టవల్ ఎన్ని రోజులకు ఉతకాలి, ఉతక్కపోతే ఎలాంటి జబ్బులొస్తాయి

సాధారణంగా చాలామంది దుస్తులు కంపు కొడుతుంటేనో, చెమటకు తడిస్తేనో, మరకలు పడితేనో వెంటనే ఉతుకుతారు.. లేదంటే ఇంకోసారి ఉతక్కుండానే వాడొచ్చేమో అని ఆలోచిస్తారు..

మరి, రోజూ ఉపయోగించే టవల్ ఎన్ని రోజులకోసారి ఉతకాలి? రోజూ ఉతకాలా? తరచూ ఉతక్కపోతే ఏమవుతుంది? జబ్బులొస్తాయా?

బ్రిటన్‌లో 2,200 మంది యువతీయువకులతో ఇటీవలే ఈ అంశంపై సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో అత్యధికులు దీనిపై తమకు సరైన అవగాహన లేదని చెప్పారు.

సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది మూణ్నాలుగు నెలలకు ఒకసారి టవల్ శుభ్రం చేస్తామని చెప్పారు.

ఈ సర్వేలో వెల్లడైన అంశాలపై ‘హోం హైజీన్ ఎక్స్‌పర్ట్’ సాలీ బ్లూమ్‌ఫీల్డ్ ‘బీబీసీ’తో మాట్లాడారు.

‘ఈ సర్వే ఫలితాలు చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది. టవల్ తరచూ ఉతక్కపోతే గరుకుగా మారుతుంది. చెమటతో నిండిపోయి వాడడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది కదా’ అన్నారు.

అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో అయిదుగురిలో ఒకరు తాము నెలకోసారి టవల్ ఉతుకుతామని చెప్పారు.

25 శాతం మంది వారానికి ఒకసారి ఉతుకుతామని చెప్తే, ప్రతి 20 మందిలో ఒకరు మాత్రం వినియోగించిన ప్రతిసారి టవల్‌ను ఉతుకుతామని చెప్పారు.

అసలు టవల్ ఎందుకు ఉతకాలి?

ఎన్ని రోజులకు ఒకసారి టవల్ ను ఉతకాలి అన్న ప్రశ్నకు బ్లూమ్‌ఫీల్డ్ సమాధానం ఇస్తూ ‘కనీసం వారానికి ఒకసారి అయినా టవల్ ఉతకాలి’ అని చెప్పారు.

‘చూడ్డానికి టవల్ మనకు శుభ్రంగా కనిపించినా రోజులు గడుస్తున్నకొద్దీ అందులో లక్షల క్రిములు చేరుతాయి. ఫలితంగా దాన్ని వినియోగించేవారికే కాదు వారితో ఉన్నవారికీ తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది’ అన్నారు.

‘టవల్‌ను ఎప్పటికప్పుడు ఉతక్కపోతే దానిపై పేరుకుపోయే సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. ఆ తరువాత ఒక్క ఉతుకులో వాటన్నిటినీ తొలగించడం కష్టం’ అని చెప్పారు.

‘స్నానం చేశాక శరీర భాగాలను టవల్‌తో తుడుచుకుంటాం. చేతులు, పాదాలు వంటివి తుడిచే సమయంలో అక్కడుండే సూక్ష్మజీవులు టవల్‌కు అతుక్కుంటాయి. శరీరంపై ఉండే అన్ని సూక్ష్మజీవులు హానికరమైనవి కాకపోవచ్చు. కానీ, గాయాలు, చర్మం తెగిన ప్రాంతాలలో సూక్ష్మజీవులు చేరితే మాత్రం ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది’ అని బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు.

“స్నానం చేశాక పలు శరీర భాగాలను శుభ్రంగా తుడుచుకుంటాం. చేతులు, పాదాల వంటి తుడుచుకున్న సమయంలో సూక్ష్మ జీవులు టవల్ కు అంటుకుంటాయి. శరీరంపై ఉండే అన్ని జీవులు హానికరమైనవి కాకపోవచ్చు, కానీ అవి గాయాలు, చర్మం తెగిన భాగాల్లో చేరితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది” అని బ్లూమ్ ఫీల్డ్ అన్నారు.

ఒంటరిగా ఉన్నా కూడా తరచుగా ఉతకాలా?

‘ఇతరులతో కలిసి ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన శరీరంపై ఉండే జీవులు మనకు ఆనారోగ్యాన్ని కలిగించేవి కాకపోవచ్చు. కానీ అవి మనతో ఉన్నవారి శరీరంలోకి చేరితే వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది’ అన్నారు.

‘క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తాయి. ఒకే టవల్ ను ఇద్దరు వినియోగించినా, లేదా రెండో వారి దుస్తులతోపాటు మన టవల్ ను కలిపి ఉతికినా కూడా క్రిములు వ్యాప్తిస్తాయి. ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని అనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఒంటరిగా నివసిస్తుంటే గనుక రిస్క్ తక్కువ అని అనుకుంటుంటాం. అదీ నిజమే, కానీ అలాంటి సందర్భంలో కూడా 15 రోజులకు మించి టవల్‌ను ఉతకకుండా ఉండొద్దు’ అని అన్నారు.

బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) డెర్మటాలజిస్ట్ క్రిస్టినా బీబీసీతో మాట్లాడుతూ.. తన దగ్గరకు వచ్చేవారిని టవల్‌ను ఎంత తరచుగా ఉతుకుతారు అని అడుగుతుంటానని చెప్పారు.

‘ఒకవేళ ఎవరైనా ముఖంపై మొటిమలు, లేదా జుట్టు కుదుళ్లలో మంట అని చెప్తే గనుక టవల్‌ను తరచూ ఉతికి వినియోగించమని చెప్తాను’ అన్నారు.

చర్మ సమస్యలు రావడానికి ఇంట్లో శుభ్రత లోపించడం, టవల్ శుభ్రంగా లేకపోవడం వంటి అంశాలు కూడా కారణం అవుతాయని అన్నారు.

“ఇలాంటి శుభ్రతాపరమైన విషయాలను పట్టించుకోవాలి, లేదంటే సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి“ అని అన్నారు.

ఎక్సర్‌సైజ్ చేసేవారి సంగతేంటి?

వ్యాయామంపై ఆసక్తి ఉన్నవారు ఆ కసరత్తులు చేస్తున్న సమయంలో ముఖం తుడుచుకోవడానికి టవల్ వినియోగిస్తారు.

అలాంటివారు తరచూ టవల్‌ను ఉతికి వాడాలని బ్లూమ్ ఫీల్డ్ అన్నారు.

“చెమటగా అనిపించినప్పుడు చర్మాన్ని తుడుచుకుంటాం. ఆ సమయంలో టవల్‌పై ఎక్కువశాతం బ్యాక్టీరియా చేరుతుంది. ఒకవేళ తరచూ టవల్ ను ఉతక్కపోతే ఎక్కువ మురికిగా మారుతుంది. శుభ్రపరచడం కష్టం అవుతుంది. ఫేస్ టవల్, బాత్ టవల్ వేర్వేరుగా వాడటం ఆరోగ్యకరమైన అలవాటు’ అని క్రిస్టినా అన్నారు.

‘వినియోగించిన తర్వాత టవల్ ను సూర్యరశ్మి పడే ప్రాంతంలో ఆరవేయడం మర్చిపోవద్దు” అని అన్నారు.

‘మీ ముఖాన్ని తాకకూడని కొన్ని జీవులు కూడా టవల్ పై ఉండి ఉండొచ్చు. కాబట్టి తరచుగా టవల్‌ను ఉతకాలి” అని అన్నారు.

బ్లూమ్ ఫీల్డ్ కూడా మరో విషయాన్ని ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులు, వాషింగ్ మిషన్ వినియోగ ఖర్చును కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. టవల్‌ను రెండు మూడు నెలలకోసారి వేడి నీళ్లలో ఉతకడం కంటే ఎప్పటికప్పుడు సాధారణ నీళ్లలో ఉతకడం మంచిదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)