హాన్సీ క్రోనే: సచిన్‌ తెందూల్కర్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే

    • రచయిత, దినేశ్ ఉప్రేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మేం క్రికెట్ మ్యాచ్‌లు ఆడడానికి ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాం. ఒకసారి బస్సులో వెళ్తే, ఇంకోసారి విమానంలో వెళ్తాం. ఎప్పుడో నేను విమానం కూలి చనిపోతానని, అలా స్వర్గానికి వెళ్తానని నాకు అనిపిస్తోంది..."

ఈ మాటలు మ్యాచ్ ఫిక్సింగ్ మచ్చ పడ్డ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనే తన మరణానికి కొన్నేళ్ల ముందు తన అన్నయ్య ఫ్రాన్స్‌తో అన్నాడు.

2012, మేలో బీబీసీ-5కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫ్రాన్స్ "క్రోనే తన మరణాన్ని దశాబ్దం ముందే చూశాడు" అని చెప్పారు.

"ఒక కారు ప్రమాదం తర్వాత క్రోనేకు మతం, దేవుడిపై నమ్మకం చాలా పెరిగింది. తను వెళ్తున్న కారు ఢీకొని ఒక చిన్న పాప చనిపోయింది. దాంతో తనలో చాలా మార్పు వచ్చింది" అని ఫ్రాన్స్ తెలిపారు.

2002, జూన్ 1న క్రోనే భవిష్యవాణి నిజమయ్యింది. ఆ రోజు జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఈ క్రికెటర్ మరణించాడు.

"అదృశ్య శక్తి ఆ పని చేసింది"

"తెలుసుకోవాలనే ఆసక్తి క్రోనే జీవితంలో ఒక ముఖ్యమైన, ప్రమాదకరమైన భాగమైంది" అని ఫ్రాన్స్ చెప్పారు. "ఏళ్లకు ఏళ్లు క్రికెట్ ఆడుతూ, హోటళ్లు, విమానాశ్రయాలు తిరుగుతూ వచ్చిన హాన్సీ క్రోనే చాలా అలసిపోయాడు, బోర్ అయిపోయాడు."

"ఆ విరక్తిలోనే తను దానికి (ఫిక్సింగ్) ఆసక్తి చూపించి ఉంటాడు" అని ఆయన అన్నారు.

1996లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు క్రోనే జీవితంపై విరక్తి చెంది ఉన్నాడు అనడానికి ఏ ఆధారాలూ లేవు. అయితే, మొదట్లో తనకేం తెలీదు అని చెప్పిన క్రోనే, 2000లో కింగ్ కమిషన్ ముందు తన తప్పు అంగీకరించాడు.

"మూడో టెస్టులో భారత్ గెలుపు ఖాయం చేయడానికి, ఆఖరి రోజున తన టీమ్ వికెట్లు కోల్పోతే, 30 వేల డాలర్లు ఇస్తామన్నారు" అని క్రోనే చెప్పాడు.

తర్వాత ఫిక్సింగ్ అసలు గుట్టు బయటపడింది. ఆ ఉచ్చులో హార్షల్ గిబ్స్, నికీ బోయెతో పాటు మరికొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నట్టు తేలింది. కానీ క్రోనేపై మాత్రమే జీవితకాల నిషేధం విధించారు.

విచారణలో నిజం ఒప్పుకున్న క్రోనే ఏదో "అదృశ్య శక్తి" తనతో ఆ పని చేయించింది అని చెప్పాడు.

ఆ తర్వాత, చూస్తుండగానే దక్షిణాఫ్రికా "గోల్డెన్ బాయ్" విజయ తీరాల నుంచి పాతాళానికి పడిపోయాడు. కానీ 90వ దశకంలో క్రోనే దక్షిణాఫ్రికాలో చాలా పాపులర్ వ్యక్తిగా నిలిచాడు. అప్పటి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా తర్వాత అంతటి పేరు సంపాదించాడంటే అతిశయోక్తి కాదు.

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత జీవితకాల నిషేధం ఎదుర్కున్న క్రోనే, ఆ తర్వాత 2004లో జరిగిన ఒక సర్వేలో దక్షిణాఫ్రికాలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఏకంగా 11వ స్థానానికి దిగజారాడు.

క్రోనే అద్భుతమైన ఆల్ రౌండర్‌, మంచి కెప్టెన్ కూడా. మ్యాచ్ ఫిక్సింగ్ మచ్చ పడకుండా ఉండుంటే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్స్‌లో క్రోనే కూడా ఒకరు అయ్యేవాడు.

కెప్టెన్‌గా క్రోనేకు మంచి రికార్డ్ ఉంది. దక్షిణాఫ్రికా మొత్తం 68 టెస్టులు ఆడితే, వాటిలో 53 టెస్టులకు క్రోనే కెప్టెన్‌గా ఉన్నాడు. వాటిలో 27 టెస్టుల్లో జట్టుకు విజయం అందించాడు. తన నేతృత్వంలో ఆ జట్టు 11 టెస్టుల్లో ఓటమి పాలైంది.

138 వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న క్రోనే 98 వన్డేల్లో జట్టును గెలిపించాడు.

అంతేకాదు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌ను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ భయపెట్టిన బౌలర్ హాన్సీ క్రోనే. సచిన్ స్వయంగా ఆ విషయం చెప్పారు. క్రోనే బౌలింగ్ చేస్తుంటే ఎలా కొట్టాలో అర్థం కాలేదని ఆన్నారు.

"ద గార్డియన్‌"కు ఇంటర్వ్యూ ఇచ్చిన సచిన్ ‌"నిజం చెప్పాలంటే హాన్సీ నన్ను మిగతా బౌలర్ల కంటే ఎక్కువే భయపెట్టాడు. మేం దక్షిణాఫ్రికాతో ఎప్పుడు ఆడినా నన్ను అవుట్ చేయడంలో తను అలన్ డొనాల్డ్, షాన్ పొలాక్‌ను మించి పోయేవాడు" అని చెప్పాడు.

"అంటే, క్రోనే బౌలింగ్ నాకు అర్థం కాలేదని కాదు, కానీ ఎందుకో తెలీదు, షాట్ కొడితే, బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోనే పడేది."

డర్బన్ మ్యాచ్ గుర్తు చేసుకున్న సచిన్, "ఆ మ్యాచ్‌లో డొనాల్డ్, పొలాక్ బౌలింగ్‌లో నేను అద్భుతమైన షాట్స్ ఆడాను. అప్పుడే బౌలింగ్ మారింది. హాన్సీ క్రోనే బౌలింగ్‌కు దిగాడు. తన మొదటి బంతిని ఫ్లిక్ చేశా, అది నేరుగా స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడింది" అని చెప్పాడు.

క్రికెట్ విషాదం క్రోనే

వెసెల్ జొహనెస్ క్రోనే 1969 సెప్టంబర్ 25న దక్షిణాఫ్రికాలోని బ్లోమ్‌ఫౌంటెన్ జన్మించాడు.

1991లో మొదటి సారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడే హాన్సీ క్రోనే ఎప్పుడో ఒకప్పుడు దక్షిణాఫ్రికా కెప్టెన్ అవుతాడని అన్నారు.

అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో క్రోనే విజయాల సగటు మిగతా కెప్టెన్స్ అందరి కంటే ఎక్కువ.

హాన్సీ క్రోనే క్రీడా జీవితం మ్యాచ్ ఫిక్సింగ్‌తో అర్ధంతరంగా ముగుస్తుందని, ఆ తర్వాత ఘోర విమాన ప్రమాదంలో ఆయన అకాల మరణం పాలవుతారని ఆయన ఆటను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులెవరూ ఊహించలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)