You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాజస్థాన్: ముస్లిం కార్మికుడి హత్య వీడియో, నిందితుడి అరెస్ట్
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో మహ్మద్ అఫ్రాజుల్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ కేసులో పోలీసులు శంభూలాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
"ఈ హత్యలో నిందితుడు శంభూలాల్‌ను ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాం" అని ఉదయ్‌పూర్ డీఐజీ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు.
హత్యకు సంబంధించిన వీడియోతో పాటు శంభూలాల్ మరో రెండు వీడియోలు షేర్ చేశారు. ఇందులో ఒకటి అతను ఓ మందిరంలో ఉన్నది కాగా, మరొకటి హత్యకు తానే బాధ్యుడినని చెబుతున్న వీడియో. ఈ వీడియోలో అతను ఒక కాషాయ జెండా ఎదుట కూర్చొని 'లవ్ జిహాద్', 'ఇస్లామిక్ జిహాద్'లకు వ్యతిరేకంగా ప్రసంగిస్తున్నట్టుగా ఉంది.
నిందితుడికీ, మృతుడు మహ్మద్ అఫ్రాజుల్‌కూ మధ్య ఏదైనా వివాదం ఉందా అనే కోణంలో ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు చెబుతున్నారు.
మహ్మద్ అఫ్రాజుల్ గత 12 సంవత్సరాలుగా పట్టణంలో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. బెంగాల్ వాస్తవ్యుడైన అఫ్రాజుల్ రాజ్‌సమంద్‌లో ఉంటున్నారని వారు చెప్పారు.
"ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిందితుడు శంభూలాల్ కుటుంబానికి చెందిన ఏ మహిళా కులాంతర లేదా మతాంతర వివాహం చేసుకున్న ఆధారాలు లభించలేదు" అని ఆనంద్ శ్రీవాస్తవ బీబీసీకి తెలిపారు.
"వీడియోలో నిందితుడు ద్వేషాన్ని వ్యాప్తి చేసే భాషను ఉపయోగించాడు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయగూడదని మేం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.
"ఈ ఘటన తీవ్రత రీత్యా రాజ్‌సమంద్, ఉదయ్‌పూర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశాం. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించాం. ఈ ఘటనకు ప్రతీకారంగా మరో హత్య ఏదీ జరగకుండా రెండు వర్గాలకు చెందిన ప్రజలతో సమావేశం నిర్వహించాం'' అని ఆయన వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తిపై పదునైన ఆయుధంతో దాడి చేసి, అతనికి నిప్పు అంటించడం ఉంది.
నిందితుడు వీడియోలో, ''నీ పని అయిపోయింది. మా దేశంలో లవ్ జిహాద్ చేస్తావా? ప్రతి జిహాదీకి ఇదే గతి పడుతుంది. లవ్ జిహాద్‌ను బంద్ చేయండి'' అని చెప్పడం కనిపించింది.
'వీడియోను షేర్ చేయకండి'
శంభూలాల్ వీడియోను షేర్ చేయొద్దని డీఐజీ ఆనంద్ శ్రీవాస్తవ ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.
''ఇలాంటి రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయకండి. శాంతిభద్రతలను కాపాడండి. కొన్ని ఛానెళ్లలో కూడా ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. మీడియా విజ్ఞత ప్రదర్శించి ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'' అన్నారు.
నిందితుడు శంభూలాల్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసారు. అతనిపై ఇతర నేరాల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఈ వీడియో వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)