You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దేశంలో సగటున గంటకో రైతు ఆత్మహత్య
- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ఈ దేశంలో రైతుల మరణాల గురించి ఎవరికీ పట్టలేదు'. ఈ వాక్యం చదివేటప్పుడు మీరు రొట్టె ముక్కో, వరి అన్నమో, మొక్కజొన్న పొత్తులో, బిస్కట్టో ఏదో ఒకటి తింటుండవచ్చు.
లేదా మీరు టీవీలో ఏదో సినిమానో చూస్తూ దేశంలోని ఏదో ఒక భాగంలో ఒక రైతు కష్టపడి పండించిన ధాన్యంతో తయారు చేసిన ఆహారాన్ని తింటుండవచ్చు.
లేదా ఆ టీవీ యాడ్‌లో చూపించిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఎలా కొనాలా అని ఆలోచిస్తుండవచ్చు.
అయితే మీరు ఆన్‌లైన్ షాపింగ్ గురించి ఆలోచించే సమయంలో - ఆ దుస్తులు తయారు చేయడానికి అవసరమైన పత్తిని పండించి, చాలా తరచుగా ఆత్మహత్యలు చేసుకోవాలని భావించే విదర్భ రైతుల గురించి ఆలోచించకపోవచ్చు.
భారతదేశంలో సగటున ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు.
ఆ రైతుకు పేరుండదు. అతని గురించి ఎవరికీ తెలియదు. వ్యవసాయంలో ఉన్న కోట్లాదిమందిలో అతను ఒకడు. అనేక ఏళ్ల పాటు వ్యవసాయం చేసి, ఎలాంటి ప్రతిఫలమూ లేక విసుగు చెంది అతను ఆత్మహత్య చేసుకోవచ్చు.
వ్యవసాయంలో రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారంటే, వాళ్లు రుణాలు తీసుకుంటున్నా, వాళ్ల జీవితాలు బాగుపడడం లేదు. అందుకే వాళ్లు కొన్నిసార్లు పంటల్లో కొట్టడానికి తెచ్చుకున్న పురుగుమందులను తాగి, కొన్నిసార్లు రైలు పట్టాలపై పడుకుని, కొన్నిసార్లు ఉరి వేసుకుని, కొన్నిసార్లు రాళ్లు కట్టుకుని బావుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని భార్యాపిల్లలను అనాథలుగా చేసి పోతున్నారు.
వ్యవసాయంలో సంక్షోభం కారణంగా గత రెండు దశాబ్దాలుగా రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయినా వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
వ్యవసాయరంగంలోని సంక్షోభాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏముంది?
వ్యవసాయ సంక్షోభం గురించి మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్న వేసుకునే ముందు, వ్యవసాయానికి సంబంధించిన గణాంకాలు పరిశీలించే ముందు ఒక చిన్న కథ:
నేను మూడో తరగతిలో చదివేప్పుడు మొదటిసారి 'భారతదేశంలో రైతులు' అన్న విషయంపై ప్రసంగించాను. ఆ సందర్భంలో 'భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతులే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక' అన్నవి ప్రారంభవ్యాక్యాలు.
చేతిలో మా నాన్న రాసిచ్చిన ఆ ప్రసంగం కాపీ పట్టుకుని, బెదురుతూ ఆ మాటలు మాట్లాడుతున్నపుడు, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్న రైతుల గురించి నాకు ఏ మాత్రం తెలియదు. ఆ వెన్నెముక నేను పెరిగి పెద్దయ్యేసరికి విరిగే పరిస్థితి వస్తుందని కూడా నాకు తెలీదు.
మరి ప్రజలు 'అన్నదాత' అని కొనియాడిన రైతులు ఇప్పుడు ఒక ఆత్మహత్యల పట్టికగా ఎలా మారుతున్నారు? మన ప్రధానస్రవంతి మీడియాకు 'రైతు ఆత్మహత్య' అన్నది ఒక పనికిమాలిన వార్తగా ఎలా మారిపోయింది? పార్లమెంట్, అసెంబ్లీలో చేస్తున్న 'రుణమాఫీ'లు రైతుల అకౌంట్ల వరకు ఎందుకు చేరడం లేదు?
70 ఏళ్ల అనంతరం కూడా మారని రైతుల పరిస్థితి
ఇటీవల రైతులు తమ సమస్యలను ప్రభుత్వాల వద్దకు, మన వద్దకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నాసిక్ నుంచి ముంబైకు వేలాది మంది రైతులు ఒట్టికాళ్లతో వెళ్లారు. దిల్లీ ఎండల్లో రోడ్డు పక్కన ఏది దొరికితే అది తిని, తమ ఆగ్రహాన్ని పార్లమెంట్ ముందు వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్యానికి ముందు, ప్రేమ్‌చంద్ తన కథల్లో రైతుల పరిస్థితిని ఎలా వర్ణించారో, 70 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, 1995 నుంచి భారతదేశంలో 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 2016లోనే దేశవ్యాప్తంగా 11,370 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం పెరిగిపోతున్న వ్యవసాయ ఖర్చుల కోసం చేసిన అప్పులను తీర్చలేకపోవడం, పంట సరిగా పండకపోవడం, పంటలకు మద్దతు ధర లభించకపోవడం మొదలైనవి.
రైతుల పరిస్థితిపై బీబీసీ వరుస కథనాలు
అయితే వాస్తవం ఏమిటంటే, దేశానికి ఉన్న ఆశంతా రైతుల పైనే. అందుకే రైతులతో ప్రత్యేకంగా మాట్లాడడం ముఖ్యం. అప్పుడే వాళ్ల పిల్లల పళ్లెంలోంచి అన్నము, రొట్టెముక్క మాయం కావడానికి కారణాలేంటో తెలుస్తుంది.
దీనిలో భాగంగా బీబీసీ 'రైతుల ఆత్మహత్యలు', 'వ్యవసాయ సంక్షోభం'పై ఒక సిరీస్ ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా మా ప్రతినిధులు పంజాబ్, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు.
ఈ ప్రత్యేక సిరీస్ కోసం బీబీసీ ప్రతినిధులు రెండు నెలల పాటు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ రాష్ట్రాలలో సుమారు 5 వేల కిలోమీటర్లు పర్యటించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేశారు.
ఈ సిరీస్‌లో ఏం ఉంటాయి?
రాబోయే రోజుల్లో పంజాబ్‌లోని బర్నాలా జిల్లా, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలకు చెందిన రైతులు మా ప్రతినిధులకు చెప్పుకున్న సమస్యలను మీ ముందుంచుతాము.
అలాగే వాటి నుంచి వాళ్లు ఎలా బయట పడడానికి ప్రయత్నిస్తున్నదీ కూడా మీతో పంచుకుంటాం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)