సినిమా, గనులు, బీడీ కార్మికుల పిల్ల‌ల‌కు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తోందని మీకు తెలుసా? ఇలా దరఖాస్తు చేసుకోండి...

    • రచయిత, ఎ. కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

సినిమా రంగంలో రోజువారీ జీవనోపాధికి సైతం అవస్థలు పడుతున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల చదువుకు చేయూతనివ్వడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది.

కేవ‌లం సినిమా రంగ కార్మికుల పిల్లలకే కాదు, బీడీ కార్మికులు, గ‌నుల్లో ప‌నిచేసే కార్మికుల పిల్లలకూ వారు చ‌దువుతున్న త‌ర‌గ‌తిని బ‌ట్టి ఏడాదికి రూ.1000 నుంచి రూ.25,000 వ‌ర‌కు ఉప‌కార వేత‌నం ఇచ్చేలా ఈ ప‌థ‌కాన్ని నడుపుతోంది.

మ‌రి ఈ ప‌థ‌కం ఏమిటి? దీనికెలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? ఏయే ప‌త్రాలు స‌మ‌ర్పించాలి? వంటి వివ‌రాలు తెలుసుకుందాం...

ఏమిటీ పథకం?

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సినిమా, గనులు, బీడీ తయారీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పిల్లల చదువుకు చేయూతనివ్వాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఈ కార్మికుల పిల్లలకు వారి చదువును బట్టి ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఉపకార వేతనం అందిస్తోంది.

సినిమా, బీడీ తయారీ, గనుల్లో పనిచేసే కార్మికులు ఆర్థికంగా వెనుకబడి ఉండటం, వారి సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

సినిమా, బీడీ, గనుల కార్మికుల పిల్లలకు ఒకటవ తరగతిలో చేరినప్పటి నుంచి ఎంబీబీస్, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంజినీరింగ్ లాంటి చదువులు పూర్తి చేసుకునేంత వరకు ఈ ఉపకార వేతనాన్ని అందజేస్తారు.

ఏయే తరగతికి ఎంత ఉపకార వేతనం ఇస్తారు?

  • 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు - ఏటా రూ.1,000
  • 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు - ఏటా రూ. 1,500
  • 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు - ఏటా రూ. 2,000
  • 11వ తరగతి నుంచి 12వ తరగతి వరకు - ఏటా రూ. 3,000
  • పారిశ్రామిక శిక్షణ సంస్థ (Industrial Training Institute – ITI) - ఏటా రూ. 6000
  • పాలిటెక్నిక్ కళాశాల విద్య - ఏటా రూ. 6,000
  • డిగ్రీ కోర్సులు (అగ్రికల్చర్ బీఎస్సీతో సహా)- ఏటా రూ. 6,000
  • ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులు - ఏటా రూ. 25,000

పథకానికి ఎవరు అర్హులు?

స్కూళ్లు, కాలేజీల్లో ఎవరైతే రెగ్యులర్ అడ్మిషన్ తీసుకుని చదువుతుంటారో ఆ పిల్లలు ఈ ఉపకార వేతనానికి అర్హులు.

దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు అర్హులు.

గనుల్లో ఏ పని చేసే కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది?

దేశంలోని వివిధ రకాల గనుల్లో పనిచేస్తున్న సాధారణ కార్మికులు, నైపుణ్య కార్మికులు, గుమస్తాలుగా పనిచేస్తున్న వారి పిల్లలకు ఇది వర్తిస్తుంది.

సినిమా రంగంలో పనిచేసే ఏ తరహా కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది?

నెలకు రూ.8,000 మించి వేతనం సంపాదించలేని కార్మికుల పిల్లలకు లేదా ఏడాదికి రూ.1,00,000 మించి వేతనం సంపాదించ లేని కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.

ఒకే కుటుంబంలో ఎంత మందికి ఈ పథకం వర్తిస్తుంది?

కార్మికుల కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

ఎవరు అనర్హులు?

ఈ పథకం కింద ఉపకార వేతనం పొందుతున్న విద్యార్థి ప్రభుత్వం నుంచి మరే ఇతర స్కాలర్‌షిప్ పథకం పొందకూడదు. అలా పొందుతున్నట్లైతే ఈ పథకాన్ని రద్దు చేస్తారు.

విద్యా సంస్థలో తగినంత ప్రతిభ కనబరచని విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.

తప్పుడు పత్రాల ద్వారా ఈ పథకం పొందుతున్నట్లు తెలిస్తే దీన్ని రద్దు చేస్తారు.

విద్యార్థి స్కూల్‌, కాలేజీలో చదువు మధ్యలో ఆపివేస్తే, వెంటనే ఈ ఉపకార వేతనం కూడా రద్దవుతుంది.

విద్యార్థులకు తగినంత హాజరు లేకపోయినప్పుడు, విద్యా సంస్థలో సరైన నడవడిక కనబర్చనప్పుడు ఈ పథకం రద్దవుతుంది.

రెండు డిగ్రీలు చేస్తే ఈ పథకం ఇస్తారా?

రెండు డిగ్రీలకు ఈ పథకం ఇవ్వరు. కేవలం ఒకదానికి మాత్రమే ఇస్తారు.

ఉదాహరణకు ముందుగా బీ.ఎస్సీ డిగ్రీ చేశారనుకుందాం. బీ.ఎస్సీ కోర్సు పూర్తయ్యే వరకు ఈ ఉపకార వేతనం ఇస్తారు. తదుపరి ఆ విద్యార్థి మళ్లీ బీ.కాం లేదా బీ.ఏ కోర్సు చదవాలనుకుంటే మాత్రం ఈ ఉపకార వేతనం ఇవ్వరు.

ఒక ప్రొఫెషనల్ కోర్సు చదవడానికి మాత్రమే స్కాలర్‌షిప్ ఇస్తారు.

కరస్పాండెన్స్, దూర విద్యలో చదివే వారికి ఈ పథకం వర్తిస్తుందా?

వర్తించదు. కేవలం రెగ్యులర్ అడ్మిషన్ ద్వారా చదివే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

ఉపకార వేతనం నగదు రూపంలో చెల్లిస్తారా?

ఉపకార వేతనాన్ని విద్యార్థి లేదా విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా చెల్లిస్తారు.

విద్యార్థి తల్లిదండ్రులకు ఏదేని జాతీయ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • http://www.scholarships.gov.in/ వెబ్ లింక్ ద్వారా ఆన్ లైన్‌లో ఈ ఉపకార వేతనానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
  • తదుపరి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మీ దరఖాస్తును నింపాలి.
  • దరఖాస్తు నింపే ముందు అందులో ఇచ్చిన మార్గదర్శకాలను తెలుసుకోవాలి.
  • •* గుర్తు ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూరించాలి.
  • పూరించిన దరఖాస్తును సేవ్ డాక్యుమెంట్‌గా భద్రపరచుకోవాలి.
  • ఆ తర్వాత సబ్ మిట్ నొక్కాలి.

ఏమేమి పత్రాలు జతచేయాలి?

  • స్కాలర్ షిప్ పొందాలనుకునే విద్యార్థి ఫొటో
  • సినిమా, గనుల్లో పనిచేసే కార్మికులు, బీడీ కార్మికుల గుర్తింపు కార్డు
  • బ్యాంకు ఖాతా పుస్తకం ముందు పేజీ లేదా క్యాన్సిల్ చేసిన చెక్
  • ముందటి తరగతికి సంబంధించి ఉత్తీర్ణత సర్టిఫికేట్.
  • రెవెన్యూ అధికారులు జారీ చేసే కుటుంబ వార్షికాదాయ పత్రం

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా?

ఈ ఉపకార వేతనానికి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం కుదరదు.

ఈ స్కాలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సినవసరం లేదు.

వివరాల కోసం ఎవర్ని సంప్రదించాలి?

విద్యార్థులకు సాయం చేయడం కోసం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ప్రత్యేకించి హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.

వర్కింగ్ డేస్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేరుగా ఫోన్ చేసి విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవ‌చ్చు.

Help Desk No: 0120 – 6619540

Email Address: [email protected]

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)