గుజరాత్: కూతురి వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టారని నిలదీసినందుకు సైనికుడిని చంపేశారు

ఒక సైనికుడిని చనిపోయేవరకు కొట్టారనే ఆరోపణలతో గుజరాత్ పోలీసులు, ఏడుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, తన టీనేజీ కుమార్తె వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మెలాజీ వఘేలా అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనపై ఈ దాడి జరిగింది.

ఆన్‌లైన్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అది వైరల్‌ అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వీడియోను ఒక టీనేజ్ బాలుడు అప్‌లోడ్ చేశాడని మెలాజీ ఆరోపించారు. ఆ బాలుడి కుటుంబ సభ్యులే మెలాజీపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.

ఈ దాడిలో మెలాజీ వఘేలా భార్య, కుమారుడు కూడా గాయపడ్డారు.

బాధితుడు మెలాజీ వఘేలా, భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో పనిచేశారు.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో శనివారం రాత్రి ఈ దాడి జరిగిందని వఘేలా భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ బాలునిపై అతని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసేందుకు మెలాజీతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడు ఆ టీనేజీ బాలుడి ఇంటికి వెళ్లారు.

పలు వార్తా నివేదికలు, ఆ వీడియోను ‘ఆశ్లీలమైనది’గా అభివర్ణించాయి. అయితే, బీబీసీ దీన్ని ధ్రువీకరించలేకపోయింది.

ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం... చర్చ ఒక గొడవగా మారింది. బాలుడి బంధువులు మెలాజీతో పాటు అతని కుటుంబ సభ్యులపై కర్రలు, పదునైన వస్తువులతో దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వఘేలా వెంటనే మృతి చెందగా, అతని కుమారుల్లో ఒకరు తలకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏడుగురు నిందితులపై పోలీసులు హత్య అభియోగాలతో కేసులు నమోదు చేశారు. వారిని సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీనిపై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)