You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ టెర్రరిస్తాన్‌గా మారిపోయింది: ఐరాసలో భారత్
ఐరాస వేదికపై భారత్, పాకిస్తాన్‌లు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కశ్మీర్‌లో భారత సైనికులు హింసకు పాల్పడుతున్నారని పాకిస్తాన్ ఆరోపించగా, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నది ఆ దేశమేనని భారత్ ఆరోపించింది.
మొదట ఐరాసలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ తన ప్రసంగంలో భారత పాలనలోని కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆ ప్రాంతంలో భారతీయ సైనికులు సామాన్య ప్రజలపై పెల్లెట్ గన్స్‌ను ప్రయోగిస్తున్నారని ఆయనన్నారు.
అలాగే తమ దేశంలోని ఉగ్రవాద శక్తులకు భారతదేశం మద్దతునిస్తోందని కూడా పాకిస్తాన్ ఆరోపించింది.
భారత్ దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్'గా అభివర్ణించింది.
పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ గురువారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోకాశ్మీర్‌లో భారత్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులపై భారత్ తీవ్రమైన అణచివేత విధానాలకు పాల్పడుతోందని అన్నారు.
"పెల్లెట్ల కారణంగా కశ్మీర్‌లో ఎంతో మంది కంటి చూపును, అవయవాలను కోల్పోయారు. అవన్నీ యుద్ధ నేరాలే" అని అబ్బాసీ అన్నారు.
కాశ్మీర్‌లో అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధిని నియమించాలని సూచించారు.
అబ్బాసీ ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ఈనాం గంభీర్ తిప్పి కొట్టారు.
"ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్‌లకు ఆశ్రయం ఇచ్చిన దేశం తామే బాధితులమని చెప్పుకోవడం వింతగా ఉంది" అని గంభీర్ అన్నారు.
పాకిస్తాన్‌ను 'టెర్రరిస్తాన్'గా పేర్కొంటూ, "అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తున్నది, ఎగుమతి చేస్తున్నది ఆ దేశమే" అని తిప్పి కొట్టారు.
పాక్ ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)