనరెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

కుట్ర ఉండొచ్చు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

జగన్‌పై దాడిలో కుట్ర ఉందనే అనుమానం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి.

కోళ్ల పందేలలో వాడే కత్తులు చాలా పదునుగా ఉంటాయి. ఇలాంటి దాడులు చాలా దారుణం.

ఎయిర్‌పోర్టులోనే భద్రత కొరవడితే ఎలా: జీవీఎల్ నరసింహరావు

ఎయిర్‌పోర్ట్ భద్రంగా ఉంటుందనుకుంటాం.. అలాంటి చోటే ఈ దాడి జరిగింది. ఏపీ ప్రభుత్వం దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి.

జగన్‌పై దాడి చేసినవారిని శిక్షించాలి: టీఆరెస్ నేత కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)