You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జర్మనీ ఛాన్సలర్ పగ్గాలు మళ్లీ ఏంగెలా మెర్కెల్‌కే!!
జర్మనీ ఛాన్సలర్‌గా ఏంగెలా మెర్కెల్ నాలుగోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆదివారం జరిగిన జాతీయస్థాయి ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)ల కూటమి అతిపెద్ద కూటమిగా అవతరించింది. సీడీయూ నాయకురాలైన మెర్కెల్ దాదాపు 12 ఏళ్లుగా జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం పాలక సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌పీడీ) తాజా ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. తీవ్రంగా నష్టపోయిన ఈ పార్టీ, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పింది.
దేశంలోకి వలసలను, శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే జాతీయవాద పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) 2013 ఎన్నికలతో పోలిస్తే బాగా పుంజుకొంది. 12.6 శాతం ఓట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొంది. తొలిసారిగా సీట్లు సాధించింది. జర్మనీ చట్టసభ బుండెస్టాగ్‌లో అడుగుపెట్టనుంది.
ఈ ఎన్నికల్లో అగ్రభాగాన నిలిచినప్పటికీ సీడీయూ-సీఎస్‌యూ కూటమికి 1949 నుంచి దాదాపు ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఫలితాలు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో జాతీయ ఎన్నికలు తొలిసారిగా 1949లో జరిగాయి. ఎస్‌పీడీ ప్రదర్శన కూడా ముందెన్నడూ లేనంత పేలవంగా ఉంది.
పార్టీలు/కూటమి - ఓట్ల శాతం
సీడీయూ-సీఎస్‌యూ 33
ఎస్‌పీడీ20.5
ఏఎఫ్‌డీ12.6
ఎఫ్‌డీపీ10.7
లెఫ్ట్9.2
గ్రీన్స్ పార్టీ 8.9
ఆధారం: ఫెడరల్ రిటర్నింగ్ అధికారి
ఏఎఫ్‌డీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు
ఏఎఫ్‌డీ ఈ స్థాయిలో పుంజుకోవడాన్ని అంగీకరించలేనివారు రాజధాని బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, కోల్న్ నగరాల్లో నిరసనలు చేపట్టారు. పదుల సంఖ్యలో నిరసనకారులు బెర్లిన్‌లో ఏఎఫ్‌డీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ''శరణార్థులకు స్వాగతం'' అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ఫలితాలపై మెర్కెల్ స్పందిస్తూ- ''ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించాను. ఏఎఫ్‌డీకి మద్దతు పలికిన ఓటర్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటాను. వలసలకు మూల కారణాలను గుర్తించడంతోపాటు ఆర్థిక, భద్రతా పరమైన సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది'' అన్నారు.
ఏఎఫ్‌డీ నాయకురాలు ఫ్రౌకే పెట్రీ మాట్లాడుతూ ''అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. జర్మనీలో రాజకీయ భూకంపం వచ్చింది'' అని వ్యాఖ్యానించారు.
సరైన అనుమతులు, పత్రాలు లేని సుమారు తొమ్మిది లక్షల మంది శరణార్థులను, వలసదారులను మెర్కెల్ జర్మనీలోకి అనుమతించినందుకు ఆమె కూటమికి ఎన్నికల్లో ఈ ఫలితం ఎదురైందని బీబీసీ బెర్లిన్ కరస్పాండెంట్ జెన్నీ హిల్ విశ్లేషించారు. శరణార్థులు, వలసదారుల్లో అత్యధికులు సిరియా, ఇతర యుద్ధ ప్రభావిత దేశాల వారే.
ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు?
ఎస్‌పీడీ ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెర్కెల్‌కు ఉన్న అవకాశాలు పరిమితమయ్యాయి. మద్దతు కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టే అవకాశముంది. ఫ్రీ డెమొక్రాట్లు(ఎఫ్‌డీపీ), గ్రీన్స్‌తో కలిసి సీడీయూ-సీఎస్‌యూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది.
ఏఎఫ్‌డీతో కలిసి సాగేందుకు ఏ పార్టీ అంగీకరించలేదు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)