ఐఫోన్ 15: ధర ఎంత? ఫీచర్లు ఏమేం ఉన్నాయి

    • రచయిత, డేనియల్ థామస్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది.

యూరోపియన్ యూనియన్ సూచన మేరకు ఈ కొత్త ఐఫోన్‌ సిరీస్‌లో లైట్‌నింగ్ ఛార్జింగ్ పాయింట్‌ను తీసేసినట్లు యాపిల్ వెల్లడించింది.

మంగళవారం నిర్వహించిన యాపిల్ మెగా ఈవెంట్ వేదికగా 15 సిరీస్‌ను విడుదల చేస్తూ యూనివర్సల్ ఛార్జర్‌గా యూఎస్‌బీ-సీ కేబుల్‌ను వాడుకోవచ్చని చెప్పింది.

యూఎస్‌బీ-సీ కేబుల్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఐఫోన్‌లో వాడడం ఇదే తొలిసారి.

ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే చాలా డివైజ్‌లలో ఈ ఛార్జింగ్ పాయింట్‌ను వాడుతున్నారు.

అత్యంత అధునాతన చిప్‌తో కొత్త యాపిల్ వాచ్ సిరీస్‌లను కూడా ఈ ఈవెంట్‌లో విడుదల చేసింది.

కానీ, యాపిల్ ఈ ఏడాది ఈవెంట్‌లో ఎలాంటి ఆకర్షణీయ అప్‌డేట్లను ప్రవేశపెట్టకపోవడం కొంత నిరాశ కలిగించిందని టెక్ నిపుణుడు ఒకరు చెప్పారు.

ఐఫోన్, యాపిల్ వాచ్‌లకు మంచి పేరు, అమ్మకాలు ఉన్నందున్న ఇది అంత ఆశ్చర్యపర్చలేదని సీసీఎస్ ఇన్‌సైట్‌కు చెందిన బెన్ వుడ్ అన్నారు.

వచ్చే వారం నుంచి అమ్మకానికి రానున్న కొత్త ఐఫోన్ హ్యాండ్‌సెట్‌లో 2012 తర్వాత తొలిసారి ప్రత్యామ్నాయ ఛార్జింగ్ పోర్టును ఆఫర్ చేస్తోంది సంస్థ.

యూఎస్‌బీ-సీ కేబుల్ ఇప్పటికే చాలా యాపిల్ ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లకు వాడుతున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

తన ఎయిర్‌పాడ్స్ ప్రొ ఇయర్‌ఫోన్స్, వైర్డ్ ఇయర్‌పాడ్స్ హెడ్‌ఫోన్స్ కొత్త వెర్షన్లకు కూడా ఈ కేబుల్‌ను తీసుకురానున్నట్లు చెప్పింది.

2024 డిసెంబర్ నాటికి అన్ని డివైజ్‌లు యూనివర్సల్ చార్జర్‌కు అనుకూలంగా ఉండాలని యురోపియన్ యూనియన్ ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల జీవితాలను సులభతరం చేసేలా, డబ్బులను ఆదా చేసేలా, ఛార్జర్ల తిరిగి వాడకం ద్వారా ఈ-వేస్ట్‌ను తగ్గించేందుకు తన ఛార్జింగ్ పోర్టును తీసేసి, యూనివర్సవల్ ఛార్జింగ్ పాయింట్‌ను తీసుకురావాలని ఈ టెక్ దిగ్గజానికి యూరోపియన్ యూనియన్ చెప్పింది.

రాబోయే ఏళ్లలో డిస్‌కార్డ్ చేసే కేబుల్స్ సంఖ్య పెరుగుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణానికి అనుకూలంగా

తన కొత్త యాపిల్ డివైజ్‌ల విషయంలో పలు పర్యావరణానికి అనుకూలమైన వాగ్ధానాలను చేసింది యాపిల్. తన యాపిల్ వాచ్‌ను మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది.

కొత్త వాచ్, ఐఫోన్ బ్యాటరీల్లో, ఇతర విభాగాల్లో రీసైకిల్ మెటీరియల్ వాడకాన్ని పెంచుతున్నట్లు యాపిల్ తెలిపింది.

తన యాక్సెసరీల్లో ఇక లీథర్ వాడకం ఉండదని కూడా కంపెనీ ధ్రువీకరించింది.

2030 నాటికల్లా వ్యాపారాలను కార్బన్ న్యూట్రల్‌గా మార్చనున్నట్లు వాగ్ధానం చేసింది.

కొత్త ఐఫోన్ 15 రేంజ్ మోడల్స్ ఇప్పటి వరకు రూపొందిన ఐఫోన్లలో అత్యంత ఉన్నతమైన, సమర్థవంతమైన మోడల్స్ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు.

ఐఫోన్ 15, 15 ప్లస్‌లకు యాపిల్ ఈసారి ప్రకాశవంతమైన స్క్రీన్లను ఇచ్చింది. అంతేకాక, కెమెరా సిస్టమ్‌లను కూడా మెరుగుపర్చింది. హైఎండ్ ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్‌లు టైటానియం ఫ్రేమ్‌తో మార్కెట్లోకి వచ్చాయి.

ప్రొ, మ్యాక్స్‌లలో మ్యూట్ స్విచ్ఛ్ స్థానంలో యాక్షన్ బటన్‌ ఉంది. ఇది పలు రకాల ఫంక్షన్లకు కస్టమైజ్డ్‌లా ఉపయోగపడుతుంది.

రెండు వేళ్లతో డబుల్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఫోన్ కాల్ స్వీకరించడం, ముగించడం లాంటి ఫీచర్‌ను కొత్త యాపిల్ వాచ్‌లో ప్రవేశపెట్టింది.

కానీ, ముందటి డివైజ్‌లతో పెద్దగా తేడా లేని ఈ డివైజ్‌లకు ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారులు వెచ్చించగలరా? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

కొత్త ఐఫోన్ల ధరలు

ఐఫోన్ 15

  • 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఐఫోన్ 15 ధర భారత్‌లో రూ.79,900గా నిర్ణయించారు.

ఐఫోన్ 15 ప్లస్

  • 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900.

ఐఫోన్ 15 ప్రో

  • 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900.

ఐఫోన్ 15 ప్రో మేక్స్

  • 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ధర రూ.1,59,900.

ఇవీ ఫీచర్లు

ఐఫోన్ 15, 15 ప్లస్‌లలో ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉన్నాయి.

ఐఫోన్ 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్‌లలో టైటానియం డిజైన్, సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, సరికొత్త ఏ17 ప్రో చిప్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది.

100 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తో ఇవి తయారయ్యాయి.

పల్చటి బోర్డర్లు, తేలికపాటి బరువు వీటి మరో ప్రత్యేకత. వచ్చే వారం నుంచి ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి.

ఐఫోన్‌కు పోటీగా హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్

‘‘జీవన వ్యయాలు బాగా పెరిగిన ఈ సమయంలో ఈ కొత్త డివైజ్‌లను కొనుగోలు చేసేలా యూజర్లను ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు’’ అని పీపీ ఫోర్‌సైట్ ఫౌండర్, అనలిస్ట్ పాలో పెస్కాటోర్ అన్నారు.

అధికారులు ఐఫోన్లు వాడొద్దంటూ చైనా ప్రభుత్వం నిషేధం విధించినట్లు రిపోర్టులు వచ్చిన తర్వాత యాపిల్ షేర్లు భారీగా పడిపోయాయి. షేర్ల పతనాన్ని ఈ ఈవెంట్ ఆపలేకపోయింది. మంగళవారం కూడా యాపిల్ షేర్లు స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి.

తమ దేశంలోనే తయారవుతున్న ఐఫోన్లను చైనా నిషేధించడం కాస్త విచిత్రంగాను ఉంటుంది. చైనాను వీడేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది.

ఐఫోన్‌కు పోటీగా హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను చైనాలో విడుదల చేయడంతో, ఇన్వెస్టర్ల భయాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.

2023 రెండో క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 294.5 మిలియన్ ఫోన్ల నుంచి 268 మిలియన్లకు పడిపోయింది.

యాపిల్ షిప్‌మెంట్లు కూడా 46.5 మిలియన్ ఫోన్ల నుంచి 45.3 మిలియన్ ఫోన్లకు పడిపోయినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్‌లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)