You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
YSR Law Nestham: కొత్త వకీలుకు నెలకు రూ. 5000 స్టైపండ్ ఇస్తున్నారు తెలుసా?
- రచయిత, ఎ.కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
న్యాయశాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన కొత్త వకీలుకు వృత్తిగత జీవితం కాస్త గందరగోళంగానే కనిపిస్తుంది.
ఏదో ఒక సీనియర్ న్యాయవాది వద్ద ఆయన జూనియర్‌గా చేరాలి. కొన్ని సంవత్సరాలు పైసా సంపాదన లేకుండా వృత్తిలో అనుభవం గణించాలి. తరువాత తాను సొంతగా కేసులు వాదించే స్థాయికి చేరుకోవాలి.
కేసులు గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే ఆ లాయర్ దశ తిరుగుతంది. చేతి నిండా కేసులతో అప్పుడే క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోతారు. అప్పటివరకు కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన యువ న్యాయవాదులకు వృత్తిగత జీవితం విషమ పరీక్షలాగే ఉంటుంది.
న్యాయ కళాశాలల్లో చదివే చదువు వేరు, న్యాయస్థానాల్లో అడుగు పెట్టాకా చదవాల్సింది, నేర్చుకోవాల్సిందే చాలా వేరుగా ఉంటాయి.
కేసు ఫైలు చేయడం మొదలు రిట్ పిటిషన్ రూపొందించడం, వకాల్తా వేయడం ఇలా ఎన్నో మెళకువలు నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవాలి. వాటిని కొనాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది.
కొత్తగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టే యువ న్యాయవాదులకు ఇవన్నీ ఎంతో భారమైనవి. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యువ న్యాయవాదులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది.
వైఎస్ఆర్ లా నేస్తం (YSR Law Nestham) పేరిట జూనియర్ న్యాయవాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద యువ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైపండ్ ఇస్తోంది.
వైఎస్ఆర్ లా నేస్తం (YSR Law Nestham) అంటే ఏమిటి? ఈ స్టైపండ్ పొందడానికి అర్హతలు ఏమిటి? ఎంపిక ఎలా చేస్తారు? ఇంకేమైనా రాష్ట్రాలు ఈ తరహా పథకం అమలు చేస్తున్నాయా? తదితర అంశాలను పూర్తీగా తెలుసుకుందాం.
వైఎస్‌ఆర్ లా నేస్తం అంటే ఏమిటి?
న్యాయ శాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5,000 స్టైపండ్ ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పథకమే ఇది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో తన పార్టీ మేనిఫెస్టోలో జూనియర్ న్యాయవాదులకు మొదటి మూడు సంవత్సరాలు ప్రతి నెలా రూ. 5000 పింఛను ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా 2019 డిసింబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
గత మూడేళ్లలో ఈ పథకం కింద 4,248 మంది న్యాయవాదుల ఖాతాల్లోకి రూ. 35.40 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కూడా 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాలోకి స్టైపండ్ జమ చేశారు.
అర్హతలు ఏమిటి?
- అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఉండాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల జాబితాలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి.
- 2016 సంవత్సరం తరువాత న్యాయశాస్త్ర పట్టభద్రులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- అభ్యర్థి తప్పనిసరిగా 15 ఏళ్ల నుంచీ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తుండాలి.
- తన దగ్గర ఆ జూనియర్ న్యాయవాది పనిచేస్తున్నారని తెలియజేస్తూ ఆ సీనియర్ న్యాయవాది అటెస్ట్ చేసిన అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
- బార్‌కౌన్సిల్‌లో జూనియర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న రెండేళ్లలోపు బార్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణుడై ఉండాలి.
- న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేస్తుండగా తాను ఏదైనా ఉద్యోగంలో చేరినా, లేదా న్యాయవాద వృత్తిని వదిలేసినా ఆ విషయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తానని రాతపూర్వక హామీ ఇవ్వాలి.
- అభ్యర్థి ఆధార్ కార్డు పొందుపరచాలి.
ఎవరు అనర్హులు?
- ఫోర్‌వీలర్ అంటే కార్లు కలిగి ఉన్నవారు పథకానికి అర్హులు కారు.
- జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు చేయని వాళ్లు అనర్హులు.
- ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకుని ఉండి, వాస్తవంగా న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేయకుండా ఇతరత్రా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నవారు అనర్హులు.
కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా?
ఇవ్వరు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ స్టైపండ్ సదుపాయం కల్పిస్తారు.
కుటుంబం అంటే ఎలా పరిగణిస్తారు?
భార్య, భర్త, వారి పిల్లలు. వారిలో అర్హులైన ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారు.
ఈ పథకానికి వయో పరిమితి ఏమిటి?
35 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకం వర్తించదు.
ఎన్ని సంవత్సరాలు ఈ స్టైపండ్ ఇస్తారు?
జూనియర్ న్యాయవాదికి తాను న్యాయవాద వృత్తిలో చేరిన మొదటి మూడు సంవత్సరాల వరకు ఈ స్టైపండ్ ఇస్తారు.
35 సంవత్సరాల వయసులోపు వారికి కూడా ఇస్తారు. ఒకసారి వారికి 35 సంవత్సరాల వయసు దాటితే పథకం ఆగిపోతుంది.
డబ్బులు ఎలా జమ చేస్తారు?
ఈ పథకానికి ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాకే నేరుగా ఈ స్టైపండ్ డబ్బులు పంపుతారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన e-Pragathi విభాగం ఒక ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహిస్తోంది.
దీనిలోనే అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తును పూరించి అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
http://ysrlawnestham.ap.gov.in లింక్‌కు వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏమేం డాక్యుమెంట్లు పొందుపరచాలి?
- న్యాయశాస్త్ర పట్టా (Law Degree Certificate)
- పుట్టిన తేదీ సర్టిఫికెట్ (Proof of date of birth)
- ఆధార్ కార్డు (Aadhaar card)
- 10వ తరగతి సర్టిఫికెట్ (Secondary School Certificate)
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ సర్టిఫికెట్ (State Bar Council certificate)
- సీనియర్ అడ్వొకెట్ అటెస్ట్ చేసిన అఫిడవిట్ (Affidavit attested by senior advocate)
- నివాస ధ్రువీకరణ పత్రం (Residential details for proof of domicile)
- బ్యాంకు ఖాతా వివరాలు (Bank account details)
అభ్యర్థికి తాను దరఖాస్తు చేసుకున్నట్లు ఎలా తెలుస్తుంది?
ఒకసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే, అభ్యర్థి మొబైల్ నెంబరు లేదా ఈ మెయిల్‌కు ప్రత్యేక ఐడీ నంబరు ఇస్తూ సందేశం వస్తుంది.
వెబ్‌పోర్టల్‌లో అభ్యర్థి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా పోర్టల్‌కు వెళ్లి దరఖాస్తు తాజా స్థితిని తెలుసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. కాబట్టి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఆ ఇబ్బంది ఉండదు.
ఏపీ బాటలో మరికొన్ని రాష్ట్రాలు
జూనియర్ న్యాయవాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ లానేస్తం పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా అక్కడి జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల రూ. 3000 స్టైపండ్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఉత్తరాదిన మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
‘జూనియర్ న్యాయవాదులకు ఊరట’
కొత్త న్యాయవాదులకు ఈ పథకంతో చాలా మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు చెప్పారు.
‘‘కొత్తగా వృత్తిలోకి ప్రవేశించిన న్యాయవాదులకు ఆరంభంలో ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లా నేస్తం స్టైపండ్ ఎంతో ఉపకరిస్తుంది. తొలి మూడేళ్ల వరకు ఈ పథకం వర్తింపజేయడంతో వారు వృత్తిలో నిలదొక్కుకునేందుకు తోడ్పడినట్లు అవుతుంది. ఇలా లబ్ధి పొందిన జూనియర్ న్యాయవాదులను నేను చాలా మందిని చూశాను’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్‌లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)