‘అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కాల్చి చంపిన మావోయిస్టులు’

విశాఖ జిల్లాలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. మావోయిస్టులు ఆయన్ను కాల్చి చంపినట్లు పాడేరు డీఎస్పీ మహేంద్ర మత్తె బీబీసీకి చెప్పారు.

ఆయన బీబీసీ ప్రతినిధి బళ్ల సతీష్‌కు వెల్లడించిన వివరాల మేరకు..

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని తిరిగి అరకు వస్తుండగా.. డుంబ్రిగుంట మండలం లివిటిపుట్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఎమ్మెల్యే కిడారిపైన, ఆయనతోపాటు ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపైనా మావోయిస్టులు కాల్పులు జరిపారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కిడారి ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఈ ఘటనలో 40-50 మంది మావోయిస్టులు పాల్గొని ఉండొచ్చని, వారంతా సామాన్య పౌరుల్లా సివిల్ దుస్తుల్లో వచ్చారని పాడేరు డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు.

సివేరు సోము 2009లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో అరకు నుంచి పోటీ చేసిన సర్వేశ్వరరావు, సివేరు సోముపై విజయం సాధించారు.

ఈ ఎన్నికలలో వైసీపీ తరపున గెలిచిన కిడారి సర్వేశ్వరరావు, తర్వాత తెలుగుదేశంలో చేరారు.

కిడారిపై జరిగిన దాడి గురించి అధికారులు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు తెలుపగా.. ఈ దాడిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని అన్నారు.

వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరు చేసిన సేవలను చంద్రబాబు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

కిడారి హత్యపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలు వేరైనా, తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న ఆమె.. మావోయిస్టులు ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

కిడారి, సివేరుల హత్య నేపథ్యంలో గ్రామదర్శినిలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు కల్పించే రక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ సంఘటన నేపథ్యంలో శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ సమీక్ష జరిపారు.

స్థానికుల ఆందోళన

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు బీబీసీకి చెప్పారు. అరకు, డుంబ్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లపై గ్రామస్తులు దాడులకు దిగారు. ఫర్నిచర్‌ను తగలబెట్టారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు.

‘గన్‌మెన్‌ల నుంచి ఆయుధాలు లాక్కున్నారు’

లివిటి‌పుట్ గ్రామానికి వెళ్తుండగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాహనాలను మావోయిస్టులు ఆపి కాల్పులకు దిగారని విశాఖపట్నం డీఐజీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు ఒక గన్‌మెన్ ఉన్నారని చెప్పారు.

‘‘గన్‌మెన్‌ల నుంచి మావోయిస్టులు 9 ఎంఎం పిస్టల్, కార్వాన్ తీసకున్నారు. సుమారు 20 మంది మావోయిస్టులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దర్నీ చంపారు. అక్కడ సిగ్నల్ సమస్య ఉంది. దాంతో ఘటన ఎలా జరిగిందనే విషయంపై మాకింకా సమాచారం అందాల్సి ఉంది. ’’ అని తెలిపారు.

ఒడిశా సరిహద్దుకు 15 కిమీ దూరంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)