ఫియోనా: ఈ ‘ఒంటరి గొర్రె’ గురించి ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?

    • రచయిత, కాలమ్ వాట్సాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండేళ్ళుగా స్కాట్లాండ్‌లోని ఓ కొండంచు ప్రాంతంలోని గుహలో చిక్కుకుపోయిన ఓ ఒంటరి గొర్రె బ్రిటన్ మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది.

ఈ గొర్రెను స్వేచ్ఛగా అభయారణ్యలో వదిలివేయాలని జంతు ప్రేమికులు కోరుతుండగా, దానిని సురక్షితంగా జంతు ప్రదర్శనశాలలో ఉంచాలని మరికొందరు వాదిస్తున్నారు.

‘ఒంటరి గొర్రె’గా బ్రిటన్‌లో ఫేమస్ అయిన ఈ గొర్రె రెండేళ్ళకు పైగా పర్వతప్రాంత అంచులలో చిక్కుకుపోయింది.

ఈ గొర్రెను రక్షించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా, దానిని ఫామ్‌లో ఉంచాలన్న ఆలోచన వివాదాస్పదంగా మారింది. అదో జంతు ప్రదర్శనగా మారుతుందని జంతు హక్కుల సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ గొర్రెకు ఫియోనా అనే పేరు పెట్టారు. దీని ఒంటిపై బాగా పెరిగిపోయిన ఉన్నిని తొలగించాకా ఇది నున్నగా కనిపించింది.

అయితే దీనికోసం ఓ ఆవాసం సిద్ధం చేసిన దాల్‌స్కోన్ ఫామ్ వద్ద ఆందోళనకారులు కనిపించడంతో ఫియోనాను ఇంకా అజ్ఞాతంలోనే ఉంచారు.

ఈ గొర్రె కొండంచున చిక్కుకుపోయిన వైనం గత నెలలో పతాకశీర్షికలలో నిలిచింది.

ఓ క్యాకర్ ( ఓచిన్నపడవపై సముద్రంలో ప్రయాణించే వ్యక్తి) రెండేళ్ళ కిందట తాను చూసిన గొర్రె ఇంకా అక్కడే ఉన్న వైనాన్ని గుర్తించి ఫోటో తీయడంతో, అది కాస్తా పతాక శీర్షికలలో నిలిచింది.

దీనిని అందరూ ‘ఒంటరి గొర్రె’ అని వ్యవహరించడం మొదలుపెట్టారు.

దీని రక్షణ కోసం ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌పై వేలాదిమంది సంతకాలు చేశారు.

గొర్రె కోసం ఆందోళన

శనివారం ఉదయం ఐదుగురు సభ్యుల బృందం గుహ ప్రాంతం నుంచి ఈ ఒంటరి గొర్రెను పైకి తీసుకురాగలిగింది.

అయితే ఈ గొర్రెను ఫామ్ పార్క్‌కు తరలిస్తారనే ఆలోచనపై జంతు హక్కుల సంఘాలు వెంటనే స్పందించాయి. గొర్రెను ఫామ్‌కు తరలించడం ద్వారా అదొక ప్రదర్శన వస్తువుగా, సంపాదనా వస్తువుగా మారుతుందని ఈ సంఘాలు వాదిస్తున్నాయి.

గతంలో డాల్‌స్కోన్ ఫామ్ వద్ద గుర్రపు పందాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యానిమల్ రైజింగ్ కార్యకర్తలు ఆదివారం ఈ ఫామ్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.

‘‘ఇదొక అహింసాయుత, శాంతియుత నిరసన ప్రదర్శన. ఫియోనా (గొర్రె)ను ఈ ఫామ్‌లో ఉంచడం కాకుండా అభయారణ్యంలో వదిలేయాలని కోరుతున్నాం’’ అని యానిమల్ రైజింగ్ స్వచ్ఛంద సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

ఫియోనాను రక్షించడానికి తమసభ్యులు గతంలోనే కొండంచుకు దిగి, అది మనుషులకు మచ్చిక అయ్యేలా చేశారని ఈ గ్రూపు తెలిపింది. దానిని తాము రక్షించాలనుకునే ప్రయత్నంలో ఉండగానే, దానిని కొండంచునుంచి పైకి తీసుకు వచ్చినట్టు తెలిసిందన్నారు.

ఆందోళనాకారులు ‘‘ ఫ్రీ ఫియోనా’’ ప్లకార్డులు పట్టుకుని, డ్రోన్‌లను ఎగరవేయడం వలన ఫామ్ సిబ్బంది, తమ కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారని డాల్‌స్కోన్ ఫామ్ కు చెందిన ‘ఫార్మర్ బెన్’ ఫేస్ బుక్ వీడియోలో తెలిపారు.

‘‘మేం ఫియోనాకు ఓ అద్భుతమైన ఫైవ్‌స్టార్ సౌకర్యాలు ఉండే ఇంటిని ఇవ్వబోతున్నాం. దాని కోసం మంచి స్నేహితులను కూడా సిద్ధం చేస్తున్నాం’’ అని ఆ వీడియోలో తెలిపారు.

‘‘మేం శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఫామ్ ను మూసివేశాం. ఐదునెలలపాటు ఫామ్ మూతపడే ఉంటుంది. కనుక ఫియోనా ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడటానికి తగినంత సమయం చిక్కుతుంది’’ అని చెప్పారు.

ఈ గొర్రెను ఒంటరిగానే ఉంచుతామని, పశువుల డాక్టర్ పర్యవేక్షణలో దానిని మెల్లిగా ఇతర జంతువులకు అలవాటుపడేలా చేయాలనే ఆలోచన ఉందని, ప్రస్తుతానికి ఈ గొర్రెను ఓ రహస్యస్థలంలో ఉంచినట్టు తెలిపారు.

‘‘దానికి మంచి ఇల్లు ఇద్దామనుకుంటే అడ్డుకోవడం నిజంగా సిగ్గుచేటు’’ అని చెప్పారు.

అజ్ఞాతవాసంలోనే ఫియోనా

శనివారంనాడు ఈ ఒంటరి గొర్రెను కెమ్మీ విల్సన్ నేతృత్వంలో రక్షించారు. ఈయనే ఆదివారం భారీగా పెరిగిపోయిన గొర్రె ఉన్నిని కట్ చేసి, దానికి ఉపశమనం కల్పించారు.

తన ఫామ్‌లో ఫియోనాకు చోటులేదని, డాల్‌స్కోన్ ఫామ్ దానికి తగిన చోటు అని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో ఒకనాడు ఫియోనా యజమాని పై వచ్చిన విమర్శలను చూసి, తాను ఫియోనాను రక్షించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

నిజానికి ఫియోనాను రక్షించడానికి దాని యజమాని ప్రయత్నం చేశారని, కానీ తన సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టడం ఇష్టం లేక ఆ గొర్రెను అలాగే వదిలేశారని తెలిపారు.

ఫియోనా ఒంటరిగా పెరిగిన విషయాన్ని పక్కనపెడితే అది కొంత బరువు పెరిగినా ఆరోగ్యంగానే ఉంది. దానిని ఎక్కడ ఉంచాలనే విషయం తేలేదాకా ఫియోనా అజ్ఞాతవాసంలోనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)