టిండర్: డేటింగ్ యాప్‌లో కొత్త ఫీచర్

డేటింగ్ యాప్ టిండర్ భారత్‌లో 'మై మూవ్' అనే కొత్త ఫీచర్‌ను కొన్ని నెలలుగా పరీక్షిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నవారు పరస్పరం 'లైక్' చేసుకున్నాక సందేశాలు పంపించుకునే వీలుండేది. తాజాగా మహిళల భద్రత కోణంలో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

టిండర్ యాప్‌లో ఉన్న మహిళలు తమ వైపు నుంచి ఇతరులకు తొలి సందేశం పంపించాక మాత్రమే వారికి సందేశాలు వచ్చేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు.

దీనివల్ల మహిళలకు పురుషుల నుంచి ఇబ్బందులు తప్పుతాయని సంస్థ చెబుతోంది.

ఇకపై మహిళా యూజర్ చాటింగ్ కోరుకుంటే తప్ప పురుష యూజర్లు ఆమెకు సందేశం పంపించడానికి వీలు కాదు.

భారత్‌లోని పలు ప్రాంతాల్లో మహిళలపై లైంగిక నేరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమాధ్యమాల్లో రావడంతో మహిళల భద్రతపై ఆందోళన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే టిండర్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ ఫీచర్ వల్ల చాటింగ్‌పై మహిళా యూజర్లకు స్వీయ నియంత్రణ అవకాశం ఉంటుందని మేచ్ గ్రూప్ ఇండియా జనరల్ మేనేజర్ తరూ కపూర్ తెలిపారు.

పురుషులే అధికం

కాగా టిండర్ పోటీదారు బంబుల్ యాప్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ ఉంది.

బంబుల్ యాప్‌ను టిండర్ సహ వ్యవస్థాపకుడు విట్నీ వోల్ఫ్ స్థాపించారు. ఈ రెండు సంస్థలూ ప్రస్తుతం ఒకదానిపై ఒకటి కేసులు వేసుకుని న్యాయస్థానంలో పోరాడుతున్నాయి.

బంబుల్ తమ స్వైప్ తరహా ఇంటర్‌ఫేస్‌ను కాపీ కొట్టిందని టిండర్ మాతృసంస్థ మేచ్ గ్రూప్ ఆరోపిస్తోంది. అందుకు బదులుగా బంబుల్ కూడా టిండర్‌పై ప్రత్యారోపణలు చేస్తోంది.

తమ సంస్థను టేకోవర్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మోసపూరిత మార్గాల్లో తమ వాణిజ్య రహస్యాలను తెలుసుకుందని బంబుల్ ఆరోపించింది.

టిండర్ యూజర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' జూన్‌లో తెలిపింది. టిండర్ మాత్రం ఇలాంటి గణాంకాలను ఇంతవరకు వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)