30 ఏళ్ల నాటి భారత శాంతి పరిరక్షక దళం: ఓ జవాను యుద్ధ స్మృతులు

తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈని నిరాయుధీకరించేందుకు భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్) 1987 జులై లో ఉత్తర శ్రీలంకలో అడుగు పెట్టింది. అయితే అక్కడ సైన్యాన్ని మోహరించడమే తప్పిదమైంది. శాంతిసేనలు చివరకు వారితోనే యుద్ధానికి దిగాల్సి వచ్చింది.

మానవ హక్కులను కాలరాశారని వారిపై ఆరోపణలొచ్చాయి. ఈ పోరులో దాదాపు 1200 మంది చనిపోయారు. ఈ మిషన్‌లో భాగమైన రిటైర్డ్ మేజర్ జనరల్ శియోనన్ సింగ్ ఇప్పటి వరకు తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయితే 30 ఏళ్ల తర్వాత ఆయన బీబీసీ హిందీ ప్రతినిధి వినీత్ ఖరేతో కలసి ఇప్పుడా ప్రాంతానికి వచ్చారు.

జఫ్నాలోని ఆకుపచ్చని పలాలి ఏయిర్ బేస్ ని చూస్తూ.. కళ్లలో నాటి జ్ఞాపకాలు మెదలుతుండగా .. ఇక్కడికి వస్తానని మళ్లీ అనుకోలేదని చెప్పుకొచ్చారు శియోనన్ సింగ్.

''ఇప్పుడిక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ, 1987లో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో శ్రీలంక సైన్యానికి, తమిళ టైగర్ మిలిటెంట్ లకు మధ్య యుద్ధం భీకరంగా ఉండేది. ప్రత్యేక దేశం కోసం ఎల్టీటీఈ పోరుబాట పట్టింది. ఈ దశలో శ్రీలంకలో పరిస్థితి చక్కదిద్దేందుకు, ఎల్టీటీఈ సేనలు ఆయుధాలు అప్పగించేలా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం శాంతిపరిక్షక దళాలను అక్కడికి పంపింది'' అని ఆయన నాటి పరిస్థితులను వివరించారు.

ఏ ఉద్దేశంతో భారత్ శాంతి పరిరక్షక దళాలను పంపిందో దానికి విరుద్ధమైన పరిస్థితి అక్కడ తలెత్తింది. ఎల్టీటీఈకీ, శాంతి పరిరక్షక దళానికి మధ్య చివరకు పోరు మొదలైంది. ఈ యుద్ధంలో 1200 మంది చనిపోయారు.

నాటి పోరులో మృతి చెందిన శాంతిపరిరక్షక దళ సేనలకు నివాళిగా పలాలి విమానాశ్రయం వద్ద ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు.

నాటి మిషన్ లో భాగంగా శియోనన్ సింగ్ 32 నెలలు శ్రీలంకలో పనిచేశారు.

''మేం ఇక్కడ దిగగానే శ్రీలంక సేనలు ఆయుధాలను జారవిడిచాయి. ప్రతిఘటించడానికి వచ్చామా ఏంటీ అని అనుకున్నాం. శాంతి పరిరక్షణలో భాగంగానే తాము వచ్చామని చేతులు ఊపి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాం'' అని నాటి విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

రక్షకులుగా చూశారు

''ఎప్పుడైతే భారత్ నుంచి శాంతిసేనలు వచ్చాయో ఇక వాళ్లే తమను రక్షిస్తారని తమిళులు అనుకున్నారు. అందుకే వారు ఐపీకేఎఫ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీలంక సైన్యం నుంచి తమను విముక్తులను చేస్తారని వారు భావించారు.'' అని నాడు యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న ఎన్. పరమేశ్వరన్ బీబీసీకి చెప్పారు.

శ్రీలంకలోని మెజారిటీలైన సింహళీలు తమకు అన్యాయం చేస్తున్నారని ఉత్తరాదిన తక్కువ సంఖ్యలో ఉండే తమిళులు భావించేవాళ్లు.

సింహళీనే జాతీయ భాషగా చేస్తూ శ్రీలంక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం తమ ఉపాధికి, ప్రభుత్వ రంగంలో తమ ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని తమిళులు ఆందోళన చెందారు. అదే సమయంలో తమిళ ప్రజలపై హింస చోటు చేసుకుంది. 1983 నాటి హింసలో దాదాపు 3 వేల మంది తమిళులు చనిపోయారు.

శ్రీలంక అంతర్యుద్ధం తమిళులు ఎక్కువగా ఉండే భారత్‌కూ ఆందోళన కలిగించింది.

ఈ కారణంతోనే భారత సైన్యాన్ని శ్రీలంకలో మోహరించేందుకు నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ, శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్థనేతో ఒప్పందం చేసుకున్నారు.

అయితే, తమ దేశ అంతర్గత విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం పట్ల శ్రీలంకలోని చాలా మంది ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత శాంతి పరిరక్షక దళం(ఐపీకేఎఫ్) అక్కడికి చేరుకోగానే ఉత్తరాదిలో శ్రీలంక సైన్యం స్థానంలో శాంతిసేన దళాలను నియమించారు.

తాము ఇక్కడికి రావడం తమిళులకు సహాయ పడుతుందని శాంతి దళంలోని చాలా మంది జవాన్లు భావించారు. యుద్ధం గురించి ఆలోచనే వారి మదిలో లేదు.

కొన్నాళ్లు భారత సైన్యం, ఎల్టీటీఈకి శిక్షణ కూడా ఇచ్చింది. మొదట్లో ఇరు వర్గాల మధ్య సంబంధాలు కూడా బాగానే ఉండేవి.

''వాళ్ల (ఎల్టీటీఈ) లో చాలా మందికి మేం తెలుసు. ఎందుకంటే మా వాళ్లే వాళ్లకు శిక్షణ ఇచ్చేది. వాళ్లు మా మిలటరీ క్యాంపు‌‌కు కూడా వచ్చేవారు. తర్వాత కాలంలో మా క్యాంపుపై దాడి చేయడానికి ఇదే వారికి ఉపకరించింది. వాళ్లు మా కంటే అధునాతన ఆయుధాలను వాడేవారు. మా ఆయుధాలను చూసి వాళ్లు నవ్వుతారేమోనని ఒక్కోసారి వాటిని వాళ్లకు కనిపించకుండా దాచేవాళ్లం. మా రేడియో సెట్లు కేవలం 10 నుంచి 15 కిలో మీటర్ల పరిధి వరకే పనిచేస్తాయి. వాళ్లవి 40 నుంచి 45 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేసేవి'' అని శియోనన్ చెప్పారు.

ఎల్టీటీఈతో మొదట్లో సమస్యలేవీ లేవు. అయితే రానురాను పరిస్థితి మారింది. వాళ్లు ఆయుధాలు అప్పగించేందుకు నిరాకరించారు. దీంతో రెండు వర్గాల మధ్య బంధం దెబ్బతింది.

శాంతిసేన ఎయిర్ బేస్ ఉండే పలాలికి దగ్గర్లోని జఫ్నా విశ్వవిద్యాలయ ప్రాంతంలో మొదటగా యుద్ధం మొదలైంది.

దీంతో మేజర్ శియోనన్ నేతృత్వంలోని సైనికులు తమపై దాడి చేస్తున్నవారిని నిరోధించేందుకు ముందుకు కదిలారు.

''వాటర్ ట్యాంక్ నుంచి మాపై కాల్పులు ప్రారంభించారు'' అంటూ శియోనన్ ఓ భవనాన్ని చూపించారు.

నాటి పోరు ఓ రోజంతా సాగింది. 36 మంది శాంతిపరిరక్షక దళ సైనికులు చనిపోయారు.

''నా గ్రూప్ లో చనిపోయిన మొదటి వ్యక్తి లక్ష్మీచంద్. శ్రీలంక సైన్యం కూడా హెలీకాప్టర్‌తో ఎల్టీటీఈపై కాల్పులు జరుపుతూ మాకు సాయపడింది. 30 ఏళ్ల కిందట మేం ఇక్కడే శ్రద్ధ పెట్టి పనిచేశాం' అని శియోనన్ చెప్పారు.

మానవహక్కుల ఉల్లంఘన

భారత శాంతి సేనలు మానవ హక్కులను కాలరాశాయని, అత్యాచారాలు, హత్యలు, హింసాయుత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి.

1987 అక్టోబర్ 21న జఫ్నాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిని స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఎల్టీటీఈ ఈ ఆస్పత్రి నుంచి కాల్పులు జరిపిందని ఆరోపిస్తూ భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపిందని, దీంతో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లు, నర్సులు సహా 60 మంది చనిపోయారని వారు చెబుతుంటారు.

ఎ. దేవేంద్రమ్ అప్పట్లో ఈ ఆస్పత్రిలో పనిచేసేవారు. ఆయనొక్కరే మమ్మల్ని కలుసుకోడానికి సిద్ధమయ్యారు. భారత సైన్యం ఆస్పత్రిలోకి ప్రవేశించడం, దాడి చేశాక ఆస్పత్రిలో శవాలు మాత్రమే తాను చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆ దాడి గురించి తనకేమీ తెలియదని శియోనన్ సింగ్ తెలిపారు. ''ఆ ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నాను. అలాంటిది జరగకుండా ఉండాల్సింది'' అన్నారు.

ఎల్టీటీఈ 1991 లో రాజీవ్ గాంధీని చంపడానికి ఇదే కారణమైంది.

జఫ్నాలో ప్రస్తుతం శాంతి నెలకొనడంతో శియోనన్ సింగ్ సంతోషంగానే ఉన్నారు. అయితే, నాటి యుద్ధ గాయాలను మాన్పడానికి శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)