గౌరీ లంకేశ్- డాభోల్కర్‌ల హత్య, నాలాసోపారా కేసుల్లో నిందితులు ఒకరికి ఒకరు ముందే తెలుసా?

    • రచయిత, మయూరేష్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్)‌లు అర డజనుకు పైగా యువకులను అరెస్టు చేశాయి. వాళ్లంతా గతంలో ఏదో ఒక దశలో అతివాద హిందుత్వ సంస్థలతో సంబంధాలున్నవారే.

అయితే, వాళ్లంతా ఏదో ఒక సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారా లేక ఏదైనా కొత్త వ్యవస్థ అభివృద్ధి చెందుతోందా? అనే ప్రశ్న అధికారులను అయోమయానికి గురిచేస్తోంది.

మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వేర్వేరు అభియోగాలపై అరెస్టయిన వీళ్లందరికీ అతివాద హిందుత్వ భావజాలం కాకుండా మరేదైనా సంబంధం ఉందేమోనన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల ముంబైలోని నాలాసోపరా ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో ఏటీఎస్ అధికారులు బాంబులతో పాటు తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైభవ్ రావుత్‌కు ముంబైలోని నాలాసోపరా ప్రాంతంలో బలమైన హిందుత్వ ఉద్యమకారుడిగా, గో రక్షకుడిగా పేరుంది. మూడేళ్ల క్రితం అతడు ‘హిందూ గోవంశ రక్షా సమితి’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ‘సనాతన్’, ‘హిందూ జన జాగృతి సమితి’, ‘శ్రీ రామ్ సేన’ లాంటి సంస్థల కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనేవాడు. ఈ సంస్థలన్నీ అతివాద ప్రచారం నేపథ్యంలో నిఘా నీడలో ఉన్నాయి.

వైభవ్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అతడి చిన్ననాటి స్నేహితుడు హర్షద్‌ రావుత్‌తో బీబీసీ మాట్లాడింది. ‘మొదట మేం అందరం మాంసాహారులమే. కానీ తరువాత వైభవ్ పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. జంతువులను చంపడమే తప్పుగా భావించే అతడు, మనుషుల్ని ఎలా చంపగలడు? వాలెంటైన్స్ డే ని అతడు తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకునేవాడు’ అని హర్షద్ చెప్పాడు.

మరో పక్క వైభవ్‌కు తమ సంస్థలతో ఏమాత్రం సంబంధం లేదని, అతడు తమ సభ్యుడు కాదని సనాతన్, హిందు జనజాగృతి సమితి సంస్థలు పేర్కొన్నాయి.

నాలాసోపరా పేలుడు పదార్థాల కేసులో ఏటీఎస్ అధికారులు శివసేనకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ పంగార్కర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారందరూ ప్లాన్ చేసిన దాడులకు ఆర్థిక సహాకారం అందిస్తున్నాడన్నది శ్రీకాంత్‌పై నమోదైన అభియోగం. 2001-2011 మధ్య శ్రీకాంత్ రెండు సార్లు జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

‘శ్రీకాంత్ తండ్రి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. కానీ శ్రీకాంత్‌ది మొదట్నుంచీ అతివాద హిందుత్వ భావజాలం. అందుకే అతడు శివసేనను ఎంచుకున్నాడు. రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైనా, 2011లో అతడికి టికెట్ ఇవ్వలేదు. తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టినా ఆమె గెలవలేదు’ అని శ్రీకాంత్ స్నేహితుడు, స్థానిక పాత్రికేయుడైన మహేష్ బుల్గే చెప్పారు.

బీజేపీకి చెందిన శ్రీకాంత్ సోదరుడు అశోక్ ప్రస్తుతం జాల్నా కార్పొరేటర్‌గా ఉన్నారు. శ్రీకాంత్ ఇప్పటికీ శివసేన తరఫునే పనిచేస్తున్నాడని ఆయన చెప్పారు. ‘హిందూ సంప్రదాయాల్ని పరిరక్షించడానికి అతడు కృషి చేస్తున్నాడు. ఎవరైనా హిందు యువతి వేరే మతస్థుడిని పెళ్లి చేసుకుంటే, దాన్ని అడ్డుకొని వెనక్కు తీసుకొచ్చేవాడు. రక్తదాన శిబిరాలను నిర్వహించేవాడు. అతనెప్పుడూ రాజకీయాలకు దూరం కాలేదు’ అని అశోక్ తెలిపారు.

నాలాసోపారా కేసులో అరెస్టయిన మరో వ్యక్తి సుధనా గోండ్లేకర్. శంభాజీ భిడే స్థాపించిన ‘శివ్ ప్రతిష్ఠాన్’ అనే హిందుత్వ సంస్థలో సుధనా గతంలో సభ్యుడిగా ఉండేవాడు. భీమా కోరెగావ్ హింస కేసులో శంభాజీ భిడే పేరు కూడా బయటికొచ్చింది. ‘శివ్ ప్రతిష్ఠాన్’ సంస్థ మాత్రం సుధనాతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.

‘3-4ఏళ్ల క్రితం వరకు అతడు మా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తరువాత ఉన్నట్టుండి అతడు సంస్థకు దూరమయ్యాడు. ఆపైన అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటాన్ని మేం నమ్మలేం’ అని శివ్ ప్రతిష్ఠాన్ ప్రతినిధి నితిన్ షాగులే చెప్పారు.

‘శివ్ ప్రతిష్ఠాన్ తరఫున పనిచేసిన సుధనా, శివసేన తరఫున కార్పొరేటర్‌గా పనిచేసిన శ్రీకాంత్, సనాతన్ సంస్థ తరఫున పనిచేసిన వైభవ్... ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో ఉన్నారని విచారణా సంస్థలు చెబుతున్నాయి. కానీ వాళ్లు ఏదైనా సంస్థ తరఫున పనిచేస్తున్నారా లేక సొంతంగా వాళ్లే ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

దీనికి తోడు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి సచిన్ అండురేకు తుపాకీ సమకూర్చాడన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్. నరేంద్ర డాభోల్కర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తే ఈ సచిన్ అండూరే. నాలాసోపరా కేసు విచారణలో సచిన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అతడు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ఈ లెక్కన గౌరీ లంకేశ్, డాభోల్కర్‌ల హత్య కేసులో నిందితులు ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారంటే... అసలు వాళ్లు ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారనే ప్రశ్న అధికారులను తొలిచేస్తోంది.

ఈ విషయంపై సచిన్ తరఫు న్యాయవాది ప్రకాష్ సల్సింగికర్‌తో బీబీసీ మాట్లాడింది. ‘సచిన్‌ను ఏడు రోజులపాటు విచారణ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆధారం దొరకలేదు. అందుకే మీడియా దృష్టిని మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఏటీఎస్ అదుపులో ఉన్న శరద్ కాలస్కర్‌ను తమ కస్టడీలోకి తీసుకుంటామని సీబీఐ కోర్టును కోరింది. నాలాసోపరా కేసులో అరెస్టయిన శరద్‌కు, డాభోల్కర్ హత్య కేసులో కూడా భాగముందని అధికారులు విశ్వసిస్తున్నారు.

డాభోల్కర్, గౌరీ లంకేశ్‌ల హత్య, నాలాసోపరా కేసులో నిందితులంతా మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతానికి చెందినవారు. ఒక వేళ వీళ్లకు ఒకరికి ఒకరు ముందే తెలుసనుకుంటే ఆ పరిచయం ఎక్కడ, ఎలా మొదలైందన్న ప్రశ్న మళ్లీ తెరమీదకు వస్తోంది.

‘వీళ్లు ఏ సంస్థకు చెందినవారు అనేది ముఖ్యం కాదు. వీళ్ల ఆలోచని ఏంటి?, భావజాలం ఏంటి? వీళ్లంతా కలిసే కుట్రపన్నారా? లాంటి ప్రశ్నలకు ముందుగా సమాధానం వెతకాలి. అవి తెలిసే వరకు వీరి వెనక ఎవరు ఉన్నారనేది చెప్పలేం. ఆ విషయాన్ని తేల్చడానికి విచారణ సంస్థలకు ఇంకొంత సమయం ఇవ్వాలి’ అని మహారాష్ట్ర మాజీ డీజీపీ జయంత్ ఉమ్రానికర్ అన్నారు.

ఈ నిందితులంతా హిందుత్వ భావజాల నేపథ్యం ఉన్నవారే. కాబట్టి హిందుత్వ సంస్థలు వీళ్లెవరో తమకు తెలీదనడంలో అర్థం లేదు అని సీనియర్ పాత్రికేయులు ప్రకాష్ బాల్ చెప్పారు.

‘మహాత్మా గాంధీ హత్య తరువాత నుంచి గాడ్సేతో తమకు సంబంధం లేదని ఆరెస్సెస్ చెబుతోంది. అలాంటి వ్యాఖ్యలు తమ ప్రణాళికలో భాగమే. ఈ కేసుల్లో కూడా నిందితులతో సంబంధం లేదని చెప్పడం కూడా అలాంటి ప్రణాళికే. వీళ్లంతా వేర్వేరు సంస్థల నేపథ్యం ఉన్నవాళ్లు కావచ్చు. కానీ అందరిదీ హిందుత్వ నేపథ్యమే’ అని ప్రకాష్ అన్నారు. గత కొన్నేళ్లుగా దేశ పరిస్థితులను గమనిస్తే ఈ హిందుత్వ సంస్థలు విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనే విషయం అర్థమవుతుందని ఆయన చెప్పారు.

ఈ అంశంపై మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ అతుల్ చంద్ర కులకర్ణితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ కేసు విచారణలో ఉన్నందున దీని గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)