You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అర్చక శిక్షణ పొందిన వారు అర్చకులతో సమానం కాదు: టీటీడీ
- రచయిత, పీఎన్ అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయాల్లో పూజారులు, కమ్యూనిటీ ఆలయాల్లో అర్చకులు.. వేర్వేరు అంశాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ అర్చక శిక్షణ పొందిన యువకులు టీటీడీ అర్చకులతో సమానం కాదని స్పష్టం చేశారు.
‘టీటీడీ ఆలయాల్లో ఎస్సీ, ఎస్టీ అర్చకులు’ అంటూ గురువారం స్థానిక మీడియాలో పలు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను బీబీసీ సంప్రదించింది. ఆయన స్పందిస్తూ.. ‘గ్రామాల్లో ఆలయాలు మూతపడకూడదనే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆసక్తి కలిగిన యువకులకు టీటీడీ అర్చక శిక్షణనిస్తోంది. కానీ వీరు టీటీడీ అర్చకులతో సమానం కాదు..’ అని తెలిపారు.
ఆ వార్తల్లో నిజం లేదని బీబీసీకి స్పష్టం చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.
దీనిపై మరింత సమాచారం కోసం జేఈవో భాస్కర్‌ను సంప్రదించాలని సూచించారు.
నిత్యారాధనపై శిక్షణ
"ధర్మప్రచార పరిషత్ ద్వారా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు కొంతమంది బ్రాహ్మణేతరులకు కూడా శిక్షణినిస్తోంది. ఇది ఇప్పుడు కొత్తగా ప్రారంభించినది కాదు. ఎప్పటినుంచో అమల్లో ఉంది. గ్రామాల్లో, కాలనీల్లో కొంతమంది సొంతంగా ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. కానీ వాటిలో నిత్యారాధనలు చేయడానికి ఎవరూ అందుబాటులో ఉండని పక్షంలో కనీసం పదో తరగతి చదివినవారెవరైనా ఆసక్తి చూపించి, ముందుకు వస్తే వారికి టీటీడీ శిక్షణనిస్తోంది" అని భాస్కర్ తెలిపారు.
విడతలవారీగా శిక్షణ
‘నిత్యారాధనపై నవంబరులో రెండు బ్యాచ్‌లకు శిక్షణ పూర్తైంది. ప్రతి బ్యాచ్‌లో 30 మంది ఉంటారు. ఈ శిక్షణ గతంలో వారంరోజులు ఉండేది. కానీ తర్వాత దీన్ని నెల రోజులకు పెంచారు.’ అని భాస్కర్ వివరించారు.
అర్చకులతో వీరు సమానం కాదు...
పురాణయుక్త ఆగమ శాస్త్ర విధానంపై శిక్షణ తీసుకున్న ఈ యువకులు టీటీడీ అర్చకులతో సమానం కాదు అని భాస్కర్ మరోసారి స్పష్టం చేశారు.
ఇది చాలా సాధారణ పూజావిధానాలపై శిక్షణ మాత్రమే. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే టీటీడీ ఇలా కొందరికి శిక్షణనిస్తోందని ఆయన వివరించారు.
గ్రామాల్లో, కమ్యూనిటీల్లో టీటీడీ భజన మందిరాలను నిర్మిస్తోందని, దీనికి గ్రామస్థులంతా కలసి రూ. 2 లక్షలు సమకూర్చితే మరో రూ. 6 లక్షలు టీటీడీ మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.
కేవలం ఎస్సీ, ఎస్టీలే కాదని, ఏ వర్గంవారైనా ఈ అర్చక శిక్షణకు అర్హులేనన్నారు.
పూజారులు లేని ఆలయాల్లో నిత్య పూజలు చేస్తూ, ధూపదీపనైవేద్యాలు చేయడానికి మాత్రమే వీరిని తగిన శిక్షణ ఇస్తామని తెలిపారు.
టీటీడీ ఆలయాల్లో అర్చకులు అంటే దాని అర్హతలు.. శిక్షణ అంతా ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతుందని భాస్కర్ చెప్పారు.
ఈ శిక్షణను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందినవారు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయాల్లో అర్చకులుగా నియామకానికి అర్హులవుతారని ఆయన స్పష్టం చేశారు.
గ్రామస్థుల అంగీకారంతోనే ఇది జరుగుతోందని ఆయనన్నారు. వీరు కేవలం నిత్యసేవలకే పరిమితం కానీ, ప్రతిష్ఠలు, అభిషేకాలు, కళ్యాణాలు, హోమాలు వంటి పెద్ద కార్యక్రమాలు, ఉత్సవాలు చేయలేరని ఆయనన్నారు. ఆలయాలు మూతపడకుండా కాపాడటమే టీటీడీ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)