శ్రీదేవి చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగింది? బోనీ కపూర్ ఏం చెప్పారు?

ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి జరిగిన సంఘటనలకు సంబంధించిన కొన్ని వివరాలను శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన స్నేహితుడు కోమల్ నాహ్తాతో పంచుకున్నారు.

దుబాయ్‌లో ఉన్న తన భార్య శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయటానికి తాను అకస్మాత్తుగా ఎలా వెళ్లిందీ, తామిద్దరమూ ఎలా ఆలింగనం చేసుకుందీ, రెండు గంటల తర్వాత నిండా నీళ్లున్న బాత్‌టబ్‌లో శ్రీదేవి పడివుండటాన్ని తాను ఎలా చూసిందీ వివరాలను.. ముప్పై ఏళ్లుగా తన స్నేహితుడైన కోమల్ నాహ్తాకు బోనీ చెప్పారు.

ప్రఖ్యాత నటి శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి దుబాయ్‌లోని ఒక హోటల్ రూంలో బాత్‌టబ్‌లోని నీటిలో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఘటనల క్రమంపై బోనీ తనకు వివరించిన విషయాలను.. వాణిజ్య విశ్లేషకుడైన కోమల్ నాహ్తా తన బ్లాగ్‌లో ప్రచురించి ట్విటర్‌లో షేర్ చేశారు.

విదేశాలకు తమ భార్యాభర్తలిద్దరం కలిసి వెళ్లకపోవటం 24 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే జరిగిందని నాహ్తాతో బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి సినిమాలకు సంబంధించిన పని మీద ఒకసారి న్యూజెర్సీకి, మరొకసారి వాంకోవర్‌కు వెళ్లారు. ''ఆ రెండు పర్యటనలప్పుడూ నేను ఆమె వెంట లేను. కానీ నా స్నేహితిడి భార్య ఆమెకు తోడుగా ఉండేలా చూసుకున్నాను. శ్రీదేవి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 22, 23 తేదీలు) ఓ విదేశంలో ఒంటరిగా ఉన్నది దుబాయ్‌లో మాత్రమే'' అని బోనీ తన స్నేహితుడితో చెప్పారు.

బోనీ, శ్రీదేవి, వారి కుమార్తె ఖుషీ.. ముగ్గురూ తమ బంధువు వివాహ వేడుకలో పాల్గొనటానికి దుబాయ్ వెళ్లారు. అక్కడికి సమీపంలోని రాస్-అల్-ఖైమాలో ఆ పెళ్లి వేడుక ఫిబ్రవరి 20వ తేదీన ముగిసింది. బోనీ తనకు 22వ తేదీన లక్నోలో 'ఒక ముఖ్యమైన సమావేశం' ఉండటంతో ఇండియాకు తిరిగి వచ్చారు. శ్రీదేవి తమ మరో కుమార్తె జాహ్నవి కోసం షాపింగ్ చేయటానికి దుబాయ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని కోమల్‌తో బోనీ పేర్కొన్నారు.

''జాహ్నవి షాపింగ్ లిస్ట్ శ్రీదేవి ఫోన్‌లో ఉంది. ఆమె ఫిబ్రవరి 21వ తేదీనే షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తన ఫోన్‌ను రాస్-అల్-ఖైమాలో మరచిపోవటం వల్ల ఆ రోజు షాపింగ్ చేయలేకపోయారు. దీంతో శ్రీదేవి ఆ రోజంతా హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన కూడా ఆమె తన ఫ్రెండ్‌తో ముచ్చటిస్తూ హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ గడిపారు'' అని బోనీ వివరించారు. దీంతో ఆమె ఇండియాకు తిరిగి రావాల్సిన ప్రయాణం షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చిందన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన కూడా శ్రీదేవి బద్ధకంగా గడపటంతో ఆమె ఇండియా ప్రయాణం టికెట్‌ను ఆమె భర్త బోనీ మార్చాల్సివచ్చినట్లు చెప్పారని కోమల్ రాశారు.

''24వ తేదీ ఉదయం నేను ఆమెతో మాట్లాడాను. 'ఐ యామ్ మిసింగ్ యు' అని ఆమె నాతో అన్నది. నేను కూడా ఆమెను చాలా మిస్ అవుతున్నానని చెప్పాను. కానీ ఆ రోజు సాయంత్రం దుబాయ్‌లో ఆమె దగ్గరకు రాబోతున్నానని నేను చెప్పలేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండని శ్రీదేవి ఇప్పుడు ఒంటరిగా ఉందని, ఆమె తన పాస్‌పోర్టునో, ముఖ్యమైన పేపర్లనో పోగొట్టుకుంటుందేమోనని జాహ్నవి ఆందోళన చెందుతోంది. దీంతో నేను దుబాయ్ వెళ్లే ఆలోచనకి ఆమె సపోర్ట్ చేసింది'' అంటూ బోనీ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నట్లు కోమల్ పేర్కొన్నారు.

జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో రూమ్‌కు వెళ్లి శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయాలని బోనీ అనుకున్నారని కోమల్ రాశారు. 'బోనీ 24వ తేదీ సాయంత్రం 6:20 గంటలకు (దుబాయ్ సమయం) ఆయన హోటల్ వద్దకు చేరుకున్నారు. హోటల్‌లో శ్రీదేవి గదికి డూప్లికేట్ తాళం తీసుకోవటానికి కావలసిన లాంఛనాలు పూర్తిచేసిన బోనీ.. శ్రీదేవిని పూర్తిగా సర్‌ప్రైజ్ చేయాలన్నది తాను కోరుకుంటున్నాడు కాబట్టి తన లగేజీని గదికి కొంత ఆలస్యంగా తీసుకురావాలని రూమ్ బాయ్‌కి చెప్పారు' అని కోమల్ పేర్కొన్నారు.

కోమల్ రాసిన దానిప్రకారం.. బోనీ తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో రూమ్ తలుపు తెరిచిన తర్వాత వారిద్దరూ ''టీనేజీ ప్రేమికుల్లాగా ఆలింగనం చేసుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు''. ''కానీ.. తనను తీసుకెళ్లటానికి నేను దుబాయ్ వస్తానని తనకు తెలుసని ఆమె నాతో చెప్పింది'' అని బోనీ కన్నీళ్లతో చెప్పినట్లు కోమల్ పేర్కొన్నారు. తామిద్దరం అలా దాదాపు అరగంట సేపు ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపామని ఆయన తెలిపినట్లు రాశారు.

బోనీ తనకు చెప్పినట్లు కోమల్ రాసిన దాని ప్రకారం.. ఆ తర్వాత బోనీ లేచి ఫ్రెష్ అయ్యారు. ఆయన బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తామిద్దరం కలిసి రొమాంటిక్ డిన్నర్‌కి వెళ్దామని శ్రీదేవితో చెప్పారు. షాపింగ్‌ను మరుసటి రోజుకు (ఆదివారం) వాయిదా వేయాలని ఆమెను కోరారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రికి ఇండియా వెళ్లాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకోవటంతో తిరుగు ప్రయాణం టికెట్లను మరోసారి మార్చాల్సి వచ్చింది. షాపింగ్ చేయటానికి 25వ తేదీ రోజంతా సమయం ఉంటుందని వారు భావించారు.

''అప్పటికి ఇంకా విశ్రాంతి మూడ్‌లోనే ఉన్న శ్రీదేవి స్నానం చేసి, రొమాంటిక్ డిన్నర్‌కి రెడీ కావటానికి వెళ్లింది. లివింగ్ రూమ్‌కి వెళ్లాను'' అని కోమల్‌కి బోనీ చెప్పారు. కోమల్ రాసిన దానిప్రకారం.. బోనీ లివింగ్ రూమ్‌లో దక్షిణాఫ్రికా - ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడటానికి టీవీ చానళ్లు తిప్పుతూ గడిపారు. నాలుగైదు నిమిషాల తర్వాత పాకిస్తాన్ సూపర్‌లీగ్ క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూపిస్తున్న ఒక చానల్ దగ్గర ఆగారు. దాదాపు 15-20 నిమిషాల పాటు ఆ మ్యాచ్ చూస్తూ గడిపారు. అయితే శనివారం కావటం వల్ల రెస్టారెంట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని తనకు తెలుసునని, అప్పటికే దాదాపు 8:00 గంటలు అవుతోందని తనకు తొందర మొదలైందని కోమల్‌తో బోనీ చెప్పారు.

బోనీ తనకు చెప్పినట్లు కోమల్ రాసిన కథనం ప్రకారం.. బోనీ అసహనంగా లివింగ్ రూమ్ నుంచే శ్రీదేవిని కేకవేసి పిలిచారు. అలా రెండు సార్లు పిలిచిన తర్వాత టీవీ సౌండ్ తగ్గించారు. అప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఆయన బెడ్‌రూమ్‌కి వెళ్లి బాత్‌రూమ్ తలుపు తడుతూ ఆమెను పిలిచారు. లోపలి నుంచి ట్యాప్ నీటి శబ్దం వినిపిస్తుంటే ''జాన్.. జాన్'' అని ఇంకొంచెం పెద్దగా పిలిచారు. అయినా కానీ సమాధానం లేకపోవటంతో కంగారు పడి.. లోపలి నుంచి గడియ పెట్టిలేని బాత్‌రూమ్ తలుపు తెరిచారు. అక్కడి పూర్తిగా నీటితో నిండివున్న టబ్‌లో.. శ్రీదేవి తల నుంచి బొటనవేలి వరకూ పూర్తిగా మునిగిపోయి ఉంది. హతాశుడైన బోనీ ఆమె దగ్గరకు పరుగున వెళ్లి చూశాడు. కానీ ఆమె చలనం లేకుండా పడివుంది. జరగరానిది జరిగిపోయింది.

''ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆమె ముందు నీటిలో మునిగిపోయి ఆ తర్వాత అపస్మారకంలోకి వెళ్లారా లేక ముందు నిద్రలోకి వెళ్లో స్పృహ కోల్పోయో ఆ తర్వాత నీటిలో మునిగిపోయారా బహుశా ఇక ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఆమెకు కనీసం ఒక నిమిషమైనా పెనుగులాడే అవకాశం లభించినట్లు లేదు. ఎందుకంటే ఆమె భయంతో కాళ్లూ చేతులూ ఆడించి ఉంటే టబ్ నుంచి కొన్ని నీళ్లు చింది ఉండేవి. కానీ టబ్ బయట నేల మీద ఒక్క నీటి చుక్క కూడా లేదు'' అని కోమల్ నాహ్తా రాశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)