You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విభజన హామీల సాధనకు జేఏసీ ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్
ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నానని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రకటించారు. విభజన హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మాజీ ఎంపీ ఉండవల్లి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వివరించారు.
పార్లమెంట్‌లో ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
'ప్ల కార్డులతో పనులు జరగవు. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే అన్ని పార్టీలు, సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది' అని పవన్ అన్నారు.
పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌లోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే!
1. యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేదు. ఎన్నికలకు ముందే ఈ విషయం మోదీకి చెప్పా. విభజన హామీలు, సమస్యలను నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించా. ఏపీకి న్యాయం చేయాలని అడిగా. బీజేపీ న్యాయం చేస్తుందని ఆశగా ఎదురుచూశాం. కానీ ఎన్డీఏ కూడా ప్రత్యేక హోదాను పట్టించుకోలేదు.
అదే ఆశతో గత ఏడాదిన్నరగా ఎదురుచూస్తూనే ఉన్నా. తిరుపతి సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన తర్వాతే కేంద్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. నిజానికి కాకినాడ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని అనుకున్నా. కానీ దానిపై నీళ్లు చల్లారు.
2. కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులపై రకరకాలుగా చెబుతున్నారు. కేంద్రం, ఏపీ చెబుతున్న లెక్కల్లో స్పష్టత లేదు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన వాటా ఎంత? మభ్యపెట్టే రాజకీయాలు ఎంత మాత్రం మంచిది కాదు.
3. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, జనసేన గొంతును బలంగా వినిపించే వాడిని. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి జనసేన బలం ఒక్కటే సరిపోవడం లేదు.
4. బంద్‌లకు జనసేన వ్యతిరేకం కాదు. కానీ రోడ్లపైకి వచ్చి ప్రజల్ని బాధపెట్టడం సరికాదు. శాంతియుతంగా నిర్వహించే బంద్‌లకు మద్దతు ఇస్తాం. రేపటిది ప్రత్యేక పరిస్థితి కాబట్టి, వామపక్షాల బంద్‌కు జనసేన మద్దతు ఉంటుంది.
5. నాకు తెలంగాణ పోరాటం స్ఫూర్తి. అభిప్రాయ బేధాలు ఉన్నా.. ప్రతీ ఒక్కరూ తెలంగాణ కోసం ఉద్యమించారు. కానీ ఆ స్ఫూర్తి ఏపీలో కనిపించడం లేదు. ప్రజల్లో కోపాలున్నాయి. కానీ నాయకుల్లో మాత్రం అవకాశవాదం కనిపిస్తోంది.
6. ఏపీకి న్యాయం జరగలేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. అన్ని పార్టీలు అడుగుతున్నాయి. కానీ కేంద్రం స్పందించడం లేదు. బీజేపీ ప్రభుత్వం వద్ద సమాధానం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాలి. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలి.
7. రెండు ప్లకార్డులు.. నాలుగు స్లోగన్లతో పని జరగదు. ప్రజల శ్రేయస్సు కోసం అందరూ కలిసి ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాకుంటే మిగిలిన వారితో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనసేన జేఏసీలో చిరంజీవి ఉండరు.
8. మేం రోడ్డెక్కి ధర్నాలు చేయం. అది మా చివరి అస్త్రం. రాజకీయ ప్రక్రియ ద్వారా హామీల అమలు కోసం పోరాడుతాం. భావస్వారూప్యం కలిగిన వ్యక్తులతో కలిసి నడుస్తాం.
9. పార్టీలకు రాజకీయ బాధ్యత ఉండాలి. పార్లమెంట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీకి విలువ లేకుంటే ఎలా?
10. జనసేన ఇప్పుడే పుట్టిన పార్టీ. ఎప్పటి నుంచో ఉన్న పార్టీలతో నేనొక్కడిని ఎలా పోరాడగలను? నా కష్టాలు నాకున్నాయి. అందుకే కీలకమైన అంశాలపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే స్పందిస్తున్నా. అందుకే ఆలస్యం అవుతోంది.
11. నేను ప్రజల పక్షం.. పార్టీల పక్షం కాదు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలు ఉండాలి. బూతులు తిట్టడమే రాజకీయం అంటే అది నాకు నచ్చదు. అదే పాలిటిక్స్ అంటే నేనా పాలిటిక్స్ చేయను.
12. మేం ప్రభుత్వంలో లేము. బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నా. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం.
13. ఇతర పార్టీల మాదిరిగా వలసలను ప్రోత్సహించను. జనసేనలో అంకితభావం ఉన్న యువకులు ఉన్నారు. వారిని ప్రమోట్ చేయాలి.
"పవన్ తొలిసారి వాస్తవికంగా మాట్లాడారు!"
పవన్ కల్యాణ్ మొదటిసారి విమర్శనాత్మకంగా, వాస్తవికంగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు.
అయితే, జనసేన జేఏసీలో అందరూ చేరుతారా.. లేదా అన్నది ఆ పార్టీ కార్యాచరణ, విధివిధానాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
'కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. దానిపై ప్రశ్నించడం మంచి విషయమే. ఈ దిశగా పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకు వేశారు' అని ఆయన అన్నారు.
హామీల అమలు కోసం విస్తృత వేదిక ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని, దీనికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని తెలకపల్లి రవి సూచించారు.
అయితే, జనసేన జేఏసీకి టీడీపీ మద్దతు ఇవ్వకపోవచ్చని, మోదీ హామీ ఇచ్చారంటూ దాటవేసే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన విశ్లేషించారు.
హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మీదే జనసేన పోరాడాల్సి వస్తుందని, అలా చేస్తేనే పవన్ మీద ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కూడా తెలకపల్లి రవి అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)