You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలి: లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్
భారతదేశంలో 1919లో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన వందలాది మంది నిరాయుధ నిరసనకారుల ఊచకోత ఘటనపై భారతదేశానికి బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ డిమాండ్ చేశారు.
బ్రిటన్ క్షమాపణ చెప్పాలన్న తొలి బ్రిటిష్ ఉన్నతస్థాయి నాయకుడు ఆయనే.
పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌ను బుధవారం సందర్శించిన సందర్భంగా సాదిఖ్ ఈ ప్రకటన చేశారు.
చరిత్రలో ఘోరమైన ఊచకోతల్లో ఒకటైన జలియన్‌వాలా బాగ్ దురాగతానికి క్షమాపణ చెప్పాలని భారతదేశం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌లలో దౌత్య పర్యటనలో ఉన్న సాదిఖ్.. బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా ట్వీట్ కూడా చేశారు.
అమృత్‌సర్ పట్టణంలో 1919 ఏప్రిల్ 3వ తేదీన ఈ ఊచకోత జరిగింది.
బ్రిటిష్ వలస రాజ్య చట్టాలను వ్యతిరేకిస్తూ మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది భారతీయులు చుట్టూ ఎత్తయిన గోడలున్న జలియన్‌వాలాబాగ్ తోటలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఆ సమావేశం కొనసాగుతుండగానే బ్రిటిష్ సైన్యం కల్నల్ రెగినాల్డ్ డయ్యర్ తన సైనికులతో కలిసి తోటలోకి ప్రవేశించి.. సమావేశమై ఉన్న జనం మీద కాల్పులకు ఆదేశించాడు.
అక్కడి నుంచి బయటకు వెళ్లే దారులన్నిటికీ సైనికులు అడ్డుగా నిలుచున్నారు. ఆందోళనకారులు బయటకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో వందలాది మంది చనిపోయారు. ఈ మారణకాండ భారతదేశమంతటా ఆగ్రహావేశాలను రగిల్చింది.
ఆ దారుణం జరిగి దాదాపు 100 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అది భారత్, బ్రిటన్‌ల మధ్య ఓ వివాదాస్పద అంశంగానే ఉంది.
బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త, యువరాజు ఫిలిప్, మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ వంటి బ్రిటిష్ ప్రముఖులు చాలామంది జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించి నివాళులర్పించారు.
డేవిడ్ కామెరాన్ లాంఛనంగా క్షమాపణ చెప్పకపోయినప్పటికీ.. ఆ మారణకాండను ‘‘బ్రిటిష్ చరిత్రలో అత్యంత సిగ్గుచేటయిన ఘటన’’ అని అభివర్ణించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)