You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పదుల సంఖ్యలో మహిళలను మోసం చేసిన ‘జవాన్’ పోలీసులకు ఎలా చిక్కాడంటే..
- రచయిత, భార్గవ్ పరీఖ్
- హోదా, బీబీసీ కోసం
అతని పేరు జులియన్ సిన్హా వయసు 42. తాను ఓ జవాన్‌గా చెప్పుకుంటాడు. అదే పేరుతో పలు వివాహ సంబంధాల వెబ్‌సైట్లలో ప్రొఫైల్ సృష్టించాడు. ఒంటరి మహిళలు, వితంతువులకు సంబంధించిన ఫోన్ నంబర్లు సేకరించాడు.
వారికి ఫోన్ చేసి.. మీ ప్రొఫైల్ ఇంటరెస్టింగ్‌గా ఉంది.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెప్పాడు.
తర్వాత లక్షల రూపాయలు మోసం చేసి పరారవుతాడు.
ఒకరూ ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో మహిళలను ఇలా మోసం చేశాడు ఈ అహ్మదాబాదీ.
ఇలా ఇతని బాధితురాలైన కవిత.. పోలీసులను ఆశ్రయించారు.
దీంతో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు ఇతను జవాన్ కాదని.. ఓ మాజీ సైనికుని కుమారుడని తేలింది.
‘‘ఒంటరి మహిళలు సానుభూతి కోసం చూస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని అతను సానుభూతి చూపుతున్నట్లు నటించి.. చాలా మందిని బుట్టలో వేసుకున్నాడు.'' అని కవిత చెప్పారు.
వితంతువులు, ఒంటరి మహిళల కుటుంబ నేపథ్యాన్ని అధ్యయనం చేసి ధనవంతులైన మహిళలను ఎంపిక చేసుకుని వారిని బుట్టలో వేసుకోడానికి అతను ప్రణాళిక రూపొందించేవాడని వివరించారు.
మహిళలు వలలో పడ్డాక.. తాను ఆర్మీ మేజరుగా ఫోజు కొట్టేవారని.. ఉగ్రవాద వ్యతిరేక నిధి కోసం విరాళం పేరిట వారి నుంచి డబ్బులు తీసుకునేవారని కవిత చెప్పారు.
ఉగ్రవాదులతో పోరాటం సందర్భంగా తాను గాయపడ్డానని.. ఆర్మీలో ఉన్నందు వల్ల తన భార్య తనకు విడాకులు ఇచ్చిందని కథలు చెప్పేవాడని తెలిపారు.
కవిత ఎలా మోసపోయారు?
కవిత బీబీసీకి తాను ఎలా మోసపోయిందీ వివరించారు.
'' మేం వివాహ సంబంధాల వెబ్ సైట్ ద్వారా స్నేహితులమయ్యాం. అప్పుడు అతను తాను సైన్యంలో ఉండడం వల్లే తన భార్య తనకు విడాకులిచ్చిందని చెప్పాడు. ఇంకా చాలా ఎమోషనల్ కథలు చెప్పేవాడు. దీంతో నేను అతనికి పడిపోయాను.
ఒక రోజు కొన్ని కారణాల వల్ల తన బ్యాంకు ఖాతా సీజ్ అయిందని.. తనకు వెంటనే రూ.49,500 అవసరమని చెప్పాడు. ఆ డబ్బులు ఇస్తే తనకు ఆర్మీ నుంచి ఇల్లు వస్తుందని నమ్మబలికాడు. నేను డబ్బులు ఇస్తే తర్వాత రోజే ఇచ్చేస్తానన్నాడు. తర్వాత నాకు ఫోన్ చేయడం మానేశాడు.’’
‘‘నేను ఎప్పుడు ఫోన్ చేసినా.. మరింత డబ్బు అడిగేవాడు. పెళ్లి గురించి ప్రస్తావిస్తే.. ఆసక్తి చూపేవాడు కాదు. ’’
‘‘దీంతో నాకు అనుమానం వచ్చింది. అతని వివరాలు ఆరా తీస్తే.. అతని తండ్రి ఆర్మీలో మాజీ ఉద్యోగని.. ఇతను ఆర్మీలో పని చేయడం లేదని తేలింది. తర్వాత ఇలాగే చాలా మంది మహిళలనూ మోసం చేశాడని గుర్తించాం. దీంతో అతనితో టచ్‌లో ఉంటూనే పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని కవిత వివరించారు.
ఇలా దొరికాడు
గుజరాత్ సైబర్ విభాగం ఇన్స్‌పెక్టర్ జీఎస్ గెడ్మీ మాట్లాడుతూ.. ‘‘అతను కవితతో టచ్‌లో ఉన్నపుడు అతని గురించి దర్యాప్తు చేశాం. అప్పుడు అతను వివాహ సంబంధాల వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ని సృష్టించినట్లు తేలింది.’’ అని తెలిపారు.
దిల్లీలో ఒక మహిళ అతనికి రూ.మూడు లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
తర్వాత ఇతన్ని మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మొతెరాలో అరెస్టు చేశారు.
2016లో ఇతను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళా వ్యాపార వేత్త వద్ద రూ.30 లక్షలు కాజేసి.. అరెస్టయినట్లు తేలింది.
ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి మరింత మంది మహిళలను మోసం చేశాడని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)