ఎన్.డి. తివారీ: కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ గురువారం నాడు కన్ను మూశారు. ఆయన వయసు 93 ఏళ్ళు.

గత కొంతకాలంగా ఎన్.డి. తివారీ అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన 1925 అక్టోబర్ 18న జన్మించారు. చివరకు ఆయన తన పుట్టినరోజునే తుదిశ్వాస విడిచారు.

అయిదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తివారీ జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు.

ఆయన 1976-77, ఆ తరువాత 1984-84, మళ్ళీ 1988-89 మధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడో ముఖ్యమంత్రిగా 2002-2007 మధ్యకాలంలో పని చేశారు.

ఎన్‌డీ తివారీ పేరు తెలుగు ప్రజలకూ సుపరిచితమే. ఆయన సుమారు రెండున్నరేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నరుగా పనిచేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వాలలో పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఆర్థిక శాఖలకు మంత్రిగానూ ఉన్నారు.

రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా..

దేశంలో రెండు వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత ఆయన. 1977, 1989 మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వేరుపడ్డాక ఉత్తరాఖండ్‌కు కూడా 2002 నుంచి 2007 వరకు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా..

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ 2007 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆయన మళ్లీ సీఎం కాలేకపోయారు. అయితే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగిన కొన్ని నెలలకే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నరుగా పంపించింది.

2007 ఆగస్టు 22 నుంచి 2009 డిసెంబరు 26 వరకు ఆయన ఏపీ గవర్నరుగా కొనసాగారు. అయితే, రాజ్‌భవన్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవిని వీడారు. ఆరోగ్య కారణాలు చూపుతూ ఏపీ గవర్నరు పదవికి రాజీనామా చేసి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్ వెళ్లిపోయారు.

ప్రజా సమాజ్‌వాది పార్టీతో మొదలై..

తివారీ అత్యధిక కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ ఆయన రాజకీయ జీవితం మాత్రం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన నైనితాల్ నియోజకవర్గం నుంచి ప్రజా సమాజ్‌వాది పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లోనూ అక్కడి నుంచే మళ్లీ గెలిచారు.

అనంతరం 1963లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 1965లో కాశీపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు.

1976లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. 1976 నుంచి 1988 మధ్య మూడు సార్లు ఆయన సీఎంగా పనిచేశారు.

మధ్యలో 1985లో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. ఆ సమయంలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.

ప్రధాని రేసులో..

రాజీవ్‌గాంధీ మరణం తరువాత 1990లో ఆయన ప్రధాని పదవి రేసులోనూ నిలిచారు. కానీ, ఆ పదవి పీవీ నరసింహారావును వరించింది. ఆ సమయంలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనకు మైనస్‌గా మారింది.

అనంతరం 1994లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అర్జున్ సింగ్‌తో కలిసి 1995లో ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ) స్థాపించారు. దీన్నే తివారీ కాంగ్రెస్ అంటారు.

కానీ, సోనియా గాంధీ ఆహ్వానంతో రెండేళ్ల తరువాత మళ్లీ సొంత గూటికి వచ్చేశారు. 1996, 98ల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అనంతరం ఉత్తరాఖండ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2007లో ఏపీ గవర్నరుగా నియమితులయ్యారు.

ఆయనతోనే ఆరంభం

జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ యూత్ సెంటర్‌ను స్థాపించింది తివారీయే. అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడూ ఆయనే. నెహ్రూ యువకేంద్రాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో తివారీ కీలకంగా పనిచేశారు.

బీజేపీకి మద్దతు

వయసు పైనపడడం, వివాదాల కారణంగా ప్రధానస్రవంతి రాజకీయాల నుంచి కొంత తెరమరుగైన ఆయన 2017లో బీజేపీకి మద్దతు పలికారు.

నరేంద్ర మోదీ పాలనలో అభివృద్ధిని ప్రస్తుతిస్తూ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తివారీ కుటుంబం సహా బీజేపీలో చేరారు.

వివాదాలు

* వ్యక్తిగత జీవితంలో తివారీని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఏపీ గవర్నరుగా ఉన్నప్పుడు రాజ్‌భవన్‌లో ముగ్గురు మహిళలతో పడకపై ఉన్న వీడియోలను ఒక ఛానల్ ప్రసారం చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసు కేసు కూడా నమోదైంది. దీనిపై తివారీ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూనే రాజకీయ కుట్రతో తనను ఇరికించారని ఆరోపించారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.

* ఏపీ గవర్నరుగా ఉన్న సమయంలోనే తివారీ మరో వివాదంలో నిండా మునిగిపోయారు. రోహిత్ శేఖర్ అనే వ్యక్తి తాను తివారీ కుమారుడినంటూ ముందుకు వచ్చారు. దీన్ని తివారీ ఖండించారు. కోర్టు ఆదేశాలతో డీఎన్‌ఏ పరీక్షలు జరిపి రోహిత్ శేఖర్ తండ్రి ఎన్డీ తివారీయేనని నిర్ధారించారు. తొలుత కాదంటూ వచ్చినా చివరకు 2014లో తివారీ.. రోహిత్‌ను తన కుమారుడిగా అంగీకరించారు. అనంతరం కొద్దినెలలకే శేఖర్ కన్నతల్లి ఉజ్వలను వివాహమాడి భార్యగా స్వీకరించారు. ఈ వివాహం చేసుకునేనాటికి తివారీ వయసు 88 ఏళ్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)