18 ఏళ్లు డ్రగ్స్‌ మత్తులోనే, 80 లక్షల అప్పు, రెండుసార్లు ఆత్మహత్యాయత్నం.. తల్లి, భార్య సహాయంతో చివరకు ఎలా బయటపడ్డారంటే

    • రచయిత, నవ్‌కిరణ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ధనౌలాలో నాలాగా ఎవరూ మాదకద్రవ్యాలకు అలవాటు పడలేదు, డబ్బు ఖర్చు పెడుతూనే ఉన్నా, నా కుటుంబం 70-80 లక్షల రూపాయల మేర అప్పుల్లో చిక్కుకుంది."

పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ చెప్పిన మాటలివి.

మన్‌ప్రీత్ దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మాదకద్రవ్యాల ఊబిలో కూరుకుపోయారు. కానీ, ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన 'డ్రగ్స్‌పై యుద్ధం'లో పోస్టర్ బాయ్ అయ్యారు.

పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలోని ఒక పట్టణం ధనౌలా. మన్‌ప్రీత్ సింగ్ అక్కడ రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. జీవితంలో తాను ఎదుర్కొన్న చెడు అనుభవాలను ఆయన పంచుకుంటున్నారు.

"నేను ఒకప్పుడు నా తల్లిని కోపంతో చెంపదెబ్బ కొట్టాను, ఇప్పటికీ దానిని మర్చిపోలేను. అది గుర్తుకు వచ్చినప్పుడు నాకసలు నిద్ర పట్టదు" అని మన్‌ప్రీత్ అన్నారు.

18-19 ఏళ్ల పాటు మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకున్నట్లు మన్‌ప్రీత్ చెప్పారు.

కానీ, ఇప్పుడు ఆయన పుష్-అప్‌లు చేయడం, పరుగెత్తడం, మైదానంలో ఆడుకోవడం కనిపిస్తుంది.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ పాఠశాలలు, కళాశాలలలో సెమినార్లు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు మన్ ప్రీత్.

మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడి తన జీవితాన్ని తిరిగి ఎలా గాడిలో పెట్టుకున్నారనేది మన్‌ప్రీత్ సింగ్ బీబీసీతో చెప్పారు.

మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం

పంజాబ్ ప్రభుత్వం 'డ్రగ్స్‌పై యుద్ధం' అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది, ఈ క్రమంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి విద్యాసంస్థల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ దీనిని ముందుండి నడిపిస్తోంది. మన్‌ప్రీత్ సింగ్‌ను ఈ ప్రచారంలో భాగం చేశారు.

మన్‌ప్రీత్ మద్యం, చిట్టా, స్మాక్, హెరాయిన్, నల్లమందు సహా అనేక రకాల డ్రగ్స్‌కు బానిసయ్యారు.

8వ తరగతిలో ఉండగా ఒక హిందీ సినిమాలో హీరో ధూమపానం చేయడం చూసి దానిని అలవాటు చేసుకున్నట్లు మన్‌ప్రీత్ చెప్పారు. ఇది తనకు వ్యసనంగా మారిందని, కళాశాలకు చేరే సమయానికి వివిధ రకాల డ్రగ్స్ తీసుకునే స్థాయికి చేరిందని ఆయన తెలిపారు.

ఆఖరికి ప్రభుత్వ ఓపియాయిడ్ కేంద్రాలలో లభించే బుప్రెనార్ఫిన్ ట్యాబ్లెట్లను రోజుకు ఆరు తీసుకునేంతగా ఆ వ్యసనం ఉండేదని తెలిపారు.

12 ఎకరాల భూమి ఉన్న మన్‌ప్రీత్ సింగ్ దాదాపు 70-80 లక్షల రూపాయలు మాదకద్రవ్యాల కోసం ఖర్చు చేశారు.

పొలం కౌలుకు ఇచ్చి..

మన్‌ప్రీత్ సింగ్ చెప్పిన ప్రకారం, ఆయన బాగా చదివేవారు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత బర్నాలాలోని ఎస్డీ కళాశాలలో చేరారు. కానీ, డ్రగ్స్‌కు బానిసవడంతో బీఏలో రెండో ఏడాదే చదువు మానేశారు. మన్‌ప్రీత్ వ్యవసాయ నేపథ్యమున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి.

తండ్రి మరణం కారణంగా ఆయనకు చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.

"నేను వ్యవసాయం చేయకుండా భూమిని కౌలుకు ఇచ్చి, వచ్చిన డబ్బును డ్రగ్స్ కోసం ఖర్చు చేశాను" అని చెప్పారు మన్‌ప్రీత్.

మన్‌ప్రీత్ ఒకసారి తన పొలంలో నుంచి 7 లక్షల రూపాయల విలువైన చెట్లను అమ్మేసినట్లు, ఆ డబ్బులతో మాదకద్రవ్యాలు కొన్నట్లు చెప్పారు.

డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకపోతే, ఇంట్లోకి వెళ్లి తనను తాను హాని చేసుకోవడానికి ప్రయత్నించేవాడినని మన్‌ప్రీత్ చెప్పారు.

రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. కుటుంబీకులు ఆ సమయంలో మన్‌ప్రీత్‌ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, స్పృహలోకి వచ్చిన తర్వాత, మన్‌ప్రీత్ మళ్లీ డ్రగ్స్ కోసం డబ్బులు అడగడం ప్రారంభించారు.

ఎలా బయటపడ్డారు?

మన్‌ప్రీత్ సింగ్ మాదకద్రవ్యాలకు బానిసైన కాలంలో డైరీ రాయడం మొదలుపెట్టారు. తనను తాను మార్చుకోవాలనే అతని కోరికను డైరీ ప్రతిబింబించింది. మన్‌ప్రీత్ మాదకద్రవ్యాలను మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు తల్లి, భార్య ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచారు.

మన్‌ప్రీత్ సిక్కు ఆచారాలను పాటిస్తూ రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ నుంచి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు మన్‌ప్రీత్ తన జీవిత కథ ద్వారా యువత డ్రగ్స్ బానిసత్వం నుంచి బయటపడటానికి సహాయం చేయాలనుకుంటున్నారు.

మాదకద్రవ్యాలను మానేసిన తర్వాత, మన్‌ప్రీత్ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం చేయడం ప్రారంభించారు. వ్యవసాయం మొదలుపెట్టారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచిస్తున్నారు.

"జీవితంలో ఏదైనా సాధించొచ్చు, కానీ మాదకద్రవ్యాల ఊబిలో వృథా చేసిన విలువైన కాలాన్ని తిరిగి తీసుకురాలేం" అని మన్‌ప్రీత్ సింగ్ అంటున్నారు.

మన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ మానేశాక ఇంట్లో పరిస్థితులు మారాయని ఆయన తల్లి హర్పాల్ కౌర్, భార్య రాజ్‌విందర్ కౌర్ అంటున్నారు.

అధికారులు ఏమంటున్నారు?

మాదకద్రవ్యాల వ్యసనంపై మలేర్‌కోట్ల ప్రభుత్వ కళాశాలలో ఏఎన్టీఎఫ్ ఒక సెమినార్ నిర్వహించింది. ఇందులో తన 'అనుభవాల'ను పంచుకోవడానికి మన్‌ప్రీత్ సింగ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

మన్‌ప్రీత్ మాదకద్రవ్యాలను మానేశారని, ఆయన తన అనుభవాన్ని పంచుకుంటే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఏఎన్టీఎఫ్ అధికారి భూపిందర్ సింగ్ అన్నారు.

మన్‌ప్రీత్ వంటి యువత తమ అనుభవాలను పంచుకుంటే మార్పు కనిపిస్తుందని బర్నాలా జిల్లా డిప్యూటీ కమిషనర్ టి. బెనిత్ తెలిపారు.

బెనిత్ ఇటీవల మన్‌ప్రీత్ సింగ్‌ను కలిశారు, పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొని, యువతకు అవగాహన పెంచడంలో సాయపడాలని కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)