You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
‘నాకు 15ఏళ్ల వయసప్పుడు నా జుట్టు తెల్లబడటం మొదలైంది. దానివల్ల నాకూ, మా నాన్నకూ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కానీ మా అమ్మ మాత్రం నా జుట్టు చూసి చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. కాల్షియం సప్లిమెంట్లు తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారు. కానీ జుట్టు తెల్లబడటం ఆగలేదు. ఇది దాదాపు 15ఏళ్ల కిందటి మాట.’
చండీగఢ్‌కు చెందిన వర్ణిక అనే యువతి చెప్పిన విషయమిది.
ఇప్పుడు వర్ణిక జుట్టు సగం తెల్లగా, సగం నల్లగా ఉంటుంది. మొదటిసారి చూడగానే స్టైల్ కోసమే ఆమె పార్లర్‌కు వెళ్లి అలా రంగు వేయించుకున్నట్లు కనిపిస్తుంది. కానీ సహజంగానే ఆమె జుట్టు తెల్లబడింది. ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఈ మధ్య మామూలైపోయింది.
గూగుల్ ట్రెండ్స్‌ని గమనించినా గత పదేళ్లలో తెల్ల జుట్టు గురించి వెతికే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
20 ఏళ్ల సత్యభాన్ కూడా గూగుల్‌లో ఈ అంశం గురించి వెతికే వాళ్లలో ఒకరు. టీనేజీలోనే అతడి జుట్టు కూడా తెల్లబడింది. ‘తెల్ల వెంట్రుకల్ని చూడగానే ఇబ్బందిగా అనిపించింది. వెంటనే గూగుల్‌లో దానికి పరిష్కారం వెతకడం మొదలుపెట్టా. మా నాన్న కార్డియాలజిస్ట్. ఆయన సలహాపై వైద్యుడి దగ్గరకు వెళ్లా. నా ఆహార అలవాట్లతో పాటు రకరకాల హెయిర్ ప్రొడక్ట్‌లను వాడటం కూడా జుట్టు తెల్లబడటానికి కారణమని తెలిసింది’ అని సత్యభాన్ చెప్పారు.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఓ జబ్బు అని డాక్టర్ దీపాలీ భరద్వాజ్ చెబుతున్నారు. వైద్య పరిభాషలో దాని పేరు కెనాయిటిస్.
ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో 2016లో ప్రచురించిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం భారత్‌లో సగటున 20 ఏళ్ల వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలవుతోంది. 20 ఏళ్లు, లేదా అంత కంటే ముందు జుట్టు తెల్లబడితే దాన్ని కెనాయిటిస్‌గానే గుర్తించాలి.
కెనాయిటిస్ సమస్య ఉన్న వాళ్లలో జుట్టుకి రంగుని కల్పించే పిగ్మెంట్ కణాలలో సమస్య నెలకొంటుంది. అందువల్లే జుట్టు తెల్లరంగులోకి మారుతుందని దిల్లీకి చెందిన ట్రైకాలజిస్ట్ డా.అమరేంద్ర కుమార్ చెబుతున్నారు.
ఈ సమస్య వెనక చాలా కారణాలుంటాయి. జన్యుపరమైన సమస్యలతో పాటు, ఆహారంలో ప్రొటీన్, కాపర్ లోపం, హార్మోన్లలో అసమతుల్యత లాంటివీ ఈ పరిణామానికి దారితీయొచ్చు. హెమోగ్లోబిన్ లోపం, ఎనీమియా, థైరాయిడ్ సమస్యల కారణంగా కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉంది.
వర్ణికనే తీసుకుంటే ఆమెకు జన్యుపరమైన కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడింది. ‘మా నాన్నకు కూడా చిన్న వయసులోనే వెంట్రుకలు నెరిశాయి. మా చెల్లికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. మా కుటుంబంలో ఈ సమస్య వంశ పారంపర్యంగా వస్తోందని వైద్యుల వల్ల తెలిసింది’ అని చెబుతున్నారామె.
ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులో జుట్టు తెల్లబడటం అన్నది పెద్ద సమస్యే. దీనిపైన అనేక పరిశోధనలు జరిగాయి.
‘పుట్టుకతో సంక్రమించే జన్యువులే మనిషి రంగు, రూపు లాంటి చాలా అంశాలను నిర్ణయిస్తాయి. మనుషుల జాతి, ప్రాంతాన్ని బట్టి కూడా జుట్టు రంగు మారే వయసులో తేడాలుంటాయి’ అని బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టోబిన్ అంటున్నారు. అయినా ఈ అంశం పైన చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు.
భారత్‌లో 40 ఏళ్లు దాటిన వాళ్లలో జుట్టు తెల్లబడితే దాన్ని జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.
చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా స్వీకరిస్తారు. కొంతమంది తమ సమస్యను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు మాత్రం దాన్నే తమ స్టయిల్ స్టేట్‌మెంట్‌గా భావించి జుట్టును అలానే రంగు వేయకుండా వదిలేస్తారు.
సత్యభాన్ 20 ఏళ్ల వయసు నుంచే తన జుట్టుకు రంగు వేయడం మొదలుపెట్టాడు. కానీ దాని వల్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారమే దొరుకుతుందనీ, ఆపైన జుట్టుకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందనీ డాక్టర్ దీపాలీ అంటున్నారు.
కానీ వర్ణిక మాత్రం తన సమస్యను మొదటి రోజు నుంచే చాలా సింపుల్‌గా తీసుకున్నారు. ఆ తెల్ల జుట్టునే ఆమె తన స్టయిల్ స్టేట్‌మెంట్‌గా మార్చుకున్నారు.
‘కొందరు నన్ను చూసి కావాలనే జుట్టుకు రంగు వేసుకున్నానని అనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. ఇంకొందరైతే నాలాంటి జుట్టే కావాలని కోరుకుంటారు. అది సహజంగా వచ్చిందని చెబితే నమ్మరు’ అని వర్ణిక చెబుతారు.
‘చాలాసార్లు నన్ను పెద్ద వయసు మహిళగా భావించి మాట్లాడతారు. కానీ నా వయసు తక్కువే అని తెలిసి కొందరు సారీ చెబుతారు. నేను వాళ్ల మాటల్ని పెద్దగా పట్టించుకోను. ఎవరి కోసమో నా జుట్టును మార్చుకోను’ అంటారామె.
అందరూ వర్ణికలా ఉండలేరు. కొందరు ఈ సమస్య కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచంలో 5-10శాతం మంది కెనాయిటిస్ బారిన పడి ఉంటారని డాక్టర్.అమరేంద్ర అంచనా.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
‘కెనాయిటిస్ నుంచి బయటపడటం అంత సులువేం కాదు. ఒక్కసారి జుట్టు తెల్లబడటం మొదలుపెడితే, మిగతా వెంట్రుకలు తెల్లగా మారకుండా ఆపడం కూడా చాలా కష్టం. మార్కెట్లో కెనాయిటిస్ కోసం మందులు, షాంపూల్లాంటివి అందుబాటులో ఉంటాయి. కానీ వీటి వల్ల సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు 20-30శాతం మాత్రమే’ అని డాక్టర్ అమరేంద్ర అంటున్నారు.
చిన్న వయసు నుంచే ఆహారంపైన దృష్టి పడితే ఈ సమస్యను చాలావరకూ నివారించే అవకాశం ఉందని డాక్టర్.దీపాలీ చెబుతున్నారు.
‘ఆహారంలో బయోటిన్ (ఒక రకమైన విటమిన్) ఉండేలా చూసుకోవాలి. జుట్టుపైన ఎలాంటి రసాయనాలనూ ప్రయోగించకూడదు. రసాయనాలతో నిండిన యాంటీ డ్యాండ్రఫ్ షాంపూలను వారంలో రెండు సార్లకు మించి వాడకపోవడం మంచిది’ అని ఆమె సూచిస్తున్నారు. తలకు నూనె పెట్టినంత మాత్రాన ఈ సమస్య దూరం కాదని కూడా ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం: ఎడిటర్స్ కామెంట్
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)