జస్టిస్ కేఎస్ పుట్టస్వామి: చరిత్రాత్మక ఆధార్ కేసులో తొలి పిటిషనర్

ఆధార్ రాజ్యాంగ బద్ధమే కానీ దానికి కొన్ని పరిమితులున్నాయంటూ బుధవారం నాడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆధార్ కేసుగా ప్రచారం పొందిన ఈ కేసులో మొట్టమొదట పిటిషిన్ వేసింది జస్టిస్ కేఎస్ పుట్టస్వామి.

92ఏళ్ల పుట్టస్వామి గతంలో కర్ణాటక హైకోర్టు జడ్జిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బీసీ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు.

ఆధార్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు గురించి టీవీ న్యూస్ ద్వారా సమాచారం తెలుసుకున్న పుట్టస్వామి బీబీసీతో మాట్లాడుతూ... ఈ తీర్పు సరైనదిగా, సహేతుకమైనదిగా అనిపిస్తోందని చెప్పారు.

ఆధార్ కేసుతో పాటు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కేసులోనూ తొలి పిటిషనర్ పుట్టస్వామే.

2012లో ఆధార్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినప్పుడు, భారత్‌లో రెండు చరిత్రాత్మక తీర్పుల్లో తాను భాగమవుతానని పుట్టస్వామి ఊహించలేదు.

సుప్రీంకోర్టు రికార్డుల్లో ఆధార్ కేసు పుట్టస్వామి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగానే భవిష్యత్తు తరాలకు కనిపిస్తుంది. కానీ, పుట్టస్వామి మాత్రం చాలా సాదాసీదాగా, ఆ కేసుల్లో తన పాత్ర పెద్దగా ఏమీ లేనట్లుగానే వ్యవహరిస్తారు.

‘ఆయన మొదట్నుంచీ చాలా నిరాడంబరుడు. కోర్టులో ఉన్నంత కాలం ఆయన అలానే ఉండేవాడు’ అని కర్ణాటక హైకోర్టులో ఆయనతో కలిసి పనిచేసిన జస్టిస్ రామా జోయిస్ చెబుతారు.

జోయిస్ గతంలో పంజాబ్, హరియాణా హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌గా, బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

ఆధార్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల గురించి మొదట జస్టిస్ జోయిస్‌తో చర్చించాకే పుట్టస్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.

‘2010లో నాన్నగారి స్నేహితులు కొందరు దిల్లీ నుంచి వచ్చారు. వాళ్లతో టీ తాగుతూ మాట్లాడే సందర్భంలో ఆధార్ కూడా చర్చకు వచ్చింది. అధికారిక ఆదేశాల ద్వారా పౌరుల వేలిముద్రలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని వాళ్లు చర్చించుకున్నారు’, అని పుట్టస్వామి కుమారుడు బీపీ శ్రీనివాస్ చెప్పారు.

‘ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేయొచ్చన్నది పుట్టస్వామి చర్చించారు. తరువాత ఆయన సొంతంగా పిటిషన్ వేశారు. కానీ, సుప్రీం కోర్టులో వాదనలకు ఆయన ఎప్పుడూ హాజరు కాలేదు. ఇతర న్యాయవాదులే ఈ కేసును వాదించారు’ అని జస్టిస్ జోయిస్ వివరించారు.

సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణియన్ కూడా కేసు తొలి దశలో ఈ వాదనల్లో పాలుపంచుకున్నారు.

‘నేను పిటిషన్ దాఖలు చేసే సమయానికి ఆధార్ విషయంలో అధికారిక ఆదేశాలు మాత్రమే వెలువడ్డాయి. తరువాతే ఆధార్ యాక్ట్‌ను జారీచేశారు. ఇప్పుడు ఆ యాక్ట్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా ఉన్న రెండు సెక్షన్లను కోర్టు రద్దు చేసింది’ అని జస్టిస్ పుట్టస్వామి చెప్పారు.

‘ఆధార్ యాక్ట్ క్రిమినల్స్‌ను కనిపెట్టడానికి ఉపయోగపడొచ్చు. కానీ మీలాంటి, నాలాంటి సాధారణ పౌరులకు మాత్రం అది ఉపయోగపడకపోవచ్చు అన్నది నా అభిప్రాయం’ అని ఆయన అన్నారు.

కోర్టు తీర్పును మొత్తం చదవకుండా తన అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పడం సాధ్యం కాదని పుట్టస్వామి తెలిపారు.

మరో పక్క ఐఐటీ దిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త రీతికా ఖేరా మాట్లాడుతూ ఆధార్‌ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు నిరుత్సాహ పరిచిందని చెప్పారు. రీతికా ఖేరా, ఆధార్ పైన అనేక వ్యాసాలు రాశారు. జాన్ డ్రెజ్ లాంటి ఆర్థికవేత్తలతో కలిసి ఆధార్‌కు సంబంధించి పలు పత్రాలను ప్రచురించారు.

‘ఆధార్ యాక్ట్‌లోని సెక్షన్ 57ను రద్దు చేయడం మినహా ఆధార్‌పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సామాన్యులకు అదనపు ప్రయోజనాలు కలగవు. 2013 నుంచి సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నాయి.

మొత్తంగా ఆధార్ ప్రాజెక్టు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ చంద్రచూడ్ చెప్పినట్లుగా మేం కూడా విశ్వసిస్తున్నాం. జస్టిస్ చంద్రచూడ్ తీర్పే ఏదో ఒకరోజు గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాం’ అని రీతికా పేర్కొన్నారు.

ఆధార్ కేసులో తీర్పిచ్చిన ధర్మాసనంలో సీజేఐ దీపక్ మిశ్రా, ఎ.కె.సిక్రి, ఎ.ఎం.ఖాన్‌విల్కర్, డి.వై.చంద్రచూడ్, అశోక్ భూషణ్ ఉన్నారు. మిగతా నలుగురు న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ఆధార్ రాజ్యాంగ విరుద్ధమైనదంటూ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)