You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగు రాష్ర్టాల్లో ‘నో క్యాష్’ .. ఎందుకో తెలుసా!?
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఎండ తాపానికి ఒక గ్లాస్ చెరుకు రసమో, మజ్జిగో తాగుదామన్నా జేబులో డబ్బు లేదు. ఉదయం నుంచి 15 ఏటీఎంలు తిరిగాను. సిటీలో తిరిగేటప్పుడు ఏదైనా తోపుడు బండి దగ్గర ఆగి కొనుక్కోవటం సులభం. ఇప్పుడు తప్పనిసరిగా కార్డు తీసుకునే షాపులకి వెళ్లి కొనుక్కో వలిసిన పరిస్థితి" అని వాపోయారు హైదరాబాద్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న హర్ష.
ఇది కేవలం హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు తెలంగాణలో 50 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెద్ద బ్యాంకుల ఏటీఎంలలో 25 శాతం పని చేయటంలేదు.
కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే నగదు కొరత సమస్య కొనసాగనుంది అని అంటున్నారు అల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (AIBEA) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు.
ఈ నగదు కొరత అన్నది నోట్ల రద్దు ఫలితంగా క్రమేణా ఆవిర్భవించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు.
‘క్యాష్ దొరుకుతుందో లేదోనని ప్రజలు నిల్వ చేసుకుంటున్నారు’
"భారతదేశం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. నోట్ల రద్దు తరువాత ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి చక్కబడ్డాక కూడా ప్రజలు క్యాష్ దగ్గర పెట్టుకోవాటానికే ఇష్టపడుతున్నారు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. అవసరానికి క్యాష్ వస్తుందా రాదా అన్న భయంతో ముందే క్యాష్ నిల్వ పెట్టుకుంటున్నారు. రెండు వేల రూపాయల వంటి పెద్ద విలువ నోటు ఉండటంతో ఇలా నిల్వచేసుకోవటం సులభం అవుతోంది" అని వివరించారు రాంబాబు.
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా నివేదిక ప్రకారం నోట్ల రద్దు ముందు, దేశంలో రూ. 17.97 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంది. అందులో, రూ. 500 నోట్లు, రూ. 1,000 నోట్ల విలువే రూ. 15.44 లక్షల కోట్లు. వీటిని రద్దు చేసిన ఆర్బీఐ కొత్తగా రూ.2000, రూ.500, రూ.200, రూ.50 నోట్లను చెలామణిలోకి తెచ్చింది.
2017 జూన్ నాటికి చెల్లని రూ. 500, రూ. 1,000 నోట్లు రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి ఆర్‌బీఐలో జమయినాయి. 2016 నవంబర్ నుండి 2017 మార్చి వరకు రూ. 82,168 కోట్లు హైదరాబాద్‌లోని ఆర్‌బీఐకి తరలించినట్టు ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. దేశంలోనే ఎక్కువ మొత్తంలో నగదు పంపింది ఇక్కడికేనని కూడా పేర్కొంది.
‘నగదు సర్క్యులేషన్ లేకపోవటం కొరతకు కారణం’
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకారం.. రాష్ట్రంలో పెద్ద బ్యాంకుల ఏటీఎంలు 6,385 ఉన్నాయి. అందులో 1,523 పనిచేయడం లేదని.. వాటిలోనూ 842 ఏటీఎంలు నగదు లేక పనిచేయడం లేదని తెలిపింది.
పని చేయని ఏటీఎంల సంఖ్య కేవలం పెద్ద బ్యాంకులది మాత్రమేనని ఎస్‌ఎల్‌బీసీ రాష్ట్ర కన్వీనర్ శివవరప్రసాద్ తెలిపారు. నగదు సర్క్యులేషన్ లేకపోవటం నగదు కొరత సమస్యకు గల కారణాలలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
"రెండు వేల రూపాయల నోట్లు ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలో చెలామణి అవుతున్నాయి. మేం చూసిన దాన్నిబట్టి.. నెలవారీ జీతాల మీద ఆధారపడే వారు చాలా మంది జీతం బ్యాంకుల్లో డిపాజిట్ కాగానే మొత్తం విత్‌డ్రా చేసుకుంటున్నారు. అవసరానికి క్యాష్ వస్తుందో రాదో అన్న భయంతో అలా చేస్తున్నారు" అని శివవరప్రసాద్ వివరించారు.
2018 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లు కోరుతూ రాసిన లేఖకు సమాధానంగా.. ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ హైదరాబాద్‌లోని తన శాఖకు పంపించినట్లు పార్లమెంటులో ఆర్థికశాఖ తెలిపింది.
‘స్కాములు చూసి ప్రజలకు నమ్మకం పోతోంది’
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారుల సమాచారం మేరకు.. నోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో ఉన్న బ్యాంకులకు 2018 మార్చి నాటికి రూ. 73,642 కోట్లు వచ్చాయి. రాష్ట్రంలోని 8,500 ఏటీఎంలలో 50 శాతం పని చేయడం లేదని సమాచారం. రాష్ట్ర ఆర్థికమంత్రి నగదు కోరుతూ ఆర్‌బీఐకి ఫిబ్రవరిలో లేఖ రాశారు.
"నేను ఆర్‌బీఐ గవర్నర్‌కి లేఖ రాశాను. రాష్ట్రం పెట్టబోయే 'రైతు బంధు' పథకానికి కాను రూ. 6,000 కోట్ల అవసరముందని తెలిపాం. సానుకూలంగా స్పందించారు" అని మంత్రి తెలిపారు. రైతు బంధు పథకం కింద, రైతులకు ముందుగా డబ్బు ఇచ్చి ఆదుకునేందుకు చెక్కు రూపంలో డబ్బు అందజేస్తారు.
ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని మంత్రి ఈటల రాజేందర్ తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. "బ్యాంకుల్లో డబ్బు లేదు. ప్రజలు నిల్వ చేస్తున్నారు. డబ్బు తీసుకున్నోళ్లు మళ్లీ బ్యాంకుల్లో జమ చేయటం లేదు. జరుగుతున్న స్కాములు చూసి ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతోందేమో అనిపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
ఆందోళన రేకెత్తిస్తున్న ‘బెయిల్ ఇన్ క్లాజ్’...
ఇదే అంశానికి సంబంధించి బి.ఎస్.రాంబాబు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 2017 జూన్‌లో ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లును ప్రతిపాదించారు. ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న ఈ బిల్లులో ఒక 'బెయిల్ ఇన్ క్లాజ్' ఉంది. అది.. బ్యాంకు కానీ ఆర్థిక సంస్థ కానీ అవసరం అయితే డిపాజిటర్ల డబ్బుని వాడుకోవచ్చనే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన వల్ల ప్రజల్లో అనవసరమైన అపోహలు భయాలు నెలకొన్నాయని రాంబాబు పేర్కొన్నారు.
ఈ భయాలకు కారణం లేకపోలేదు. 65 ఏళ్ల సరస్వతి భర్తను కోల్పోయాక బ్యాంకు పనులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బ్యాంకు నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ విత్‌డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్ళారు. "నేను, నా భర్త కాస్త డబ్బు పోగేశాము. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెడితే భద్రంగా ఉంటాయంటే పెట్టాను. ఇప్పుడు నాకు తెలియకుండానే నా డబ్బును బ్యాంకులు తీసుకోవచ్చని చెప్తున్నారు. మరి బ్యాంకులో పెడితే ఏమవుతుందో తెలియక హైరానా పడేకంటే.. ఇంటికి తీసుకెళ్లి డబ్బు దగ్గర పెట్టుకోవటం మేలేమో" అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘ఆర్‌బీఐ సరిపడా నగదు సరఫరా చేయటం లేదు‘
అయితే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న డిపాజిటర్ల డబ్బు భద్రంగానే ఉంటాయని హామీ ఇచ్చారు. "ప్రభుత్వం ప్రజల డబ్బును రక్షించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన అవసరం లేదు" అని పేర్కొన్నారు.
ప్రజలు తీసుకున్న డబ్బును మళ్లీ బ్యాంకుల్లో వేయకపోతే డబ్బు సర్దుబాటు చేయటం కష్టమని ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ శివవరప్రసాద్ చెప్పారు.
అయితే.. నగదు కొరతకు ఆర్‌బీఐ కూడా కారణమేనని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. "ఏదైనా కొరత ఉంటే దాన్ని ముందుగానే నిల్వ చేసుకోవాలి అన్న ఆలోచన సహజమే. ఆర్‌బీఐ కూడా సరిపడా నగదు చెలామణి చేయటం లేదు. కాబట్టి ఈ సమస్య తలెత్తిందని కూడా చెప్పొచ్చు" అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)