You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: రాజకీయాల్లో ఇన్నాళ్లూ చక్రం తిప్పినా, తొలిసారి ప్రజాతీర్పు కోరుతున్న ప్రముఖులు వీళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొందరు నాయకులు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.
పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు ఎన్నికై రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ పోటీ చేయని నాయకులు కొందరు తొలిసారి ప్రజాతీర్పు కోరుతున్నారు.
అలాగే, కుటుంబ సభ్యుల కోసం రాజకీయంగా క్రియాశీలంగా పని చేసినప్పటికీ తాము స్వయంగా ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేయని నేతలూ ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
సీఎం రమేశ్
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ 2019 ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి తరువాత బీజేపీలో చేరిన సీఎం రమేశ్ 2012 నుంచి 2024 ఏప్రిల్ వరకు రెండు పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
ప్రస్తుత ఎన్నికలలో ఆయన అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఆయన పోటీ చేయడం ఇదే తొలిసారి.
సీఎం రమేశ్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తారన్న అంచనాల నేపథ్యంలోనే వైసీపీ కూడా ఆయనపై బలమైన అభ్యర్థిని ప్రకటించే ఉద్దేశంతో అక్కడి టికెట్ ఆలస్యం చేసింది.
రమేశ్ పోటీ ఖరారైన తరువాత వైసీపీ తమ పార్టీ నుంచి ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిని అభ్యర్థిగా ప్రకటించింది.
బడా కాంట్రాక్టర్‌గా పేరున్న సీఎం రమేశ్ పోటీ చేస్తుండడంతో అనకాపల్లి లోక్‌సభ స్థానంపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది.
సుజనా చౌదరి
అయిదేళ్ల కిందట తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన ఈ వ్యాపారవేత్త రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
కేంద్రంలో సహాయ మంత్రిగానూ పనిచేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ ఇక్కడ పోటీలో ఉన్నారు.
విజయ సాయి రెడ్డి
ఇటు వైసీపీలో కీలకంగా ఉండడమే కాకుండా అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకూ దగ్గరగా కనిపించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు.
వైసీపీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కొద్ది కాలం కిందట టీడీపీలో చేరడం.. నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఆయనపై పోటీగా విజయసాయిరెడ్డిని బరిలో దించింది వైసీపీ.
కొద్దినెలల కిందట వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన ప్రభాకరరెడ్డి, విజయసాయి రెడ్డిలు ఇప్పుడు నెల్లూరులో ప్రత్యర్థులుగా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
కాగా నెల్లూరు లోక్‌సభ స్థానంలో 2019లో వైసీపీ గెలిచింది. అంతకుముందు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1999లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది.
కొప్పుల రాజు
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.
1981 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కొప్పుల రాజు 2013లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటూ తన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగానూ ఉన్న కొప్పుల రాజు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి.
వైఎస్ షర్మిల
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌కు సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల తొలిసారి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.
ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఆమె పోటీ చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఆయన విజయం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాదయాత్ర చేశారు. అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలోనూ పాదయాత్ర చేశారు.
కానీ, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
చాలాకాలంగా రాజకీయాలలో ఉన్న ఆమె తొలిసారి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
- హీట్ వేవ్: ఉష్ణోగ్రత 37C దాటితే మన శరీరానికి ఏమౌతుంది? మెదడు ఎలా స్పందిస్తుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)