రఘురామ్ 'రాక్‌స్టార్' రాజన్ మళ్లీ ఎందుకు ట్రెండింగ్‌లోకి వచ్చారు?

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే చికాగో యూనివర్సిటీలోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి, మళ్లీ భారత్‌కు వస్తున్నారని కాదు.

బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, రాజన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ రేసులో ఉన్నారు.

ఆ బ్యాంక్ ప్రస్తుత గవర్నర్ మైక్ కార్నీ పదవీకాలం 2019తో ముగుస్తోంది. దీంతో ఆయన వారసుని కోసం అప్పుడే అన్వేషణ ప్రారంభమైంది.

ఆ వార్తాపత్రిక కథనం ప్రకారం మొత్తం ఆరుగురు ఈ రేసులో ఉన్నారు. వారిలో రాజన్‌తో పాటు భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ శృతి వదేరా కూడా ఉన్నారు.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు

55 ఏళ్ల రఘురామ్ రాజన్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. దిల్లీ ఐఐటీ విద్యార్థి అయిన రాజన్, అహ్మదాబాద్‌లోని ఐఐఎమ్‌లో, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా అభ్యసించారు.

2013లో ఆయన భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

దానికి మునుపు ఆయన చికాగో యూనివర్సిటీలోని బూత్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పేవారు. ఆర్‌బీఐ గవర్నర్‌ పదవీకాలం ముగిశాక ఆయన తిరిగి తన పాత అధ్యాపక వృత్తికి వెళ్లిపోయారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించాక రాజన్ భారతదేశంలోకి బంగారు దిగుమతిని నియంత్రించారు. ఆయన కాలంలోనే బ్యాంకుల ఎన్‌పీఏలు తగ్గి, రూపాయి బలోపేతమైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 100 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కాక మునుపు ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ సలహాదారుగా కూడా పని చేశారు.

పదవిలో కొనసాగడంపై ప్రభుత్వంతో చర్చించాక.. ఆయన తాను రెండోసారి పదవిని చేపట్టబోనని తెలిపారు.

ముందే ఊహించారు..

2008 ఆర్థిక మాంద్యాన్ని ఊహించిన వారిలో రఘురామ్ రాజన్ ఒకరు.

ప్రస్తుతం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పేరు పొందడానికి ఆయన తీసుకున్న చర్యలే కారణమని రఘురామ్ రాజన్‌ను కీర్తిస్తారు.

ఫైనాన్షియల్ టైమ్స్‌లో వచ్చిన వార్తపై రఘురామ్ రాజన్ ఇప్పటివరకు ప్రతిస్పందించలేదు.

కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ భారీ ఆర్థిక మార్పులకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్ పదవి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)