You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిలిటెంట్లు జమ్మూని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీబీసీ గ్రౌండ్ రిపోర్టులో తేలిందేంటి?
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
రియాసి, కఠువా, రజౌరి, డోడా...జమ్మూలోని ఇటీవలి కాలంలో మిలిటెంట్ దాడులు జరిగిన ప్రాంతాలు.
సెప్టెంబర్ నెలాఖరులో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు పెరిగాయి.
ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.
కఠువా మినహా ఈ దాడులకు పాల్పడిన మిలిటెంట్లను ఇంకా పట్టుకోలేదు. ఎన్‌కౌంటర్‌లలో చంపలేదు.
జమ్మూలో గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న దాడులను నిశితంగా పరిశీలిస్తే.. నిందితులు ఇంకా పట్టుబడకపోవడం అనుమానాస్పదంగా ఉంది.
2021 అక్టోబరులో జమ్మూలోని పూంచ్, మెంధార్ ప్రాంతాల్లో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది సైనికులు మరణించారు. అప్పటి నుంచి నిందితులు సైన్యానికి, పోలీసులకు చిక్కడం లేదు.
ఈ రెండు ఎన్‌కౌంటర్ల తర్వాత భారత సైన్యం అడవులను గాలించడం ప్రారంభించింది. ఈ దట్టమైన అడవులలో నెలరోజులకు పైగా సైన్యం, మిలిటెంట్ల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘమైన ఎన్‌కౌంటర్‌గా పరిగణిస్తున్నారు. అయితే వారాలు గడిచినా ఆ మిలిటెంట్ల సమాచారం బయటికి రాలేదు.
వ్యూహంలో మార్పు?
మిలిటెంట్ల వ్యూహంలో మార్పు వచ్చిందని జమ్మూకశ్మీర్ పోలీస్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ అభిప్రాయపడ్డారు.
"మొదటిది, వారు (మిలిటెంట్లు) అడవులు, పర్వతాల పోరాటంలో శిక్షణ పొందారు. ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. స్నైపర్‌ల మాదిరి పని చేస్తున్నారు. ఈ ఆయుధాలకు ‘నైట్ విజన్’ ఉంటాయి, కాబట్టి రాత్రిళ్లూ ఉపయోగించారు" అని వైద్ అన్నారు.
"రెండోది, సైన్యంపై నిఘా పెట్టండి, వారి కదలికలను గమనించి, దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే మార్గం కనుక్కోండి అని వారికి ఆదేశాలు వచ్చాయి" అని ఆయన అన్నారు.
రజౌరి, పూంచ్ వంటి ప్రాంతాల్లో చొరబాట్లు, దాడులు సాధారణ సంఘటనలుగా మారిపోయాయి. తాజాగా మారిందేంటంటే..దాడికి పాల్పడిన వారు దొరక్కపోవడం. ఇది భద్రతా బలగాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. దీంతో సామాన్యుల్లో కూడా భయం, ఆందోళన నెలకొంది.
డాక్టర్ జమ్రుద్ మొఘల్ భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న పూంచ్‌లో నివసిస్తున్నారు.
"వారు వచ్చి దాడులు చేసి మాయమవుతారు. వారు ఎక్కడికి వెళుతున్నారు? నిమిషాలు లేదా సెకన్లలో సరిహద్దును దాటలేరు కదా? అంటే వారు ఇక్కడే ఎక్కడో ఉన్నారని అర్థం. అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో చూసి ఉంటారు. పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇది దుర్భేద్యమైన ప్రాంతం.’’ అని జమ్రుద్ అన్నారు.
పూంచ్‌లో నివసించే మొహమ్మద్ జమాన్ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన పిర్ పంజాల్ మానవ హక్కుల సంస్థను నడుపుతున్నారు.
"మొత్తం వ్యూహం మారిందనుకుంటున్నాం. గెరిల్లా యుద్ధం గురించి విన్నాం. అదే మాదిరి వాళ్లు (మిలిటెంట్లు) వచ్చి వాహనాలు, భద్రతా దళాలపై దాడి చేస్తున్నారు. ఆ తర్వాత మాయమవుతున్నారు. అడవుల్లో దాక్కుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం’’ అని అన్నారు జమాన్.
సాయంత్రం 6 దాటితే..
జూన్ 11న కఠువాలోని సుహాల్ గ్రామంలో ఇద్దరు మిలిటెంట్లు దాడులు చేశారు. వారిలో ఒకరు తన సొంత గ్రెనేడ్ పేలుడుతో, మరొకరు భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
ఆ రోజు సుహాల్‌లో ఏం జరిగిందనే విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు ప్రత్యక్ష సాక్షులు మాకు చెప్పారు.
‘‘ ఒకతను మమ్మల్ని పిలిచారు, తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగారు. ‘నీళ్లు ఇస్తాను నువ్వెవరు?’ అని అడిగా. ముందు నీళ్లు ఇవ్వండి, ఆ తర్వాత చెబుతానన్నారు. ‘ముందు నీ పేరు చెప్పు, నీళ్లు తెస్తాను’ అన్నాను. సరే వచ్చి కూర్చో, మనం మాట్లాడుకుందాం అన్నారు. అతను డోగ్రీ, పంజాబీ కలిసిన భాషలో మాట్లాడారు. నేను ముందుకు అడుగు వేయగానే, అతను చేతుల్లోకి ఆయుధాన్ని తీసుకున్నారు. నేను పరిగెత్తాను. అతను కాల్చడం ప్రారంభించారు.’’ అని ఒక యువకుడు వెల్లడించారు.
ఇద్దరు వ్యక్తులు వచ్చి తాగేందుకు నీళ్లు అడిగారని సుహాల్ గ్రామానికి చెందిన దుకాణదారుడు ఒకరు చెప్పారు.
"నీళ్లు తాగిన తరువాత, నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే షాప్ షట్టర్ మూసివేసి, ఉదయం వరకు లోపలే పడుకున్నాను" అని ఆయన అన్నారు.
ఆ గ్రామంలోని ఓ ఇంటి గోడలపై బుల్లెట్ గుర్తులు కనిపించాయి. ఓంకార్ నాథ్ ఇంటిపై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి.
"మిలిటెంట్లు వచ్చారని చెప్పారు. వాళ్లు గ్రెనేడ్లు విసురుతున్నారు. ఓంకార్ చూడటానికి బయటికి వెళ్లగానే, అతనిపై కాల్పులు జరిపారు" అని ఆయన 90 ఏళ్ల తల్లి జ్ఞానోదేవి గుర్తుచేసుకున్నారు.
"నాలుగు బుల్లెట్లు తగిలాయి. మాకు భయమేస్తోంది. సాయంత్రం 6 గంటలయితే గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. వాళ్లు మళ్లీ వస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు." అని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.
అటవీ ప్రాంతంలోనే దాడులు..
సుహాల్ గ్రామంలో కాల్పులకు పాల్పడిన ఇద్దరూ మరణించారు. అయితే ఈ గ్రామ ప్రజల ఆందోళనలు అలాగే ఉన్నాయి.
ఈ గ్రామంలో నివసించే రింకు శర్మ "మిలిటెంట్లు చుట్టూ ఉన్నారనే భావనతోనే జనం ఉన్నారు. ప్రస్తుతం దాడులన్నీ అడవుల సమీపంలోనే జరిగాయి. ఇది కూడా అటవీ ప్రాంతం కాబట్టి, ప్రజల్లో మరింత భయం ఉంది.’’ అని అన్నారు.
సుహాల్ గ్రామం మాదిరి జమ్మూలోని అనేక ప్రాంతాలు దట్టమైన అడవులతో ఉన్నాయి. ఇక్కడికి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దట్టమైన అడవుల్లో తలదాచుకోని, మిలిటెంట్లు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
జూన్ 11న సుహాల్ గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటన తర్వాత ఇక్కడి ప్రజల్లో భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
రెండేళ్ల క్రితం దాడి
జమ్మూ ప్రాంతంలో గత రెండేళ్లలో జరిగిన హింసాకాండ గాయాలు ఇంకా మరిచిపోలేదు. రజౌరిలోని ధంగ్రీ గ్రామంలోని ఒక ఇంటి దగ్గర ఇప్పుడు పారామిలటరీ బలగాలు కాపలాగా ఉన్నాయి.
2022 డిసెంబర్ 31 రాత్రి ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపిన ప్రదేశం ఇదే. మరుసటి రోజు ఈ ఇంటి సమీపంలో బాంబు పేలింది. ఈ రెండు ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. అయితే, నిందితులు తప్పించుకున్నారు. ఈ దాడిలో సరోజ్ బాలా ఇద్దరు చిన్న కుమారులు చనిపోయారు. సరోజ్ ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సరోజ్ బాలా మాట్లాడుతూ "ఎవరైనా తమ పిల్లల్ని మరచిపోగలరా? ఏదైనా వాహనం వస్తే నా పిల్లలు వస్తున్నారనుకుంటున్నా. నా పిల్లలు బతికే ఉన్నారని అనుకుంటూ ఉంటాను. నా ఇంట్లో ఇటుకలు, రాళ్లు మాత్రమే మిగిలున్నాయి. పైగా నా పిల్లలు చనిపోయి పద్దెనిమిది నెలలు గడిచాయి. ఇంత పెద్ద నిఘా సంస్థలను మోహరించినా, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మేము ఎదురుచూస్తున్నాం. దేవుడు మా పిల్లలకు న్యాయం చేస్తారు" అని అన్నారు.
మిలిటెంట్లు పాకిస్తాన్ నుంచి వచ్చారని చాలామంది అంటున్నారని, మరి వాళ్లు ఇక్కడికి ఎలా వచ్చారు? భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయని సరోజ్ ప్రశ్నించారు. స్థానికుల సాయం లేకుండా అలాంటి దాడులు జరగవని ఆమె ఆరోపించారు. వాళ్లు ఏం తింటారు? ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు.
‘’బార్డర్ మూసి ఉన్నా వస్తున్నారంటే ఏదో ఒక మార్గంలో వస్తున్నారనే అర్థం, దాన్ని మూసేయాలి’’ అని సరోజ్ అన్నారు.
రాజౌరికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పూంచ్‌లోనూ ఇలాంటి అభిప్రాయాలే విన్నాం.
2022 నవంబర్‌లో రాజౌరి అడవులలో సెర్చ్ ఆపరేషన్ సమయంలో పూంచ్‌లోని అజోత్ గ్రామానికి చెందిన మొహమ్మద్ రషీద్ కుమారుడు హవల్దార్ అబ్దుల్ మజీద్ మిలిటెంట్ల కాల్పుల్లో మరణించారు. ఆయనకు మరణానంతరం కీర్తి చక్ర లభించింది.
‘‘ఎవరైనా అపరిచితుడు నా ఇంటికి వస్తే, ఇంట్లో ఎవరు ఎక్కడ కూర్చుంటారో, ఎవరు ఎక్కడ పడుకుంటారో తెలియదు. మా వైపు నుంచి ఎవరో ఆయనకు చెప్పి ఉంటారు, ఆపై ఆయన దాడి చేస్తారు. సైనికులు, పౌరులు, చిన్నపిల్లలు చనిపోతున్నారు’’ అని రషీద్ అన్నారు.
జమ్మూనే టార్గెట్ ఎందుకు?
ఇటీవలి పరిణామాలతో ఎదురవుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే: జమ్మూను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కశ్మీర్ లోయ కాకుండా జమ్మూని టార్గెట్ చేయడం వెనుక మిలిటెంట్ల కొత్త వ్యూహం ఏదైనా ఉందా?
‘‘2007-08 తర్వాత జమ్మూలో ఉగ్రవాదం అంతమైందని, అవసరాన్ని బట్టి మాత్రమే అక్కడ భద్రతా బలగాలను మోహరించారు. లద్దాఖ్‌లోని చైనా, భారత్ సరిహద్దు వద్ద ఏదైనా ఘర్షణ తలెత్తితే జమ్మూకు ఆర్మీ, నేషనల్ రైఫిల్స్ దళాలను పంపేవారు" అని మాజీ డీజీపీ వైద్ అన్నారు.
"జమ్మూలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపును కూడా తగ్గించారు. వారిని కశ్మీర్‌కు పంపారు. విలేజ్ డిఫెన్స్ కమిటీలు నిర్వీర్యం అయ్యాయి. ఈ పరిస్థితులను పాకిస్తాన్ ఉపయోగించుకుని, జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించిందనుకుంటున్నా." అని వైద్ అభిప్రాయపడ్డారు.
జమ్మూలో పరిస్థితి దురదృష్టకరమని, అయితే ఆందోళనకరం కాదని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు.
ఇటీవల 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన మనోజ్ సిన్హా "దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటామనే నమ్మకం నాకు ఉంది. ఇది పాకిస్తాన్ కుట్ర. స్థానిక రిక్రూట్‌మెంట్ అతిపెద్ద సవాలు. సైన్యం చొరబాట్లను ఎదుర్కొంటుంది. పోలీసులతో కలిసి మిలటరీ పనిచేస్తుంది. కొంత చొరబాటు జరిగినట్లు మాకు సమాచారం ఉంది. బలగాలు పొజిషన్లు తీసుకోవడం ప్రారంభించాయి. వ్యూహం సిద్ధంగా ఉంది, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ త్వరలో ఏర్పాటవుతుందని నమ్ముతున్నా. జమ్మూ ప్రజలు తీవ్రవాదంతో పోరాడారు. వీడీసీ సభ్యులకు ఆటోమేటిక్ వెపన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీనిని హోంమంత్రి పరిశీలిస్తున్నారు.’’ అని అన్నారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ 15, 25, అక్టోబర్ 1వ తేదీలలో జరుగుతాయి. ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటి నడుమ ఒక భయం మాత్రం వ్యక్తమవుతున్నది: జమ్మూపై దాడులకు వచ్చే ఎన్నికలను ఆపడమే లక్ష్యమా?
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)