ప్రెస్ రివ్యూ: ఫిల్మ్‌సిటీకి వెళ్లి రామోజీరావును కలిసిన జగన్

ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావుతో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.

పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డితో కలిసి సోమవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన జగన్ సుమారు గంటసేపు రామోజీరావుతో సమావేశమయ్యారు.

రామోజీరావును జగన్ వ్యక్తిగతంగా కలవడం ఇది రెండోసారి. వచ్చే నెల 2 నుంచి జగన్ పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ఆసక్తి రేకెత్తిస్తోందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

అయితే ఈ భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని తెలిపింది.

నిరుద్యోగ భృతిపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభిచింది. ఎవరు నిరుద్యోగులన్న దానిపై ఏపీ మంత్రి నారా లోకేష్ అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు సుమారు 33 లక్షల మంది తాము నిరుద్యోగులని డిక్లరేషన్ ఇచ్చినట్లు ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ జరిగిన క్రోడీకరణలో నిరుద్యోగుల సంఖ్య 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నట్లుగా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

నిరుద్యోగులుగా 18 నుంచి 40, 20 నుంచి 35, 20 నుంచి 40 ఏళ్ల వారిలో ఏ వయస్సు వారిని పరిగణలోకి తీసుకోవాలనే ప్రతిపాదనలను పరిశీలించారు.

నిరుద్యోగుల వివరాలను ఆధార్‌తో అనుసంధానించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను సంబంధిత అధికారులు సమావేశంలో ప్రదర్శించారు.

కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డిపై వేటు వేయడానికి టీడీపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ వైఖరిపై నివేదిక రూపొందించి ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు సమాచారం.

మీడియా కథనాలపై రేవంత్ వివరణ కోరినా ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

నేడో, రేపో రేవంత్ పై చర్యలు తప్పవని టీటీడీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నట్లు ప్రజాశక్తి కథనం పేర్కొంది.

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ కార్యాలయాలపై ఇన్‌కంట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

మెర్సల్ సినిమాకు మద్దతు తెలిపినందుకే ఈ దాడులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు మూడు గంటల పాట సోదాలు జరిగినట్లు సాక్షి కథనం పేర్కొంది.

మెర్సెల్ వివాదంలో విశాల్ స్పందిస్తూ.. జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న సంభాషణలు తొలగించాల్సిన పనిలేదని అన్నారు.

ప్రజలు తమ దేశభక్తిని రుజువు చేసుకోవాలంటే సినిమా హాళ్లలో లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లేచి నిలబడనంత మాత్రాన వారి దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

టీ షర్టులు, నిక్కర్లతో సినిమాకు వస్తే జాతీయ గీతాన్ని అవమానపర్చినట్లే అంటూ ప్రభుత్వం వాటిపైనా నిషేధం విధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై నిబంధనలను సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)